Share News

రాప్తాడు బాలిక ఓ ఫైటర్.. త్వరలోనే కోలుకుని వస్తుంది: మంత్రి నారా లోకే‌శ్

ABN , Publish Date - Nov 18 , 2026 | 06:35 PM

రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకే‌శ్ ప్రత్యేక దృష్టి సారించారు. బాలిక త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని సమీక్షించారు.

రాప్తాడు బాలిక ఓ ఫైటర్.. త్వరలోనే కోలుకుని వస్తుంది: మంత్రి నారా లోకే‌శ్
Rapthadu Girl

అమరావతి, నవంబరు 18: రాప్తాడు బాలిక ఆరోగ్య పరిస్థితిపై మంత్రి నారా లోకే‌శ్ మణిపాల్ ఆసుపత్రి వైద్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలికకు అందిస్తున్న వైద్య చికిత్స, ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి, కోలుకుంటున్న తీరు తదితర వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. బాలికకు మెరుగైన వైద్యం అందించాలని.. ఆమె ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. బాలిక త్వరలోనే కోలుకుని ఆసుపత్రి నుంచి ఇంటికి చేరుకుంటుందన్న వైద్యుల సమాచారంతో ఆశాభావం వ్యక్తం చేశారు.


ఈ సందర్భంగా బాలిక మనోధైర్యాన్ని మంత్రి నారా లోకే‌శ్ ప్రశంసించారు. ఆమె ఓ ఫైటర్ అని.. అన్ని ఇబ్బందులను అధిగమించి త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేవలం శారీరకంగా కోలుకోవడమే కాకుండా.. మానసికంగా కూడా పూర్తిగా కోలుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. ఈ విషయంలో బాలికకు అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆమె సాధారణ జీవితం తిరిగి ప్రారంభించే వరకు తోడుగా నిలుస్తానని భరోసా కల్పించారు. బాలిక ప్రాణాలను కాపాడేందుకు నిరంతరం శ్రమించిన మణిపాల్ ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బందికి మంత్రి నారా లోకే‌శ్ కృతజ్ఞతలు తెలిపారు. మరోవైపు.. బాలిక ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందని సమాచారం. త్వరలోనే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందని వైద్యులు మంత్రికి వివరించారు.

Updated Date - Nov 18 , 2026 | 06:45 PM