Share News

స్వర్గపురిలో సాయికృష్ణ దహనం!

ABN , Publish Date - Sep 19 , 2026 | 04:02 AM

రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ ఈ ఏడాది మే 12న మృతిచెందాడని, అదేరోజు రాత్రి ఆయన మృతదేహాన్ని విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని సిట్‌ కోర్టుకు తెలిపింది. రాణిగారితోటలోని ఓ పాడుబడిన భవనంలో సాయికృష్ణను బంధించి చిత్రహింసలు పెట్టారని...

స్వర్గపురిలో సాయికృష్ణ దహనం!

  • రాణిగారితోటలో పాడుబడిన భవనంలో బందీ

  • ప్రతి రోజూ చిత్రహింసలు.. మే 12న మృతి

  • అదేరోజు రాత్రి రహస్యంగా దహనం

  • కోర్టుకు వెల్లడించిన సిట్‌

  • మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సన్నిహితుడు సురేశ్‌ రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు

విజయవాడ, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రౌడీషీటర్‌ గాదె సాయికృష్ణ ఈ ఏడాది మే 12న మృతిచెందాడని, అదేరోజు రాత్రి ఆయన మృతదేహాన్ని విజయవాడ కృష్ణలంకలోని స్వర్గపురి శ్మశానవాటికలో దహనం చేశారని సిట్‌ కోర్టుకు తెలిపింది. రాణిగారితోటలోని ఓ పాడుబడిన భవనంలో సాయికృష్ణను బంధించి చిత్రహింసలు పెట్టారని, అతడు చనిపోయిన తర్వాత మాజీ హెడ్‌కానిస్టేబుళ్లు పోతర్లంక అశోక్‌కుమార్‌, జంగం నానితోపాటు గులివిందల సురేశ్‌కుమార్‌ ఆ మృతదేహాన్ని స్వర్గపురికి తీసుకెళ్లి దహనం చేశారని వివరించింది. సిట్‌ ఎదుట లొంగిపోయిన మాజీ ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు సన్నిహితుడు సురేశ్‌ కుమార్‌ను పోలీసులు శుక్రవారం విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టులో హాజరుపరిచారు. కోర్టుకు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో కీలక అంశాలు వెల్లడించారు. ‘‘సాయికృష్ణ అదృశ్యం కేసులో ఏ4గా ఉన్న సురేశ్‌కుమార్‌కు 2010 నుంచే ఇన్‌స్పెక్టర్‌ నాగరాజుతో పరిచయం ఉంది. హెడ్‌ కానిస్టేబుళ్లు అశోక్‌కుమార్‌, నానితో కలిసి నైట్‌ రౌండ్స్‌కు వెళ్లేవాడు. ఈ ఏడాది మే 7న కృష్ణలంక స్టేషన్‌లో సాయికృష్ణను నాటి ఇన్‌స్పెక్టర్‌ నాగరాజు, హెచ్‌సీలు అశోక్‌, నాని విచారించడాన్ని ప్రత్యక్షంగా చూశాడు. ఆ తర్వాత స్నేహితులతో కలిసి నేపాల్‌ వెళ్లి మే 11నవిజయవాడకు తిరిగొచ్చాడు. మే 12న ఉదయం 10.30 గంటలకు నాగరాజును కలవడానికి పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాడు. తర్వాత అశోక్‌కుమార్‌ అతన్ని వారధి సమీపంలోని రాణిగారితోటలో ఉన్న ఖాళీ భవనానికి తీసుకెళ్లాడు. అక్కడ సాయికృష్ణ తీవ్రంగా నీరసించి ఉన్నాడు. ఆ సమయంలో నాని అక్కడే ఉన్నాడు. సాయికృష్ణను పోలీస్‌ స్టేషన్‌లో ఉంచితే విషయం బయటకు తెలిసే అవకాశం ఉందని నాగరాజు చెప్పడంతో ఈ భవనంలో ఉంచినట్లు అశోక్‌ చెప్పాడు. అక్కడ సాయికృష్ణ... సురేశ్‌తో మాట్లాడాడు. ‘నన్ను ఇక్కడికి తీసుకువచ్చినప్పటి నుంచి చంపేయాలనే ఉద్దేశంతో రోజూ కొడుతున్నారు’ అని చెప్పాడు.


అలా మాట్లాడుతుండగానే సాయికృష్ణ ఒక్కసారిగా స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని స్పృహలోకి తీసుకురావడానికి అశోక్‌ తీవ్రంగా ప్రయత్నించాడు. నాడి పరిశీలించిన అనంతరం అతడు మృతి చెందినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే సాయికృష్ణ మృతిచెందిన విషయం నాగరాజుకు తెలియజేశారు. ఆయన అక్కడికి వచ్చి ఎలాంటి ఆనవాళ్లూ మిగలకుండా మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లి దహనం చేయాలని.. నాని, అశోక్‌, సురేశ్‌లకు సలహా ఇచ్చాడు. దీంతో మే 12వ తేదీ అర్ధరాత్రి అశోక్‌, నాని దుప్పటిలో సాయికృష్ణ మృతదేహాన్ని చుట్టి బైక్‌పై స్వర్గపురి శ్మశానవాటికకు తరలించారు. వారి వెంట మరో వాహనంలో సురేశ్‌ కూడా వెళ్లాడు. ముగ్గురూ కలిసి మృతదేహాన్ని చితిపై ఉంచి నిప్పంటించారు. పూర్తిగా కాలే వరకు అక్కడే ఉన్నారు. సాయికృష్ణ కుటుంబసభ్యులు హైకోర్టును ఆశ్రయించిన తర్వాత కేసు మరింత తీవ్రమైన నేపథ్యంలో రాజీ కోసం నాగరాజు తరఫున సురేశ్‌ రంగంలోకి దిగాడు. సాయికృష్ణ మేనమామ నవరంగ్‌ను కలిసి, హైకోర్టులో దాఖలుచేసిన హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశాడు. నాగరాజు అరెస్టు తర్వాత నాని, అశోక్‌, సురేశ్‌ నాగపూర్‌ పారిపోయారు. మార్గమధ్యలో ఫోన్లను కాల్వలో పడేశారు’’ అని రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

సురేశ్‌కు 24 వరకు రిమాండ్‌

సాయికృష్ణ అదృశ్యం కేసులో గులివిందల సురేశ్‌కుమార్‌కు రెండో అదనపు జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు 24 వరకు రిమాండ్‌ విధించింది. ఈమేరకు న్యాయాధికారి శ్రీకాంత్‌ ఉత్తర్వులు ఇచ్చారు. అనంతరం అతన్ని నూజివీడు సబ్‌ జైలుకు తరలించారు.

ఈ వార్తలనూ చదవండి...

మన్యంలో విభిన్న వాతావరణం

కాఫీ ప్రాజెక్టుకు తూట్లు!

Updated Date - Sep 19 , 2026 | 04:02 AM