ఆ ‘కోట’లో స్థానిక ఎన్నికల్లేవు!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:23 AM
శ్రీహరికోట 11వ శతాబ్దం నుంచి 1310 వరకు చోళరాజుల పాలనలో ఉండేది. తదనంతర కాలంలో చోళరాజులు గోల్కొండ నవాబుల చేతిలో ఓడిపోయారు.
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఉన్న శ్రీహరికోటకు ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం ఉంది. ఉపగ్రహాలప్రయోగంలో పేరున్న శ్రీహరికోటకు మరో ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికలు జరగవు. రాష్ట్రవ్యాప్తంగా నెల రోజులుగా స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ఉండగా.. అక్కడ ఆ వాతావరణమే లేదు. స్థానికులు శాసనసభ, లోక్‌సభ ఎన్నికల సమయంలో మాత్రమే ఓటు హక్కు వినియోగించుకుంటారు.
ఇదీ చరిత్ర
శ్రీహరికోట 11వ శతాబ్దం నుంచి 1310 వరకు చోళరాజుల పాలనలో ఉండేది. తదనంతర కాలంలో చోళరాజులు గోల్కొండ నవాబుల చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి శ్రీహరికోట గోల్కొండ నవాబుల అధీనంలోకి వెళ్లింది. 1801 జులై 31న ఆజిద్‌మూద్ దౌలా కర్నాటక్ నవాబు శ్రీహరికోటకు వెంకటగిరి జమీందారులను సామంతులుగా ప్రకటించారు. ఈ ప్రాంతాన్ని 1835లో బ్రిటిషు వారు స్వాధీనం చేసుకున్నారు.
1968లో ప్రఖ్యాత శాస్త్రవేత్త విక్రమ్ సారాభాయ్ రాకెట్ కేంద్రానికి శ్రీహరికోట దీవిని అనువైన ప్రాంతంగా గుర్తించి, ఆ దిశగా అడుగులు వేశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సంప్రదించడంతో అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మనందరెడ్డి శ్రీహరికోటలోని 43,360 ఎకరాల భూమిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో)కు అప్పగించారు. అప్పట్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎస్‌ఆర్ శంకరన్ పాత్ర ఇందులో కీలకం. ఇక్కడ 1969 ఫిబ్రవరి నుంచి రాకెట్ కేంద్ర కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్
6వేల జనాభా
ఇస్రోకు శ్రీహరికోటలోని 43,360 ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం అప్పగించిన తర్వాత రెవెన్యూ రికార్డులు కనుమరుగయ్యాయి. దీనికి కారణం నిషిద్ధ ప్రాంతం కావడమే. 1969 నుంచి ఇస్రో ఆధ్వర్యానే ఇక్కడ పనులన్నీ జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనులు, ఇతర కాలనీల్లోని వారి కోసం రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యాన జడ్పీ ఉన్నత పాఠశాలతో పాటు రెండు ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు చేశారు. ఇస్రో ఆధ్వర్యాన ఉద్యోగులు, కేంద్ర పారిశ్రామిక భద్రత దళాల పిల్లల కోసం 12వ తరగతి వరకు అంతరిక్ష కేంద్రీయ పాఠశాలను నిర్వహిస్తున్నారు.
ఇక్కడ ఉద్యోగుల ఫేజ్-1, ఫేజ్-2 కాలనీలతో పాటు చెంగళపాళెం, కీపాకం లేబర్‌కాలనీలు, శబరి గిరిజన కాలనీ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో సుమారు ఆరు వేల మంది వరకు నివాసముంటున్నారు. సార్వత్రిక ఎన్నికలకు మూడు పోలింగ్ కేంద్రాలను ఏర్నాటు చేస్తున్నారు.
శ్రీహరికోట దీవి ఇదీ..
ఇస్రోను ఏర్పాటు చేయక మునుపు శ్రీహరికోట దీవిలో సూలదొరువు, చెన్నుగారిపాళెం, తెట్టుపేట (నాటారిపాళెం), చిన్నరెట్టమాల, చెంగళపాళెం, కిలివేడు, బేరిపేట (జువ్వలింగపాళెం) పంచాయతీలు, వీటి పరిధిలో 14 మజరా గ్రామాలు ఉండేవి. వీటిల్లో 1642 మంది నివాసితులు, గిరిజనులు నివస్తుండేవారు. అప్పట్లో శ్రీహరికోట దీవికి తడ నుంచి పడవల ద్వారా రాకపోకలు సాగించేవారు. దీవిని ఇస్రోకు అప్పగించాక గిరిజనులను మినహాయించి, మిగిలిన వారందరినీ అక్కడనుంచి పంపించేశారు.
నిర్వాసితులకు పలుచోట్ల ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. శ్రీహరికోట దీవిని 1969లో రాకెట్ కేంద్రానికి ఎంపిక చేసిన తర్వాత దీనిని షార్(శ్రీహరికోట రేంజ్)గా పిలుస్తూ వచ్చారు. ఆ తర్వాత 2002 సెప్టెంబరు 5న ఇస్రో మాజీ చైర్మన్ సతీశ్ ఽధవన్ స్పేస్ సెంటర్ షార్‌గా మార్పు చేశారు.
- (శ్రీహరికోట, ఆంధ్రజ్యోతి)
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్