Share News

గుండె ఆగుతున్నా.. సమయస్ఫూర్తి!

ABN , Publish Date - Oct 09 , 2026 | 04:54 AM

బస్సు డ్రైవింగ్‌ సమయంలో గుండెపోటు వచ్చినా.. ఆ డ్రైవర్‌ స్టీరింగ్‌ను వదల్లేదు! ఓ వైపు తన గుండె ఆగిపోతున్నా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించాడు!!

గుండె ఆగుతున్నా.. సమయస్ఫూర్తి!

  • 60 కిలోమీటర్ల బస్సు వేగాన్ని నియంత్రించి.. సురక్షితంగా రోడ్డు పక్కన నిలుపుదల

  • 40 మంది ప్రాణాలు కాపాడిన ‘రియల్‌ హీరో’ శివ

  • డ్రైవింగ్‌లో ఉండగా గుండెపోటుతో మృతి

  • కాకినాడ నుంచి విశాఖ వెళ్తున్న బస్సు

నక్కపల్లి/కాకినాడ కార్పొరేషన్‌, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): బస్సు డ్రైవింగ్‌ సమయంలో గుండెపోటు వచ్చినా.. ఆ డ్రైవర్‌ స్టీరింగ్‌ను వదల్లేదు! ఓ వైపు తన గుండె ఆగిపోతున్నా.. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగకూడదని భావించాడు!! అగిపో..తున్న గుండెకు నువ్వు కాస్త ఉండమని చెప్పి.. 60 కిలోమీటర్లకు పైగా వేగంతో రన్నింగ్‌లో ఉన్న బస్సును నియంత్రించి రోడ్డు పక్కన ఆపాడు. ఆ తర్వాత తాను కూర్చున్న సీటులోనే వాలిపోయాడు. తాను మరణించినా.. బస్సులోని సుమారు 40 మంది ప్రయాణికులను సురక్షితంగా కాపాడాడు. చివరి క్షణంలోనూ సమయస్ఫూర్తి ప్రదర్శించి.. ‘రియల్‌ హీరో’ అనిపించుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.. కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి గ్రామానికి చెందిన జట్ల శివ (34) రోజువారీ వేతనంపై కాకినాడ ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ డిపోకు చెందిన నాన్‌స్టాప్ ఆర్టీసీ బస్సు (ఏపీ 05 జడ్‌ 5278) గురువారం ఉదయం కాకినాడ నుంచి విశాఖపట్నం బయలుదేరింది. శివ డ్రైవింగ్‌ చేస్తున్న ఆ బస్సులో సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాకినాడ జిల్లా తుని సమీపంలో వెళ్తుండగా డ్రైవర్‌ శివకు అకస్మాత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది.


అయితే ఆయన ఆ నొప్పిని ఓర్చుకుంటూ సుమారు 20 కిలోమీటర్ల మేర బస్సును నడిపాడు. ఉదయం 9.30 గంటల సమయంలో అనకాపల్లి జిల్లా నక్కపల్లి చేరుకునే సమయానికి నొప్పి ఎక్కువైంది. ఈ సమయంలో బస్సు 60 కిలోమీటర్లకు పైగా వేగంతో వెళ్తోంది. దీంతో తన ప్రాణం కన్నా ప్రయాణికుల ప్రాణాలే ముఖ్యమని భావించి.. బస్సు వేగాన్ని నియంత్రించి, చాకచక్యంగా బస్సును రోడ్డు పక్కకు తీసి ఆపాడు. మరుక్షణమే డ్రైవర్‌ సీటులోనే వాలిపోయాడు. ఏం జరిగిందో తెలియక పలువురు ప్రయాణికులు డ్రైవర్‌ వద్దకు వచ్చారు. తట్టి లేపడానికి ప్రయత్నం చేశారు. కానీ చలనం లేకపోవడంతో ప్రయాణికుల్లో ఒకరు సీపీఆర్‌ చేసి, వెంటనే నక్కపల్లి సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. కానీ డ్రైవర్‌ శివ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఈ వార్తలనూ చదవండి:

ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ.. చర్చించిన కీలక అంశాలివే..

డిజిటల్ కరెన్సీని మోదీ ప్రోత్సహించారు

Updated Date - Oct 09 , 2026 | 04:54 AM