Share News

నడి సంద్రంలో నరకం చూశాం

ABN , Publish Date - Nov 28 , 2026 | 05:32 AM

వేటకు వెళ్లిన బోటులో ఇంజన్‌ గేర్‌బాక్స్‌ రిపేరు రావడంతో నడిసముద్రంలో ఇరుక్కుని నరకం చూశామని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం సుబ్బంపేట మత్స్యకారులు పేర్కొన్నారు.

నడి సంద్రంలో నరకం చూశాం

  • తిండి, నీరులేక అల్లాడిపోయాం

  • కష్టాలు వివరించిన మత్స్యకారులు

  • క్షేమంగా ఇళ్లకు సుబ్బంపేట జాలర్లు

కొత్తపల్లి, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): వేటకు వెళ్లిన బోటులో ఇంజన్‌ గేర్‌బాక్స్‌ రిపేరు రావడంతో నడిసముద్రంలో ఇరుక్కుని నరకం చూశామని కాకినాడ జిల్లా కొత్తపల్లి మండలం సుబ్బంపేట మత్స్యకారులు పేర్కొన్నారు. వేటకు వెళ్లి సుమారు 10 రోజులపాటు ఎలాంటి సమాచారం లేకుండా గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు శుక్రవారం అర్ధరాత్రి క్షేమంగా ఇళ్లకు చేరుకున్నారు. ఈ నెల 4న సుబ్బంపేట నుంచి బోటు యజమాని గరికిన సింహాద్రి ఇంజన్‌బోటుపై అదే గ్రామానికి చెందిన గంపల ప్రకాశ్‌, తిర్రి నారాయణ, సూరాడ చిన్న, సూరాడ కోదండ, కందాల రాము, మేరుగు నారాయణ వేటకు వెళ్లారు. ఈ నెల 18 నుంచి వారి ఎటువంటి సమాచారం అందకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. అప్రమత్తమైన రాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. నేవీ, కోస్ట్‌గార్డ్‌ల సంయుక్త ఆధ్వర్యంలో సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు.

ఎట్టకేలకు మత్స్యకారులు శుక్రవారం వారి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడారు.. ‘‘ఈ నెల 4న ఒడిశా పారాదీప్‌ వెళ్లాం. వేట లేకపోవడంతో 18న అక్కడి నుంచి సుమారు 400 మైళ్లు నడి సముద్రంలోకి బయలుదేరాం. అక్కడ మా బోటు ఇంజన్‌ గేర్‌ బాక్స్‌ పాడైంది. సుమారు 4 రోజుల పాటు సముద్రం మధ్యలోనే ఉండిపోయాం. తెరచాప సాయంతో దరికి వద్దామన్నా వీలు పడలేదు. బోటు రిపేరు పూర్తి చేసుకుని జీపీఎస్‌ సెట్‌ చేసుకుని కాకినాడ వైపు బయలు దేరాం. తిండి, నీరు లేక ప్రత్యక్షనరకం అనుభవించాం. తెరచాపపై పడిన వర్షం నీటిని పట్టుకుని వాటితోనే ప్రాణాలు కాపాడుకున్నాం. మా బోటు విశాఖ జిల్లా వచ్చేసరికి ఫోన్‌లకు సిగ్నల్స్‌ రావడం, ఈలోగా కోస్ట్‌గార్డులకు సమాచారం అందడంతో వారి సాయంతో కాకినాడ చేరుకున్నాం.’’ అని మత్స్యకారులు పేర్కొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

డీలిమిటేషన్ బిల్లుతో అన్ని రాష్ట్రాలకు న్యాయం.. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు: సీఎం చంద్రబాబు

బిహార్ ఎమ్మెల్యే కూతురి పెళ్లి.. చీపుర్లతో ఊడ్చేంత డబ్బు..

Updated Date - Nov 28 , 2026 | 05:38 AM