గ్రామాభివృద్ధికి ‘బాండ్’ భరోసా!
ABN , Publish Date - Nov 21 , 2026 | 01:02 AM
పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
రూ.100 బాండ్ పేపర్‌పై రాయభూపాలపట్నం టీడీపీ నాయకుల లిఖితపూర్వక హామీ
నామినేషన్ విత్‌డ్రా చేసుకున్న స్వతంత్ర అభ్యర్థి
పెద్దాపురం, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల పోరులో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం రాయభూపాలపట్నంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. గ్రామంతో పాటు పాఠశాల అభివృద్ధి, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన తదితర అంశాలపై గ్రామ టీడీపీ నాయకులు రూ.100 బాండ్ పేపర్‌పై సంతకాలు చేసి మరీ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. ఆ ‘ప్రజా హామీ పత్రానికి’ గ్రామ పెద్దలు, ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు సాక్షి సంతకాలు చేయడం గమనార్హం.
ఈ హామీ పత్రానికి నోటరీ కూడా చేయించారు. ఈ క్రమంలో సర్పంచ్ పదవికి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మన్యం చిన్నా అభ్యర్థి తన నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. రాజకీయ ప్రయోజనాలు, పదవి కంటే గ్రామాభివృద్ధి, ప్రజల సంక్షేమమే తనకు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం తాను ప్రతిపాదించిన పలు కీలక అంశాలను అమలు చేస్తామని స్థానిక టీడీపీ నాయకులు హామీ ఇవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అంతేకాకుండా చిన్నా తన జీరో బడ్జెట్ నామినేషన్ కోసం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా విరాళం అందించిన ప్రతీ రూపాయిని, ఇంటికి స్వయంగా వెళ్లి తిరిగి అందజేసి అందరి మన్ననలు పొందారు.
ఆయన మాట్లాడుతూ ఇది తన రాజకీయ వెనుకడుగు కాదని, గ్రామ భవిష్యత్తు కోసం తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయమని పేర్కొన్నారు. బాండ్ పేపర్‌పై ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలయ్యేలా ప్రజలతో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తానని స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం గ్రామంలోని పాఠశాలకు ప్రహారీ గోడ నిర్మాణం, విద్యార్థులకు సైకిల్‌షెడ్ ఏర్పాటు, తాగునీటి కోసం ఆర్వో ప్లాంట్, రోడ్ల మరమ్మతులకు నాయకులు అంగీకరించారు. అదేవిధంగా డ్వాక్రా మహిళలకు బ్యాంకు రుణాలు, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాల కల్పన, పూర్తి కొలతతో రేషన్ బియ్యం పంపిణీ, గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు, యువత కోసం డీ అడిక్షన్ కార్యక్రమాలను అమలు చేస్తామని బాండ్ పేపర్‌పై స్పష్టంగా పేర్కొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
పంట నష్టంపై సాయం అందించండి.. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్‌కు చంద్రబాబు వినతి
తాడిపత్రిలో హైటెన్షన్.. టీడీపీ శ్రేణులపై రాళ్ల దాడి