పశుసంవర్ధక శాఖలో భారీ కుంభకోణం
ABN , Publish Date - Nov 19 , 2026 | 05:33 AM
సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకం నిధులను ప్రకాశం జిల్లాలో ముగ్గురు అధికారులు స్వాహా చేశారు. సుమారు 15 ఏళ్ల కాలంలో రూ.8.80 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు శాఖాపరమైన విచారణలో వెల్లడైంది.
రూ.8.80 కోట్ల నిధులు గోల్‌మాల్
ముగ్గురు అధికారులపై కేసు నమోదు
ఒంగోలు క్రైం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకం నిధులను ప్రకాశం జిల్లాలో ముగ్గురు అధికారులు స్వాహా చేశారు. సుమారు 15 ఏళ్ల కాలంలో రూ.8.80 కోట్లు గోల్‌మాల్ జరిగినట్లు శాఖాపరమైన విచారణలో వెల్లడైంది. సమగ్ర గొర్రెల అభివృద్ధి పథకంలో సొసైటీలకు ఇచ్చిన రుణాలను వసూలు చేసి ఆ నగదును బ్యాంకులలో జమ చేయలేదు. అలాగే కార్యాలయంలో కూడా సక్రమంగా రిజిస్టర్లు నిర్వహించక పోవడం లాంటి తప్పిదాలు చేశారు. మొత్తంగా శాఖలో 2011 నుంచి 2025 వరకు అవినీతి భాగోతం నడిచింది.
ఆ సమయంలో పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులుగా పనిచేసిన డాక్టర్ ఎం.రవికుమార్ కాలంలో రూ.7,88,82,457, డాక్టర్ కె.సత్యనారాయణ కాలంలో రూ.79,76 ,460, డాక్టర్ సీహెచ్.వెంకటరామిరెడ్డి కాలంలో రూ.10,71,807 దుర్వినియోగమైనట్టు తేలింది. మొత్తం రూ.8,79,30,724 గోల్‌మాల్ అయినట్టు ప్రాథమిక విచారణలో వెల్లడైంది.
ఇప్పటికే సంబంధిత అధికారులపై విచారణ జరిపి, ఆ ముగ్గురిపై శాఖాపరమైన చర్యలు కూడా తీసుకున్నారు. అయినప్పటికీ పశుసంవర్థక శాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి ఎం.నాగమణి ఫిర్యాదు మేరకు ఒంగోలు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్
పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్