ఇదీ మీ బాధ్యతే!
ABN , Publish Date - Oct 31 , 2026 | 04:53 AM
అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది రెవెన్యూ సిబ్బంది పరిస్థితి! ఓవైపు ఎన్నికల విధులు.. మరోవైపు సర్ బాధ్యతలతో క్షణం తీరికలేకుండా తలమునకలై ఉంటే.. ఇప్పుడు పులి మీద పుట్రలా రీసర్వే బాధ్యతలు తప్పదంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు.
ఆర్‌డీఓ, తహసీల్దార్, సర్వేయర్లపై జేసీల ఒత్తిళ్లు.. కొత్త టార్గెట్లు
క్షణం తీరికలేకున్నా తప్పదంటూ నోటీసులు
క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది గగ్గోలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి): అడకత్తెరలో పోకచెక్కలా తయారైంది రెవెన్యూ సిబ్బంది పరిస్థితి! ఓవైపు ఎన్నికల విధులు.. మరోవైపు సర్ బాధ్యతలతో క్షణం తీరికలేకుండా తలమునకలై ఉంటే.. ఇప్పుడు పులి మీద పుట్రలా రీసర్వే బాధ్యతలు తప్పదంటూ తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ‘రీ సర్వే కూడా మీ బాధ్యతలో భాగమే, దాన్ని ఎందుకు వదిలేశారు? ఉద్యోగం చేస్తారా? ఇంటికెళ్తారా?’ అంటూ ఆర్‌డీఓ, తహసీల్దార్‌లపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెంచారు. జిల్లాల్లో వారిపై జాయింట్ కలెక్టర్లను ఉసిగొల్పుతూ తీవ్రస్థాయి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఇటు ఎన్నికల విధులు, ఇటు రీసర్వే టార్గెట్లు భరించలేక మానసిక ఒత్తిడికి గురవుతున్నామని, ఇదంతా ప్రభుత్వానికి తెలిసే రెవెన్యూశాఖ చేస్తోందా? అంటూ అధికారులు, ఉద్యోగులు గగ్గోలుపెడుతున్నారు.
జేసీలదే బాధ్యత అని టార్గెట్
ఎన్నికల విధుల్లో గ్రామ సర్వేయర్ (వీఎస్), గ్రామ రెవెన్యూ అధికారి(వీఆర్‌ఓ), మండల సర్వేయర్(ఎంఎస్), డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్(డీఐఓఎస్), మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ), డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, రెవెన్యూ డివిజనల్ అధికారులు(ఆర్‌డీఓ)లు తలమునకలయ్యారు. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో రాజకీయంగా సున్నితమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికల డ్యూటీతోపాటు రీసర్వే కూడా చేయాల్సిందేనని రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు అమరావతి నుంచి కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ, సర్వే అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు.
టెలికాన్ఫరెన్స్‌ల్లో ఏమాత్రం మర్యాద, గౌరవం లేకుండా పరుషపదజాలంతో సంభాషిస్తున్నారు. రీసర్వేను పర్యవేక్షించే బాధ్యత జాయుంట్ కలెక్టర్‌లదేనని, ఎక్కడైనా పురోగతి లేకుంటే ఆ జిల్లా జేసీదే బాధ్యత అని టార్గెట్‌తో కూడిన మౌఖిక ఆదేశాలు ఇస్తున్నారు. ఉదయం 7నుంచి సాయంత్రం 5దాకా ఎన్నికల డ్యూటీ చేయాలని, ఆ తర్వాత రీ సర్వేపై టైమ్ కేటాయించాలంటూ పలువురు జేసీలు రెవెన్యూ సిబ్బందికి సరికొత్త టైమ్‌షెడ్యూల్ ఇస్తున్నారని తెలిసింది. ఇదే విషయమై తహసీల్దార్, ఆర్‌డీఓలు, గ్రామస్థాయి సిబ్బందితో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించి రీ సర్వే ఒత్తిళ్లను పరాకాష్ఠకు తీసుకెళ్తున్నారని తెలిసింది. అంటే పగలూరాత్రీ తేడాలేకుండా రెవెన్యూ అధికారులు, సిబ్బంది పనిచేయాలని జేసీలు కొందరు తీవ్రస్థాయి ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు.
ఉపశమనం మాటల్లోనేనా?
ఎన్నికల డ్యూటీలో ఉన్న రెవెన్యూ సిబ్బందిపై ఎలాంటి ఒత్తిడీ చేయబోమని సర్వే డైరెక్టర్ ఈ నెల 18నే ప్రకటించారు. కానీ, వారం రోజుల వ్యవధిలోనే సర్వే ఆర్‌డీడీ మరో ఉత్తర్వు ఇస్తూ.. రీ సర్వే ఉంటుందంటూ సీసీఎల్‌ఏ డిజిటల్ సంతకంతో సర్వేయర్‌ల డిప్యుటేషన్ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై రెవెన్యూ, సర్వే సిబ్బంది భగ్గుమనడంతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ జోక్యం చేసుకొన్నారు. దీపావళి ముగిసేవరకు ఎలాంటి ఒత్తిళ్లూ ఉండవని కలెక్టర్లు, జేసీలు, సిబ్బందికి భరోసా ఇవ్వాలని సర్వేడైరెక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. ఇదే విషయాన్ని సర్వే డైరెక్టర్ ఆర్.కూర్మనాథ్ జిల్లాల కలెక్టర్లు, జేసీలకు, సర్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.
అయితే, మౌఖిక ఆదేశాలు తప్ప లిఖితపూర్వకంగా ఇవ్వలేదు. ఇదిలా ఉండగానే, రెవెన్యూలోని ఓ ఉన్నతాధికారి రీ సర్వే చేసితీరాల్సిందేనని, జేసీలు ఈ విషయంలో బాధ్యత తీసుకోవాలని మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఏ జిల్లాలో అయినా రీ సర్వే వెనకబడితే సంబంధిత జేసీలదే బాధ్యత అని ఆ అధికారి హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో జేసీలు మరోసారి రీ సర్వే టార్గెట్‌లు బయటకు తీశారు. ఈ పరిణామాలపై రెవెన్యూ, సర్వే అధికారులు గగ్గోలు పెడుతున్నారు. ఈ విషయంలో రెవెన్యూశాఖ బాధ్యతలు చూస్తున్న సీఎస్ సాయిప్రసాద్ జోక్యం చేసుకుని, ఆ మేరకు అధికారికంగా ఉత్తుర్వులు కూడా ఇవ్వాలని అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?