Share News

నాడు కళకళ నేడు వెలవెల!

ABN , Publish Date - Nov 24 , 2026 | 05:15 AM

ఒకప్పుడు ఆ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కనీస మౌలికవసతులు లేని ఓ చిన్న పల్లెటూరు. ఎటు చూసినా మట్టిరోడ్లు. మురుగు పారేందుకు కాలువలు ఉండేవి కావు. తాగునీటికి అవస్థలు ఎదురయ్యేవి.

నాడు కళకళ నేడు వెలవెల!

  • దీనస్థితిలో సచిన్‌ దత్తత గ్రామం

  • 2014-16లో పుట్టంరాజుకండ్రిగ అభివృద్ధి

  • దేశం దృష్టిని ఆకర్షించిన గ్రామం

  • కోట్ల రూపాయలతో ఆధునిక వసతులు

  • నేడు నిర్వహణ లేక నిరుపయోగం

(గూడూరు-ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ఆ గ్రామం గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కనీస మౌలికవసతులు లేని ఓ చిన్న పల్లెటూరు. ఎటు చూసినా మట్టిరోడ్లు. మురుగు పారేందుకు కాలువలు ఉండేవి కావు. తాగునీటికి అవస్థలు ఎదురయ్యేవి. క్రీడలకు మైదానం కరువు. అలాంటి గ్రామంలో క్రికెట్‌ దిగ్గజం, భారతరత్న సచిన్‌ టెండూల్కర్‌ అడుగుపెట్టడంతో ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించింది. ఆ గ్రామమే నెల్లూరు జిల్లాలోని పుట్టంరాజుకండ్రిగ. రాజ్యసభ సభ్యుడిగా ఈ గ్రామాన్ని సచిన్‌ దత్తత తీసుకోవడంతో రూపురేఖలు మారిపోయాయి. అభివృద్ధికి బాటలు పడ్డాయి. రెండేళ్ల వ్యవధిలోనే రూ.కోట్లతో ఆధునిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

జాతీయ మీడియా సైతం ఆ చిన్న పల్లె అభివృద్ధిని ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇప్పుడు పీ4 కింద దత్తత తీసుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. కానీ సచిన్‌ ఈ పని ఎప్పుడో చేశారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో నాటి అభివృద్ధి పనులు కళావిహీనంగా మారాయి. నిర్వహణ లోపంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ముళ్లపొదలు, చెత్తాచెదారంతో కూడిన భవనాలు కనిపిస్తున్నాయి. ఒకప్పుడు ఆదర్శగ్రామంగా నిలిచిన పుట్టంరాజుకండ్రిగ నేడు నిర్వహణ లేక లక్ష్యానికి దూరమవుతోంది. గ్రామ ప్రజలు వ్యవసాయ కూలీలుగా, రైతులుగా, పాడిరైతులుగా జీవనం సాగిస్తున్నారు.


నాడు ఎంతో ప్రణాళికబద్ధంగా నిర్మించిన సదుపాయాలు నేడు నిర్వహణా లోపంతో కళావిహీనంగా మారాయి. క్రీడాకారుల కోసం ఏర్పాటు చేసిన క్రీడామైదానం ముళ్లపొదలతో దర్శనమిస్తోంది. క్రీడాకారుల కోసం నిర్మించి డైనింగ్‌, రెస్ట్‌రూమ్‌లు నిరుపయోగంగా మారాయి. స్మశానవాటిక సైతం ముళ్లపొదలతో నిండిపోయి వినియోగానికి ఇబ్బందికరంగా తయారైంది. చెత్తనుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయాల్సిన కంపోస్టుయార్డు మూతపడిన పరిస్థితి నెలకొంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన నైపుణ్య శిక్షణా కేంద్రం, కమ్యూనిటీ భవనం ఏలాంటి కార్యక్రమాలు జరగకపోవడంతో ఆవరణంలో చెట్లు పెరిగిపోయి వృథాగా ఉన్నాయి.

ఇలా కోట్లాది రూపాయలతో నిర్మించిన అనేక సదుపాయాలు వినియోగానికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అయితే 24 గంటల విద్యుత్‌ సరఫరా, తాగునీటి సౌకర్యం మాత్రం ప్రస్తుతం కొనసాగుతున్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. అప్పట్లో గ్రామంలో ఏర్పాటు చేసిన అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ ద్వారా మురుగునీరు పైప్‌లైన్ల గుండా సెడిమెంటేషన్‌ ప్లాంటుకు చేరి అక్కడ శుద్ధి అనంతరం చెరువులోకి వెళ్లేలా ప్రణాళిక రూపొందించారు.

ప్రస్తుతం పైపులైన్లలో లీకేజీ ఏర్పడడంతో మురుగునీరు పంట పొలాల్లోకి చేరుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. వ్యవసాయపనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని పైపులైన్లకు మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే నైపుణ్య శిక్షణా కేంద్రం, కమ్యూనిటీ భవనం అందుబాటులోకి తీసుకురావాలని గ్రామస్థులు కోరుతున్నారు. ముళ్ల పొదలు, చెత్తాచెదారం తొలగించి ఇతర వసతులను మెరుగుపరచాలని విన్నవిస్తున్నారు.


5.79 కోట్లతో అభివృద్ధి పనులు

2014లో నెల్లూరు జాయింట్‌ కలెక్టర్‌గా రేఖారాణి పని చేశారు. అదే ఏడాది జూన్‌లో ఆస్ట్రేలియా నుంచి విమానంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రయాణిస్తుండగా, అదే విమానంలో సచిన్‌ కూడా ఉన్నారు. మాటల సందర్భంలో పుట్టంరాజుకండ్రిగ గ్రామం ప్రస్తావన వచ్చింది. గూడూరు నుంచి వెంకటగిరికి వెళ్లే ప్రధానరహదారిపై ఉన్న నెర్నూరు పంచాయతీ పరిధిలోని పుట్టంరాజుకండ్రిగ గ్రామాన్ని 2014 నవంబరు 16న అప్పటి రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ కేంద్ర ప్రభుత్వ సంసద్‌ ఆదర్శ గ్రామయోజన పథకం ద్వారా దత్తత తీసుకున్నారు.

అదే రోజు ఆయన గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో అభివృద్ధి ప్రణాళిక రూపొందించారు. ఇందుకు గానూ సచిన్‌ తన ఎంపీ నిధుల నుంచి రూ.2.79 కోట్లు, జిల్లా నిధుల నుంచి రూ.3 కోట్లు మొత్తం రూ.5.79 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ వ్యవస్థ, 24 గంటల విద్యుత్‌, తాగునీటి సరఫరా, అంగన్‌వాడీ భవనాలు, స్మశానవాటిక, కమ్యూనిటీ భవనం వంటి సదుపాయాలను కల్పించారు. గ్రామంలో పారిశుధ్య నిర్వహణ కోసం కంపోస్టుయార్డు, క్రీడామైదానం, క్రీడాకారులకు కిచెన్‌, డైనింగ్‌, రెస్ట్‌రూమ్‌లను అభివృద్ధి చేశారు. కమ్యూనిటీ భవనాన్ని నిర్మించి యువతకు నైపుణ్య శిక్షణా కేంద్రం, కల్యాణమండపం, వ్యాపార సముదాయ దుకాణాలు ఏర్పాటు చేశారు. 2016 నవంబరు 16న రెండో సారి గ్రామానికి వచ్చిన సచిన్‌టెండూల్కర్‌ అభివృద్ధి పనులను ప్రారంభించారు. రెండేళ్లలో గ్రామంలో వచ్చిన మార్పును చూసి ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.


50 ఏళ్ల అభివృద్ధి రెండేళ్లలోనే

సచిన్‌ మా గ్రామాన్ని దత్తత తీసుకోవడంతో గ్రామ రూపురేఖలే మారిపోయాయి. 2014లో ఆయన మా గ్రామానికి వచ్చినపుడు మా ఇంటికి వచ్చి అభివృద్ధిపై కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఆ తరువాత కూడా గ్రామానికి వచ్చినపుడు మా ఇంటికి వచ్చారు. అప్పట్లో జరిగిన అభివృద్ధి పనులు చూస్తే ఎంతో సంతోషంగా ఉండేది. సుమారు 50 ఏళ్లలో జరగాల్సిన అభివృద్ధి రెండేళ్లలోనే జరిగిందని భావించాం. కానీ నేడు నిర్వహణ లోపంతో అనేక సదుపాయాలు నిరుపయోగంగా మారడం బాధ కలిగిస్తోంది.

- మహేశ్‌, స్థానికుడు

Updated Date - Nov 24 , 2026 | 05:23 AM