జగన్ వాస్తవాలు తెలుసుకుని.. కుళ్లు రాజకీయాలు ఆపాలి: మంత్రి సత్యకుమార్ యాదవ్
ABN , Publish Date - May 27 , 2026 | 05:46 PM
ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు జగన్ ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఆయనకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు.
విజయవాడ, మే 27: ఏపీ వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునివ్వడంపై మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు జగన్ ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారో ఆయనకైనా స్పష్టత ఉందా అని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి హామీలనూ అమలు చేయలేదని జగన్ విమర్శిస్తున్నారని, అలా మాట్లాడే ముందు ఆయన క్షేత్రస్థాయి సమాచారాన్ని తెలుసుకోవాలని హితవుపలికారు. విజయవాడలో మీడియాతో మాట్లాడిన సత్యకుమార్, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగానే ప్రతి నెలా ఒకటో తారీఖునే లబ్ధిదారులకు సామాజిక పింఛన్లు ఇస్తున్నామని, ఇందుకోసం నెలకు దాదాపు 33 వేల కోట్ల రూపాయలను నేరుగా అందిస్తున్నామని తెలిపారు. అలాగే 'అన్నదాత సుఖీభవ' కింద కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్రంలోని రైతులకు నిబంధనల ప్రకారం రూ.20,000లను వారి అకౌంట్లలో జమ చేయడం జరిగిందన్నారు. దీంతో పాటూ 'తల్లికి వందనం' కార్యక్రమం ద్వారా ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లోకి వెళ్తున్నాయని వివరించారు. మహిళల కోసం ప్రవేశపెట్టిన 'స్త్రీ శక్తి' ఉచిత బస్సు పథకం ద్వారా ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరూ రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణాలు సాగిస్తున్నారని గుర్తుచేశారు.
గతంలో కూడా జగన్ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని, కేవలం వాళ్లు చెప్పిన విషయాలనే వింటూ 'క్లౌడ్ నైన్' లో తిరిగేవారని.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉన్నట్టు తనకు అనిపిస్తోందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. 'పచ్చకామెర్లవాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది' అన్న చందంగా జగన్ వైఖరి ఉందన్న సత్యకుమార్.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పుడు ఎటువంటి అరాచకాలు జరిగాయో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. మొన్నటి ఎన్నికల్లోనే రాష్ట్ర ప్రజలు మీ అరాచకాలను చూసి కేవలం 11 సీట్లకే పరిమితం చేశారని గుర్తుచేశారు. ఇక ఎన్నికల సంఘం చేపట్టే 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' ప్రక్రియ గురించి జగన్‌కు కనీస అవగాహన ఉందో లేదో తెలియదని మంత్రి వ్యాఖ్యానించారు. ఇది రాజ్యాంగబద్ధంగా ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియ అని, ఓటర్లు ఎవరికీ అన్యాయం జరగకుండా, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు వచ్చేలా చేసేందుకే ఈ సవరణలు ఉంటాయన్నారు. ఎవరైనా ఓటు మార్చుకోవాలన్నా, డూప్లికేషన్ లేదా దొంగ ఓట్లను తొలగించాలన్నా ఈ ప్రక్రియ ద్వారానే సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఈ బాధ్యతాయుతమైన ప్రక్రియలను పక్కనబెట్టి, అసలు ఆంధ్రప్రదేశ్‌ను పశ్చిమ బెంగాల్‌తో జగన్ ఎందుకు పోలుస్తున్నారో ఆయనకే తెలియాలని మంత్రి సత్యకుమార్ ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
తెలంగాణలో భారీగా ఎమ్మార్వోలు బదిలీ
నేరం జగన్ నైజం.. గొడ్డలి పార్టీ నెవర్ ఎగైన్.. మహానాడులో సీఎం చంద్రబాబు పంచ్ డైలాగ్స్
For More AP News