Share News

దక్షిణాదికి లోటుండదు

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:29 AM

ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, నైరుతి రాకపై భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌...

దక్షిణాదికి లోటుండదు

  • నైరుతి సీజన్‌లో ఆశాజనకంగా వర్షాలు

  • ఎల్‌నినో ప్రభావాన్ని ఐవోడీ తగ్గిస్తుంది

  • మే 14,15 తేదీలకే అండమాన్‌కు నైరుతి

  • ఐఎండీ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేశ్‌

విశాఖపట్నం/న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే దేశాన్ని తాకుతాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, నైరుతి రాకపై భారత వాతావరణ శాఖ మాజీ డైరెక్టర్‌ జనరల్‌ కేజీ రమేశ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు. ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల సీజన్‌లో సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని, అయితే ఉత్తరాదితో పోల్చితే దక్షిణ భారతంలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని పేర్కొన్నారు. రుతుపవనాలపై ఎల్‌నినో ఒక్కటే కాకుండా అరేబియా సముద్రం, భూమధ్య రేఖకు ఆనుకుని ఉన్న హిందూ మహాసముద్రంలో వచ్చే ఇండియన్‌ ఓషన్‌ డైపోల్‌ (ఐవోడీ), వాతావరణం మార్పులు వంటి అంశాలు కూడా ప్రభావం చూపిస్తాయన్నారు.

హిందూ మహాసముద్రంలో ప్రస్తుతం తటస్థంగా ఉన్న ఐవోడీ పాజిటివ్‌గా మారుతుందని, ఆగస్టు నాటికి వచ్చే ఎల్‌నినో తీవ్రతను పాజిటివ్‌ ఐవోడీ తగ్గిస్తుందని తెలిపారు. ఎల్‌నినో ఉన్నంత మాత్రాన నైరుతి రాకలో మార్పులు ఉండదని ఆయన స్పష్టంచేశారు. ఇప్పటివరకు ఉన్న అంచనాల మేరకు గడువు(కేరళకు జూన్‌ 1కి రావాలి) కంటే ముందే రుతుపవనాలు వస్తాయని, దీనిపై ఐఎండీ వచ్చే నెలలో బులెటిన్‌ విడుదల చేస్తుందని చెప్పారు. వచ్చే నెల 14, 15 తేదీల్లోనే అండమాన్‌కు రుతుపవనాలు వస్తాయని చెప్పారు. కాగా, భారత్‌లో రుతుపవన వర్షాలు తొందరగా ప్రారంభమవుతాయని యూరోపియన్‌ సెంటర్‌ ఫర్‌ మీడియం రేంజ్‌ వెదర్‌ ఫోర్‌కాస్ట్స్‌ కూడా తాజాగా అంచనా వేసింది. మే నెలాఖరుకే దక్షిణ భారతదేశంలో వర్షాలు ప్రారంభమవుతాయని చెప్పింది.


ఈ వార్తలు కూడా చదవండి...

ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్.. హనీట్రాప్ ముఠా సంచలనం

శబరిమల కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

బాలికల కాలేజీలో కోఎడ్యుకేషన్ ఏర్పాటుపై హైకోర్టు అసంతృప్తి

Read Latest AP News And Telangana News And International News

Updated Date - Apr 25 , 2026 | 07:47 AM