Share News

గొల్లపూడిలో 'రైతన్న మీకోసం'.. రైతులతో సమావేశం అయిన మంత్రులు..

ABN , Publish Date - Mar 16 , 2026 | 09:15 PM

‘రైతన్న మీకోసం’ కార్యక్రమం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం అయింది. కార్యక్రమంలో భాగంగా మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతులతో సమావేశం అయ్యారు.

గొల్లపూడిలో 'రైతన్న మీకోసం'.. రైతులతో సమావేశం అయిన మంత్రులు..
Rythanna Meekosam program AP

అమరావతి, మార్చి 16: గొల్లపూడిలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం సోమవారం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో భాగంగా మంత్రులు అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ రైతులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. ‘ఈ రోజు నుంచి ఆరు రోజుల పాటు 'రైతన్న మీకోసం' కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు కుటుంబం దగ్గరికి మా ఆఫీసర్స్, ప్రజా ప్రతినిధులు అందరూ వెళతారు. రైతును కూర్చోబెట్టి వివరంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు చెబుతాం’..


‘వ్యవసాయాన్ని ఏ విధంగా చేస్తే లాభసాటిగా ఉంటుందో అన్నీ వివరిస్తాం. ఎక్కడ? ఎవరు? ఏ పంటలు పండిస్తున్నారో తెలియదు. ఒక్కో సంవత్సరం ఒక్కో పంటకు విపరీతంగా ధరలు వస్తున్నాయి. ధరలు వస్తాయని చెప్పి అందరూ అదే పంట వేస్తున్నారు. ఒకేసారి ధరలన్నీ పడిపోతున్నాయి. అలా కాకుండా.. ఏ ప్రాంతానికి ఏ పంటలు అనుకూలంగా ఉంటాయి, ఏ పంట ఏ ప్రాంతంలో వేయాలనేది ప్రభుత్వము చెబుతుంది. గతంలోలా కాకుండా రైతు సేవా కేంద్రాల్లో అవగాహన కల్పిస్తాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు సంక్షేమం కోసం అనేక చర్యలు తీసుకుంటున్నారు’..


‘ఎన్‌డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కలిసి రైతులకు ఇచ్చిన హామీ మేరకు ఏడాదికి 20,000 అందిస్తున్నాయి. ఈ మొత్తాన్ని మూడు విడతల్లో నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నాయి. ఇటీవలే ముఖ్యమంత్రి మూడవ విడత నిధులను కూడా విడుదల చేశారు. ​వాతావరణ శాఖ ఈ ఏడాది 'ఎల్ నినో' ప్రభావం ఉంటుందని హెచ్చరించింది. దీనివల్ల వర్షపాతం తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. అందుబాటులో ఉన్న నీటిని రైతులు పొదుపుగా సద్వినియోగం చేసుకోవాలి. సాధారణంగా జూలై లేదా ఆగస్టులో ప్రారంభమయ్యే ఖరీఫ్ సాగును, ఈ ఏడాది మే 15 నుంచే ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది’ అని చెప్పారు.


ఇవి కూడా చదవండి

నటి ప్రత్యూష కేసులో మరో కీలక పరిణామం

హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లో భారీ చోరీ

Updated Date - Mar 16 , 2026 | 09:31 PM