చట్టంలో పవర్ఫుల్ చట్రంలో సర్పంచ్!
ABN , Publish Date - Nov 19 , 2026 | 04:35 AM
సర్పంచ్.. చట్టంలో పవుర్ఫుల్. గ్రామ పంచాయతీ పెద్ద. ప్రజలు ఎన్నుకున్న గ్రామ తొలి ప్రజాప్రతినిధి. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994 ప్రకారం ...
రాష్ట్రపతి.. దేశానికి ప్రథమ పౌరులు అయితే, సర్పంచ్.. గ్రామానికి తొలి ప్రజాప్రతినిధి. పంచాయతీరాజ్ చట్టం సర్పంచ్‌కు ఎన్నో అధికారాలు కల్పించింది. గ్రామాభివృద్ధిలో సర్పంచ్ పాత్ర కీలకం. కానీ నేడు పంచాయతీ సర్పంచ్ చట్రంలో ఇరుక్కుపోయారు. పెత్తనమంతా ఎమ్మెల్యేలదే. గ్రామాల్లో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేల మాటే శాసనం. ఈ పరిస్థితిలో మార్పు రావాలని, సర్పంచ్‌లు స్వతంత్రంగా పనిచేసే విధానం రావాలని నిపుణులు సూచిస్తున్నారు.
(అమరావతి-ఆంధ్రజ్యోతి): సర్పంచ్.. చట్టంలో పవుర్ఫుల్. గ్రామ పంచాయతీ పెద్ద. ప్రజలు ఎన్నుకున్న గ్రామ తొలి ప్రజాప్రతినిధి. ఏపీ పంచాయతీరాజ్ చట్టం-1994 ప్రకారం గ్రామ స్వరాజ్యస్థాపనలో కీలక ప్రతినిధి. గ్రామ సుపరిపాలన, అభివృద్ధికి పాటు పడేందుకు ఈ చట్టం సర్పంచ్‌కు సకల అధికారాలు కల్పించింది. గ్రామానికి దశ, దిశను నిర్దేశించే ప్రతినిధిగా సర్పంచ్ ఐదేళ్ల పాటు పనిచేసేలా చట్టం కీలక హక్కులు, అధికారాలు కట్టబెట్టింది. ఆ మేరకు సర్పంచ్ బాధ్యతల్లో ఎందరో నేతలు రాణించారు.
గ్రామాలకు చుక్కానిగా పనిచేశారు. తమ పదవికి వన్నె తేవడంతో పాటు గ్రామానికి జాతీయ స్థాయి గుర్తింపును తీసుకొచ్చినవారున్నారు. ఆ తర్వాత రాజకీయంగా ఎదిగి గ్రామం నుంచి మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రజాప్రతినిధులుగా రాణించినవారు ఎందరో ఉన్నారు. కానీ ఇదంతా గతం.
ఇప్పుడు.. సర్పంచ్ల అధికారాలు చట్టాలకే పరిమితం. ఆచరణలో పెత్తనమంతా ఎమ్మెల్యేలదే. ఒకప్పుడు ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలు గ్రామీణ వ్యవహారాల్లో పెద్దగా వేలు పెట్టేవారు కాదు. కానీ నోట్ల రాజకీయాలు ఏలుతున్న దశలో ఎమ్మెల్యేలు గ్రామ రాజకీయాలను శాసిస్తున్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులను సైతం గుప్పిటపట్టి తమ మాటే శాసనం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో సొంత ఆలోచనలు, ఆశయాలతో గ్రామాన్ని తీర్చిదిద్దే పదవి కాస్తా ఎమ్మెల్యే అనుచరుడిగా, వారి గ్రూప్ సభ్యుడి పోస్టుగా మారిపోతోంది. ఫలితంగా గ్రామంలో ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యేదే నిర్ణయం.
చివరకు గ్రామాభివృద్ధి అజెండాపై జరిగే చర్చను కూడా ఎమ్మెల్యేలే శాసిస్తున్నారు. ఈ పరిణామాలు మరింతగా పెరిగిపోవడంతో వివేకవంతులైన విద్యావేత్తలు, మేధావులు, ఆదర్శవంతులు సర్పంచ్ పదవికి పోటీపడేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు. కేవలం నేతల అనుచరులు లేదా వారు సూచించిన వారే సర్పంచ్‌లుగా పోటీ చేసి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇకనైనా ఈ పరిస్థితిలో మార్పు రావాలని, మారుతున్న కాలాన్ని బట్టి సర్పంచ్‌కు చట్టబద్ధమైన అధికారాలున్న వ్యక్తిగా పనిచేసే స్వేచ్ఛను కల్పించాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారు. అప్పుడే సర్పంచ్‌లు సొంత తెలివితేటలు, ఆశయాలతో గ్రామస్వరాజ్యంలో ముందడుగేస్తారని ఆశిస్తున్నారు.
నాడు సర్పంచ్ అంటే..
గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ అంటే.. పంచాయతీపై పూర్తిస్థాయి పట్టున్న, ప్రజల్లో ఎనలేని గౌరవ మర్యాదలున్న వ్యక్తిగా పేరు ఉండింది. ఎన్నికల్లో గెలిచిన వారైనా, ఏకగ్రీవంగా ఎన్నికైనవారైనా సరే ఐదేళ్లపాటు గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తారన్నది ప్రజల నమ్మకం. దానికి తగినట్లుగానే వారి పాలనా పద్ధతులు ఉండేవి. గ్రామంలో రక్షిత మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ, పారిశుధ్యం, వీధి దీపాల నిర్వహణ, ప్రజా సంక్షేమం, స్థానికంగా రకరకాల మార్కెట్ల నిర్వహణ నుంచి ఆర్థికంగా గ్రామానికి ఉపయోగపడే పన్నుల వసూలు.. వీటితోపాటు సందర్భానుసారంగా గ్రామసభల నిర్వహణ అంతా సర్పంచ్ చేతిలో ఉండేవి.
ఒకరకంగా చెప్పాలంటే గ్రామంలో సకల శాఖల బాధ్యతలు చూసేది సర్పంచ్‌నే. గ్రామ పాలనలో కార్యనిర్వహణ విభాగం అంటే కార్యదర్శి, ఇతర సిబ్బందిని పర్యవేక్షించడంలోనూ సర్పంచ్‌దే కీలకపాత్ర. పంచాయతీ పరిధిలోని గ్రామాలకు కొత్తగా రక్షిత మంచినీటి పథకాలు, రహదారులు, ఉపాధి పనులు, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద గ్రామానికి నిధులు తీసుకురావడం వంటి అనేక బాధ్యతలను సర్పంచ్ నిర్వహించేవారు. గ్రామాల్లో వివిధ వర్గాల ప్రజలకు పెద్దదిక్కుగా ఉండేవారు. గ్రామాభివృద్ధిలో సర్పంచ్‌దే కీలకపాత్రగా ఉండేది.
గ్రామ స్వరాజ్యంలో తిరుగులేని అధికారం
అభివృద్ధి, పాలనకు దశ, దిశ నిర్ణేత.. రాజకీయ జోక్యంతో మారిన పరిస్థితులు
నేడు మితిమీరిన ఎమ్మెల్యేల జోక్యం.. ఆచరణలో సర్పంచ్ పాత్ర నామమాత్రం
పంచాయతీపై సర్పంచ్‌కే పూర్తి అధికారం ఉండాలంటున్న నిపుణులు
నేడు పెత్తనమంతా ఎమ్మెల్యేదే
మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో అనేక మార్పులు వచ్చాయి. ఒకప్పుడు ఎమ్మెల్యేలు గ్రామీణ వ్యవహారాల్లో తలదూర్చేవారు కాదు. ఏదైనా సర్పంచ్ మాటపై నడిపించేవారు. ఇప్పుడు పరిస్థితులు మారాయి. అత్యధిక శాతం ఎమ్మెల్యేలు నియోజకవర్గం, మండలం, గ్రామం అన్న తేడా లేకుండా అన్ని చోట్లా తామే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. సర్పంచ్‌లను నియంత్రిస్తున్నారు. ఈ పరిణామాలతో పార్టీలతో సంబంధం లేకుండా గెలిచిన వారు కూడా ఎమ్మెల్యేల అదుపాజ్ఞల్లో పనిచేసే పరిస్థితి వచ్చింది.
దీంతో గ్రామంలో ఏ పని కావాలన్నా, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సర్పంచ్‌కు బదులుగా ఎమ్మెల్యేలే నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామ కార్యదర్శి సహా ఇతర సిబ్బంది పనితీరు, పోస్టింగ్‌లను కూడా వారే శాసిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా గ్రామాభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు సామాజిక విషయాల్లోనూ ఎమ్మెల్యేలనే ఆశ్రయిస్తున్నారు. ఫలితంగా సర్పంచ్‌లు నామమాత్రంగా మారిపోతున్నారు. ఎమ్మెల్యేను కాదని సొంతంగా వ్యవహరించలేని పరిస్థితి వచ్చింది. దీనివల్ల గ్రామస్వరాజ్యంలో సర్పంచ్ అధికారం అంతా ఎమ్మెల్యే చేతుల్లో బందీ అయినట్లుగానే తయారవుతోంది.
మార్పు వస్తేనే గ్రామ స్వరాజ్యం
గ్రామానికి ప్రజలెన్నుకున్న తొలి ప్రజాప్రతినిధి సర్పంచ్. పంచాయతీ వ్యవహారాలు అంటే అభివృద్ధి, పాలనలో నిర్ణయాధికారం సర్పంచ్‌దే. ఆ అధికారాన్ని మరొకరు లాక్కుంటే అది గ్రామ స్వరాజ్యానికే పెనుప్రమాదం. గ్రామాల్లో సర్పంచ్‌లు చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు సహకరించాలి. మరింత చేయూతనివ్వాలి. కానీ వారే విధాన నిర్ణేతలు అయితే సర్పంచ్ పోస్టుకున్న ప్రాధాన్యం పలచనవుతుంది.
ఇప్పుడు అదే జరుగుతోంది. నిజమైన గ్రామ స్వరాజ్యం కోసం సర్పంచ్‌లు స్వతంత్రంగా పనిచేసే విధానం రావాలని పంచాయతీరాజ్ నిపుణులు సూచిస్తున్నారు. సర్పంచ్ల ప్రాధాన్యాన్ని పెంచేలా, వారి అధికారాల పరిధిని పరిరక్షించేలా ప్రభుత్వం నిర్దిష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. పంచాయతీరాజ్ చట్టం త్రికరణశుద్ధిగా అమలయ్యేలా, సర్పంచ్‌లు స్వేచ్ఛగా పనిచేసేలా ఎమ్మెల్యేలు సహకరించాలని అంటున్నారు. అంతేకానీ పెత్తనమంతా తమ చేతుల్లోకి లాక్కోకుండా సర్కారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్