ఏడుగురు మత్స్యకారులు గల్లంతు
ABN , Publish Date - Nov 25 , 2026 | 01:40 AM
కాకినాడ జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతయ్యారు.
ఉప్పాడ నుంచి ఈ నెల 4న వేటకు వెళ్లిన సబ్బంపేట జాలర్లు
గత కొన్ని రోజులుగా సమాచారం బంద్
గల్లంతైన వారిని క్షేమంగా తీసుకురావాలని అధికారులకు చంద్రబాబు ఆదేశాలు
అణువణువు జల్లెడ పట్టాలి: పవన్‌కల్యాణ్
కలెక్టర్‌తో మాట్లాడిన ఉపముఖ్యమంత్రి
క్షేమంగానే వస్తారు: కుటుంబాల ధీమా
అమరావతి/కొత్తపల్లి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా ఉప్పాడ శివారు సుబ్బంపేటకు చెందిన ఏడుగురు మత్స్యకారులు వేటకు వెళ్లి గల్లంతయ్యారు. గరికిన సింహాద్రి, తిర్రి నారాయణ, గంపల ప్రకాశ్, మేరుగు సత్యనారాయణ, సూరాడ చిన్న, రాము సహా మరొకరు ఈ నెల 4న మోటరైజ్డ్ ఫిషింగ్ బోటు ద్వారా సముద్రంలో వేటకు వెళ్లారు. ఈ నెల 19వ తేదీ వరకు వారు తమ కుటుంబ సభ్యులకు ఫోన్‌లో అందుబాటులోనే ఉన్నారు. ఏరోజుకారోజు ఫోన్లు చేసి క్షేమ సమాచారాలు అందించారు. 19న పారాదీప్ పోర్టుకు సమీపంలో ఉన్నట్టు కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే, మరుసటి రోజు నుంచి ఫోన్లు, ఇతర వ్యవస్థలు నిలిచిపోయాయి. మొబైల్ ఫోన్లు పనిచేయకపోవడంతోపాటు బోటులో కీలకమైన ట్రాన్స్‌పాండర్ స్విచ్ కూడా ఆగిపోవడంతో జీపీఎస్ వ్యవస్థతో కూడా సంబంధాలు తెగిపోయాయి.
పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో సముద్రం మధ్యలో వీరు గల్లంతైనట్లు అధికారులు భావిస్తున్నారు. పారాదీప్ కోస్ట్‌గార్డ్, ఎంఆర్‌సీసీ సమన్వయంతో గాలింపుచర్యలు చేపట్టారు. కాగా, బోటులో 1500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార పదార్థాలు ఉన్నాయని, తమ వాళ్లు క్షేమంగా తిరిగి వస్తారని మత్స్యకారుల కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేశారు.
కలెక్టర్‌కు డిప్యూటీ సీఎం ఫోన్
మత్స్యకారులు గల్లంతుపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ కాకినాడ జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సముద్రంలో అనువణువు జల్లెడ పట్టాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు భరోసా కల్పించాలని సూచించారు.
గాలింపు చర్యలు ముమ్మరం చేయండి: సీఎం
గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ కనుగొనేందుకు సంబంధిత అధికారులు సమన్వయంతో పని చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గాలింపు చర్యలపై మంగళవారం ఆయన సమీక్షించారు. మత్స్యకారులు వినియోగించిన మోటరైజ్డ్ ఫిషింగ్ బోటును పారాదీప్ పోర్టు సమీపంలో చివరిసారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 19 నుంచి ఆ బోటుతో సంబంధాలు తెగిపోయాయని, జీపీఎస్ ద్వారా కూడా సమాచారం లభించకపోవడంతో బోటు ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందన్నారు.
కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్ట్‌గార్డ్ అధికారుల సమన్వయంతో గాలిస్తున్నట్లు వివరించారు. కోస్ట్‌గార్డ్ నౌకలు, హెలీకాప్టర్లతో పారాదీప్ తీర ప్రాంతంలో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. దీనిపై సీఎం స్పందిస్తూ, మత్స్యకారుల కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పడంతో పాటు గాలింపు చర్యలను ముమ్మరం చేసి, సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయాలని సూచించారు. గాలింపు చర్యల్లో అలసత్వం వద్దని అధికారులకు స్పష్టం చేశారు.
సురక్షితంగా తీసుకొస్తాం: అచ్చెన్నాయుడు
తుఫాన్ ప్రభావంతో బోటు దారి తప్పి ఉండొచ్చని, మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని, మత్స్యకారుల కుటుంబాలు అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి