Share News

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే ఎస్టీ పేదరాలికి అందలం

ABN , Publish Date - Nov 10 , 2026 | 01:30 AM

ఇళ్ల వెంట తిరిగి చిక్కు వెంట్రుకలు సేకరించి అమ్ముకోవడం శీలం వెంకటేశ్వరమ్మ వృత్తి. టీడీపీ పట్ల వీరాభిమానంతో గ్రామంలో కార్యక్రమాలు చేపట్టడం ఆమె ప్రవృత్తి. ఆ నిరుపేద కార్యకర్త అందిస్తున్న సేవలను అధిష్ఠానం గుర్తించి, టికెట్‌ ఇస్తే...

చిక్కు వెంట్రుకలు అమ్ముకునే ఎస్టీ పేదరాలికి అందలం

  • పామర్రు జడ్పీటీసీగా శీలం వెంకటేశ్వరమ్మ

  • ఊళ్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి 25 ఏళ్లుగా సేవలు

  • గుర్తించి టికెట్‌ ఇచ్చిన టీడీపీ అధిష్ఠానం

పామర్రు, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ఇళ్ల వెంట తిరిగి చిక్కు వెంట్రుకలు సేకరించి అమ్ముకోవడం శీలం వెంకటేశ్వరమ్మ వృత్తి. టీడీపీ పట్ల వీరాభిమానంతో గ్రామంలో కార్యక్రమాలు చేపట్టడం ఆమె ప్రవృత్తి. ఆ నిరుపేద కార్యకర్త అందిస్తున్న సేవలను అధిష్ఠానం గుర్తించి, టికెట్‌ ఇస్తే, అత్యధిక మెజారిటీతో గెలిచి జిల్లా పరిషత్‌లో అడుగుపెడుతున్నారు. కృష్ణా జిల్లా పామర్రు జడ్పీటీసీ ఈసారి ఎస్టీకి కేటాయించారు. సోదెరుకుల (ఎస్టీ) సామాజికవర్గానికి చెందిన శీలం వెంకటేశ్వరమ్మను అక్కడ టీడీపీ నిలబెట్టింది.

తన ప్రత్యర్థిపై 8,469 ఓట్ల భారీ మెజారిటీతో ఆమె విజయం సాధించారు. ఆ జిల్లాలో అత్యధిక మెజారిటీ తెచ్చుకున్న ముగ్గురు మహిళల్లో వెంకటేశ్వరమ్మ ఒకరు. ఆమెకు భర్త చింతేశ్వరరావు, ముగ్గురు పిల్లలు ఉన్నారు. చింతేశ్వరరావు దినసరి కూలి. వెంకటేశ్వరమ్మ మామయ్య పానకాలు...ఎన్టీఆర్‌పై అభిమానంతో పామర్రు నాలుగు రోడ్ల కూడలిలోని ఎన్టీఆర్‌ విగ్రహాన్ని 25 ఏళ్లుగా శుభ్రం చేస్తున్నారు.

ఆయన వెంట నడుస్తూ, వెంకటేశ్వరమ్మ కుటుంబం టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొంటోంది. దీంతో పార్టీ టికెట్‌ ఇచ్చి గౌరవించగా, ప్రజలు ఆదరించి జడ్పీటీసీ పదవిలో కూర్చోబెట్టారు. వెంకటేశ్వరమ్మ విజయం ఎన్టీఆర్‌కు ఇచ్చే అసలైన నివాళి అని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మండల అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెంకటేశ్వరమ్మ తెలిపారు.

ఈ వార్తలనూ చదవండి:

పల్లెపోరుకు వేళాయె!

ఆ ఒక్కచోట ఎందుకిలా?

Updated Date - Nov 10 , 2026 | 01:32 AM