అసలు బుర్ర పెట్టలేదు!
ABN , Publish Date - Feb 04 , 2026 | 03:45 AM
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు... అనేకుల నిర్లక్ష్యం, అలసత్వం, కుట్రలే కల్తీ నెయ్యికి కారణమయ్యాయి. ఎవరికి వారు వదిలేయడంతో... రసాయన మిశ్రమమే నెయ్యి పేరుతో తిరుమలకు చేరుకుంది.
ప్రతి దశలో అంతులేని నిర్లక్ష్యం.. ‘కల్తీ నెయ్యి’కి అదే కారణం
2014, 2018, 2019లో కఠిన నిబంధనలు
2020లో మరోసారి నిపుణుల కమిటీ ఏర్పాటు
టెండరు నిబంధనలను సడలిస్తూ సిఫారసు
హేతుబద్ధత, వివరణ లేకుండానే నివేదిక
దానిని గుడ్డిగా ఆమోదించిన ఉన్నతాధికారులు
2022లోనే నెయ్యి కల్తీపై ధర్మారెడ్డికి ఫిర్యాదులు
మైసూరు ల్యాబ్ ధ్రువీకరించినా.. అలసత్వం
రాష్ట్ర ప్రభుత్వానికి ‘సిట్’ అధిపతి నివేదిక
ధర్మారెడ్డి, సింఘాల్, బాలాజీపై చర్యలకు సిఫారసు
ఎలాంటి సాంకేతిక విశ్లేషణ చేయకుండా, డెయిరీలను పరిశీలించకుండా, హేతుబద్ధత లేకుండానే ‘నెయ్యి టెండర్ల’ నిబంధనలను సరళీకరిస్తూ చేసిన సిఫారసులను... అప్పటి అదనపు ఈవో ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు బాలాజీ, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఏమాత్రం బుర్ర పెట్టకుండా ఆమోదించారు. దీని కారణంగానే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం కలిగింది.
2020లో టీటీడీ నియమించిన కమిటీలో టీటీడీ ఉన్నతాధికారులు ఐఐఎం-లఖ్‌నవూకు చెందిన ఎస్.వెంకట రమణయ్యను ‘నిపుణుల కమిటీ’లో నియమించారు. ఆయనకు... పాల ఉత్పత్తుల గురించి ఏమీ తెలియదు. విజయ భాస్కర్ రెడ్డి అనే మరో ‘నిపుణుడు’... 2019లో ఏర్పాటు చేసిన కమిటీలోనూ సభ్యుడు. అప్పుడు ‘టెండరు నిబంధనలు కఠినంగా ఉండాలి’ అని సిఫారసు చేసిన ఆయన... 2020లో మాత్రం సడలింపులకు సరే అన్నారు.
(అమరావతి- ఆంధ్రజ్యోతి)
‘తిలా పాపం తలా పిడికెడు’ అన్నట్లు... అనేకుల నిర్లక్ష్యం, అలసత్వం, కుట్రలే కల్తీ నెయ్యికి కారణమయ్యాయి. ఎవరికి వారు వదిలేయడంతో... రసాయన మిశ్రమమే నెయ్యి పేరుతో తిరుమలకు చేరుకుంది. అరకొర జ్ఞానంతో కమిటీ ఇచ్చిన సిఫారసులు మొదలుకుని... ఫిర్యాదులు వచ్చినా పట్టించుకోని నాటి ఈవో ధర్మారెడ్డి వరకు అనేకమంది ఇందులో భాగస్వాములయ్యారని సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన ‘సిట్’ స్పష్టం చేసింది. ‘సిట్’ అధిపతి, సీబీఐ జాయింట్ డైరెక్టర్ వీరేశ్ ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో ఈ విషయం తెలిపారు. ‘‘నెయ్యి నాణ్యతను గాలికి వదిలేశారు. కల్తీకి ఆస్కారం కల్పించారు.
ప్రమాణాలకు తూట్లు పొడిచారు టీటీడీ ఉన్నతాధికారుల నిర్లక్ష్యమే కల్తీ నెయ్యికి కారణం’’ అని తెలిపారు. అప్పటి టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు ఓ.బాలాజీలతోపాటు టెండరు నిబంధనలను సడలించేందుకు టీటీడీ నియమించిన కమిటీ సభ్యులు కూడా కల్తీకి బాధ్యులని తేల్చారు. నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు రాజమార్గం ఏర్పడిందని పేర్కొన్నారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేశారు. నివేదికలోని ముఖ్యమైన అంశాలు ఇవి...
ప్రమాణాలు తెలియని కమిటీ...
నెయ్యి కొనుగోలు టెండర్ల నిబంధనలపై పలుమార్లు కమిటీలను వేశారు. 2014, 18, 19లో (టీడీపీ హయాంలో) నిబంధనలు కఠినంగా ఉండాలని స్పష్టం చేసిన కమిటీ... 2020లో (వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ అయ్యాక) వాటిని సడలిస్తూ అనేక సిఫారసులు చేసింది. సమగ్ర విశ్లేషణ, క్షేత్రస్థాయి తనిఖీలు, సాంకేతిక ప్రమాణాల పరిశీలన లేకుండానే... నివేదికను టీటీడీకి సమర్పించింది. గతంలో ఇదే కమిటీలోని సభ్యులు తమ సిఫారసుల్లోని హేతుబద్ధతతో కూడిన వివరణతో నివేదిక ఇచ్చారు. 2020లో నిబంధనలను సడలించినప్పుడు మాత్రం కేవలం ఎలాంటి వివరణలు, కారణాలు చెప్పకుండానే ‘నిబంధనల సడలింపు’ సిఫారసులు చేశారు. అసలు విషయం ఏమిటంటే... ఈ కమిటీ సభ్యులకు నెయ్యి ప్రమాణాలు, వాటి సేకరణ పద్ధతులపై కనీసం అవగాహన లేదు. ఇలాంటి కమిటీ చేసిన సిఫారసులను టీటీడీ ఉన్నతాధికారులు నిశితంగా పరిశీలించకుండా గుడ్డిగా వ్యవహరించారు. కనీసం బుర్ర పెట్టకుండా (మైండ్ అప్లై చేయకుండా) ఆ నివేదికను టీటీడీ పాలకమండలి ముందుకు తీసుకువచ్చారు. దానిని పాలకమండలి ఆమోదించింది. టెండరు నిబంధనల విషయంలో రాజీపడడం వల్లనే అర్హత లేని డెయిరీలు రంగంలోకి దిగాయి. తగిన అధ్యయనం, శాస్త్రీయత లేకుండా టెండరు నిబంధనలను మార్చడంవల్లే అర్హత లేని కంపెనీలు తిరుమలకు కల్తీ నెయ్యి సరఫరా చేశాయి.
ధర్మారెడ్డి నిర్లక్ష్యం... లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపం, కల్తీ నెయ్యిపై 2022లో అప్పటి అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఆయన నెయ్యి సరఫరా చేస్తున్న కంపెనీల దగ్గర నుంచి శాంపిల్స్ సేకరించి... 2022 మే 25న మైసూరులోని సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ రీసెర్చి ఇన్‌స్టిట్యూట్ (సీఎఫ్‌టీఆర్‌ఐ)కు పంపారు. వైష్ణవి డెయిరీ, భోలేబాబా డెయిరీ నుంచి వచ్చే నెయ్యి కల్తీ అవుతోందని సదరు సంస్థ నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక టీటీడీప్రొక్యూర్‌మెంట్ విభాగానికి అందింది. కానీ... ఆ అధికారులు దీనిని ధర్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లలేదు. కీలకమైన ఈ నివేదిక గురించి ధర్మారెడ్డి కూడా పట్టించుకోలేదు. ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం, నెయ్యి కల్తీ జరిగిందన్న విషయాన్ని టీటీడీ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా ‘రసాయన మిశ్రమాలు’ సరఫరా అయ్యాయి. ఆహార భద్రతా ప్రమాణాలు (ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్) నిబంధనలను కూడా ధర్మారెడ్డి పట్టించుకోకుండా డెయిరీలతో ఒప్పందాలు చేసుకున్నారు.