Share News

రుషికొండపై నిబంధనల ఉల్లంఘన నిజమేరుషికొండపై నిబంధనల ఉల్లంఘన నిజమే

ABN , Publish Date - Nov 27 , 2026 | 01:44 AM

రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భవన నిర్మాణాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది.

రుషికొండపై నిబంధనల ఉల్లంఘన నిజమేరుషికొండపై నిబంధనల ఉల్లంఘన నిజమే

  • తవ్వకాలు, మట్టి తరలింపుతో కొండ భౌగోళిక రూపంలో మార్పులు

విశాఖపట్నం, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): రుషికొండపై గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన భవన నిర్మాణాల్లో పర్యావరణ నిబంధనల ఉల్లంఘన జరిగిందని నిపుణుల కమిటీ నిర్ధారించింది. కోస్తా నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించి ఏపీటీడీసీ నిర్మించిన ఈ భవనం వల్ల ప్రభావితమైన పర్యావరణ పునరుద్ధరణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించింది. వైసీపీ ప్రభుత్వం హయాంలో విశాఖపట్నంలోని రుషికొండపై హరిత రిసార్ట్స్‌ను కూలగొట్టి అంతకుమించిన విస్తీర్ణంలో ప్యాలెస్‌ నిర్మించిన సంగతి తెలిసిందే.

పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా దీన్ని నిర్మిస్తున్నారని నాటి కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌, ఆతర్వాత రఘురామకృష్ణరాజు తదితరులు హైకోర్టులో పిల్‌ వేశారు. దీంతో రుషికొండలో జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి హైకోర్టు ఆదేశాల మేరకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంవోఈఎఫ్‌) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ అధ్యయనం చేసింది. ప్రాజెక్టుకు సంబంధించిన పత్రాలు, ఏపీటీడీసీ వివరణలు, సంయుక్త కమిటీ నివేదికలను పరిశీలించి, నిబంధనలను గమనించి, క్షేత్రస్థాయిలో పరిశీలించి సమగ్ర నివేదికను కమిటీ రూపొందించింది. అయితే చైర్మన్‌ మరణించడంతో నివేదికను హైకోర్టుకు సమర్పించడంలో జాప్యం జరిగింది. ఎట్టకేలకు బుధవారం నివేదిక హైకోర్టుకు చేరింది.


భౌగోళిక రూపంలో భారీ మార్పులు..

భారీ భవన నిర్మాణం కోసం విస్తృత స్థాయిలో కొండను తవ్వడం, మట్టి తరలింపు, భూమిని చదును చేయడంవల్ల రుషికొండ భౌగోళిక రూపంలో గణనీయమైన మార్పులు వచ్చాయని కమిటీ నివేదికలో పేర్కొంది. సముద్రం నుంచి 500 మీ టర్లలోపు నిర్మాణాలకు ఎంవోఈఎఫ్‌ నుంచి అనుమతి తీసుకోలేదని, 200 మీటర్లలోపు కూడా నిర్మాణాలు చేపట్టారని పేర్కొంది. రిసార్ట్‌ నిర్మాణ స్థలం కంటే కొత్తగా నిర్మించిన భవన నిర్మాణ స్థలం ఎక్కువగా ఉందని తెలిపింది. వీటివల్ల పర్యావరణంపై ప్రభావం పడిందని పేర్కొంది. దీన్ని పునరుద్ధరించేందుకు ‘ఎన్విరాన్‌మెంటల్‌ రీస్టొరేషన్‌ ప్లాన్‌’ అమలు చేయాలని సూచించింది. ఈ నివేదికపై అభ్యంతరాలు ఉంటే సమర్పించాలని ఫిర్యాదీలకు సూచిస్తూ ఫిబ్రవరి 10కి హైకోర్టు వాయిదా వేసిందని మూర్తియాదవ్‌ చెప్పారు.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 01:48 AM