Share News

కూటమికి రెబల్స్‌ సెగ !

ABN , Publish Date - Oct 29 , 2026 | 03:53 AM

స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ బరిలో ఉండడానికి వీల్లేదని కూటమి పార్టీల అగ్రనేతలు పదే పదే చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగి అధికారిక అభ్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. కూటమి అధికారంలో ఉండడం..

కూటమికి రెబల్స్‌ సెగ !

  • బరిలో ఉండొద్దన్న అగ్రనేతల మాటలు బేఖాతర్‌

  • ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడంటూ..గెలుపు ధీమాతో పలువురి పోటీ

  • రాష్ట్రవ్యాప్తంగా 26 జెడ్పీటీసీలు,171 ఎంపీటీసీల్లో తిరుగుబాటు అభ్యర్థులు

  • వీరి బెడద రాయలసీమలోనే అధికం

  • తర్వాత ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో నాయకత్వం బుజ్జగిస్తున్నా ససేమిరా

(అమరావతి-ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో రెబల్స్‌ బరిలో ఉండడానికి వీల్లేదని కూటమి పార్టీల అగ్రనేతలు పదే పదే చెబుతున్నా.. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తిరుగుబాటు అభ్యర్థులు పోటీకి దిగి అధికారిక అభ్యర్థులకు సవాల్‌ విసురుతున్నారు. కూటమి అధికారంలో ఉండడం.. అభివృద్ధి, సంక్షేమంలో సర్కారు జోరు పెంచడంతో.. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుపు తథ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు భావిస్తున్నారు. ఆ ఉత్సాహంతో తమకే బీ ఫామ్‌ దక్కుతుందన్న నమ్మకంతో ఎవరికివారు నామినేషన్లు వేశారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా చాలా మందికి పోటీ చేసే అవకాశం దూరమైంది. అలాంటివారు..

‘ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు’ అన్న ఆలోచనతో రెబల్స్‌గా బరిలోకి దిగి సై అంటే సై అంటున్నారు. అగ్రనేతల హెచ్చరికలు.. స్థానిక నేతల బుజ్జగింపులతో కొందరు దారికి వచ్చినా.. మరికొందరిపై ఏ మాత్రం ప్రభావం చూపడం లేదు. గెలుపు ఖాయమన్న ఉద్దేశంతో చాలా మంది పోటీ నుంచి వైదొలిగేందుకు ససేమిరా అంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 959 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాల్లో 26 చోట్ల కూటమి రెబల్స్‌ బరిలో ఉన్నారు. 7853 ఎంపీటీసీ స్థానాలకు గాను 171 స్థానాల్లో రెబల్స్‌ బరిలో ఉన్నారు.


రాయలసీమలో ఎక్కువగా..

కూటమికి రాయలసీమ జిల్లాల్లో రెబల్స్‌ బెడద ఎక్కువగా ఉంది. 12 జడ్పీటీసీ, 64 ఎంపీటీసీ స్థానాలకు తిరుగుబాటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. తిరుపతి జిల్లాలో చంద్రగిరి నియోజకవర్గం చిన్నగొట్టిగల్లు జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. జనసేన నియోజకవర్గ ఇన్‌చార్జి దేవర మనోహర్‌ బరిలో ఉన్నారు. ఆ పార్టీ నుంచే రెబల్‌గా ఆర్థికంగా బలంగా ఉన్న గుండాల వెంకటరమణ పోటీచేస్తున్నారు.

కర్నూలు జిల్లా: కొతాళం జడ్పీటీసీ నుంచి టీడీపీ అభ్యర్థి పోటీ చేస్తుండగా.. బీజేపీ నుంచి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ కూడా రంగంలోకి దిగారు. హోళగుంద జడ్పీటీసీ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థి కురవ దర్గన్న పోటీలో ఉండగా.. అదే పార్టీ సీనియర్‌ నాయకుడు ఈడిగ గోవిందరెడ్డి సైతం బరిలో నిలిచారు.

నంద్యాల జిల్లా: ఆళ్లగడ్డ, సిరివెళ్ల, పాములపాడు, గోస్పాడు, గడివేముల జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన రెబల్స్‌ బరిలో ఉన్నారు. 41 ఎంపీటీసీ స్థానాల్లో 3 పార్టీల నుంచీ తిరుగుబాటు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 31 ఎంపీటీసీల్లో రెబల్స్‌ బరిలో ఉన్నారు.

శ్రీసత్యసాయి జిల్లాలో: నంబులపులకుంట జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా ఇక్కడ టీడీపీ రెబల్‌ బరిలో ఉన్నారు. 18 ఎంపీటీసీ స్థానాల్లోనూ కూటమి తిరుగుబాట్లు ఎదుర్కొంటోంది.


అనంతపురం జిల్లా: బొమ్మనహళ్‌ జడ్పీటీసీ అభ్యర్థిగా జనసేనకు బీఫామ్‌ ఇచ్చారు. ఇక్కడ టీడీపీ రెబల్‌ బరిలో ఉన్నారు. నార్పల జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి బరిలో ఉండగా.. టీడీపీ, జనసేన నుంచి ఇద్దరు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. 5 ఎంపీటీసీ స్థానాల్లో కూడా ఈ పార్టీల రెబల్‌ అభ్యర్థులు పోటీచేస్తున్నారు. కడప జిల్లా కలసపాడు జడ్పీటీసీని జనసేనకు కేటాయించగా.. ఇక్కడ టీడీపీ నేత రెబల్‌గా బరిలో ఉన్నారు.

ఉత్తరాంధ్రలో..

ఉత్తరాంధ్ర జిల్లాల్లో 6 జడ్పీటీసీ స్థానాలకు, 3 ఎంపీటీసీలకు రెబల్స్‌ బరిలో ఉన్నారు. విజయనగరం జిల్లా పూసపాటిరేగ జడ్పీటీసీ స్థానానికి టీడీపీ అభ్యర్థిపై ఆ పార్టీ రెబల్‌ పోటీకి దిగారు. 3 ఎంపీటీసీ స్థానాల్లో జనసేన, టీడీపీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోనాడ ఎంపీటీసీ స్థానానికి పోటీలు పడి నామినేషన్లు వేయడంతో ఎవరికి బీఫామ్‌ ఇవ్వాలో అర్థంకాక.. చివరకు ఎవరికీ ఇవ్వకుండా నేతలు చేతులెత్తేశారు.

పార్వతీపురం నియోజకవర్గంలో బలిజిపేట జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక్కడ టీడీపీ రెబల్‌ బరిలో ఉన్నారు. గుమ్మలక్ష్మీపురం జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఇక్క డ టీడీపీ సీనియర్‌ పాడి సుదర్శనరావు కూడా పోటీకి దిగారు. పాలకొండలో వీరఘట్టం జడ్పీటీసీ స్థానాన్ని టీడీపీకి కేటాయించగా.. ఇక్కడ జనసేన, బీజేపీ నేతలు సైతం బరిలో ఉన్నారు.


అనకాపల్లి జిల్లాలో..

మాడుగుల, బుచ్చయ్యపేట జడ్పీటీసీ స్థానాలకు రెబల్స్‌ బరిలో ఉన్నారు.

గోదావరి జిల్లాల్లో 5 జడ్పీటీసీలకు, 77 ఎంపీటీసీ స్థానాలకు రెబల్స్‌ బరిలో ఉన్నారు. కాకినాడ జిల్లా ఏలేశ్వరం జడ్పీటీసీ స్థానాన్ని బీజేపీకి కేటాయించగా.. జనసేన నేత, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు తనయుడు వీర వెంకట సత్యసూరిబాబు పోటీలో ఉన్నారు. కరప జడ్పీటీసీని టీడీపీకి కేటాయించగా.. అదే పార్టీకి చెందిన నేత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ జిల్లాలో 77 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి పార్టీలకు రెబల్స్‌ తలనొప్పి ఉంది.

కోనసీమ జిల్లాలోనూ ...

రెండు జడ్పీటీసీ స్థానాల్లో రెబల్స్‌ బరిలో ఉన్నారు.

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం మండవల్లి జడ్పీటీసీ నుంచి టీడీపీ అభ్యర్థి కాట్రగడ్డ శంకర్‌రావు పోటీలో ఉండగా.. జనసేన నుంచి ఘంటసాల శ్రీనివాసరావు, ఆయన భార్య బరిలోకి దిగారు. వీరు స్వతంత్రులుగా పోటీపడుతున్నారు.

కృష్ణా, గుంటూరుల్లో రెబల్స్‌ తక్కువే..

కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెబల్స్‌ తాకిడి తక్కువే. ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక్క ఎంపీటీసీ నుంచే రెబల్‌ బరిలో ఉన్నారు కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం మొవ్వ జడ్పీటీసీ స్థానాన్ని జనసేనకు కేటాయించారు. ఆ పార్టీ నుంచి తాడిశెట్టి నరేశ్‌ పోటీ చేస్తుండగా.. ఆయనపై

టీడీపీ నేత నన్నపనేని నరేంద్ర పోటీకి దిగారు.

పల్నాడు జిల్లాలో మూడు ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీల నుంచీ అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

బాపట్ల జిల్లాలో

చీరాల జడ్పీటీసీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించారు. ఇక్కడ టీడీపీ నేత బరిలోకి దిగారు. ఈయన ప్రభావం ఎక్కువగా ఉంది. పర్చూరు నియోజకవర్గంలో మొత్తం 8 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ, జనసేన రెండు పార్టీల అభ్యర్థులూ బీఫామ్స్‌ దక్కించుకుని అధికారికంగా పోటీ పడుతున్నారు.

నెల్లూరు జిల్లాలో 15 ఎంపీటీసీ స్థానాల్లో రెబల్స్‌ బరిలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జనసేన వారే.

నగరం బీజేపీ బీఫామ్‌పై గందరగోళం

సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు

బాపట్ల, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): పొత్తులో భాగంగా బాపట్ల జిల్లాలో చీరాల, కొల్లూరు జడ్పీటీసీ స్థానాలను బీజేపీకి కేటాయించగా ఆ 2 స్థానాల్లో టీడీపీ వైదొలగడంతో బీజేపీ అభ్యర్థులు బీ-ఫామ్స్‌ ఇచ్చి కమలం గుర్తుమీద బరిలో ఉన్నా రు. కానీ టీడీపీకి కేటాయించిన నగరం జడ్పీటీసీ లో ఆ పార్టీ అభ్యర్థి చింతల సుబ్బారావు పోటీచేస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాలో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా జుజ్జువరపు సురేశ్‌ బరిలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. బీజేపీ పెద్దల ఆశీస్సులతోనే ఆయన పోటీ చేస్తున్నారని అందరూ అనుకున్నారు.

అయితే అసలు ఆయనకు తాము బీ ఫామే ఇవ్వలేదని బీజేపీ జిల్లా ఇన్‌చార్జి వెంకయ్యనాయుడు చెప్పారు. సంతకం ఫోర్జరీ చేశారంటూ బుధవారం రిటర్నింగ్‌ అధికారితో పాటు జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయితే ఏ ఫామ్‌ అథారిటీతో పాటు సంతకం సరిపోయిన తర్వాతే సురేశ్‌ నామినేషన్‌ను అంగీకరించామని ఆర్వో, జేసీ భావన తెలిపారు. తాను సమర్పించింది పార్టీ ఇచ్చిన బీఫామేనని సురేశ్‌ అంటున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పోటాపోటీ

ఆర్నబ్ తుఫాన్ బాధితులకు సీఎం చంద్రబాబు భారీ ఊరట

Updated Date - Oct 29 , 2026 | 03:57 AM