Share News

‘క్యూవీఎస్‌ఈ’ ఉచ్చులో విశాఖ అధికారులు!

ABN , Publish Date - Oct 03 , 2026 | 04:18 AM

దేశవ్యాప్తంగా కుదిపేసిన క్యూవీఎస్‌ఈ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ ఉచ్చులో విశాఖకు చెందిన పలువురు అధికారులు కూడా పావులుగా మారిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంతమందిని స్కీమ్‌లో చేరిస్తే అంత కమీషన్‌ వస్తుందనే ఆశతో..

‘క్యూవీఎస్‌ఈ’ ఉచ్చులో విశాఖ అధికారులు!

  • ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌లో ఆర్టీసీ డైరెక్టర్‌ స్థాయి అధికారి, పోలీస్‌ అధికారి

  • కమీషన్ల రూపంలో రూ.లక్షలు తీసుకున్నట్టు ప్రచారం

  • ఆర్టీసీ అధికారికి కోటి, పోలీస్‌ అధికారికి 80 లక్షల వరకు కమీషన్‌!

  • ఉత్తరాంధ్రలో వేలల్లో బాధితులు, రూ.కోట్లలో డిపాజిట్లు

  • ఫిర్యాదు ఇవ్వడానికీ ముందుకు రాని బాధితులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కుదిపేసిన క్యూవీఎస్‌ఈ ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ ఉచ్చులో విశాఖకు చెందిన పలువురు అధికారులు కూడా పావులుగా మారిన సంగతి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎంతమందిని స్కీమ్‌లో చేరిస్తే అంత కమీషన్‌ వస్తుందనే ఆశతో.. తెలిసిన వారందరినీ అందులోకి దించి.. వారు లాభపడినా మిగిలిన వారిని ముంచేశారు! ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు కావడంతో వారి మాట విని వేలాది మంది లక్షల్లో పెట్టుబడి పెట్టి ఈ ఉచ్చులో చిక్కుకుపోయారు. ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో బాధితులు వేలల్లో ఉండగా.. కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది!. వివరాలివీ.. ‘క్యూవీఎస్‌ఈ’(క్వాంట్‌ వెస్ట్‌ స్టాక్‌ ఎక్స్చేంజ్‌) ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ యాప్‌ గత ఏడాదిగా దేశవ్యాప్తంగా సుపరిచితం!. దేశ వ్యాప్తంగా లక్షలాది మంది నుంచి కోట్లాది రూపాయలను డిపాజిట్‌ రూపంలో సేకరించింది. నగదు రూపంలో డబ్బు చెల్లిస్తే అది డాలర్లలోకి మార్చుకొని మన పేరు మీద డిపాజిట్‌ చేస్తుంది. మనం ఆ తరువాత ఎంతమందిని ఆ యాప్‌ ద్వారా చేర్పిస్తే అంత కమీషన్‌ వస్తుంది. లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే నెల రోజుల్లో రూ.20 వేలు వస్తుందని నమ్మించారు. ఇంకొంత మందిని చేర్పిస్తే అందుకు గాను అదనంగా మరికొంత కమీషన్‌ ఇచ్చేవారు. సీనియారిటీ, చేర్పించిన సభ్యులను బట్టి మెంబర్‌ ర్యాంకింగ్‌ ఇచ్చేవారు. దానికి ప్రతి నెలా కొంత ఆదాయం ఇచ్చేవారు. ఈ వ్యాపారం బాగుందని తెలిసి ప్రభుత్వ అధికారులు కూడా పెట్టుబడులు పెట్టి, తమ కింద పనిచేస్తున్న వారితో, తెలిసిన వారితో డబ్బులు కట్టించారు.


ఈ విధంగా ఆర్టీసీలో ఉత్తరాంధ్రలో డైరెక్టర్‌ స్థాయిలో పనిచేస్తున్న అధికారి ‘మెగా మెంబర్‌’ స్థాయికి ఎదిగారు. అంటే ఇంకా కొంతమందిని చేరిస్తే గోల్డ్‌ మెంబర్‌ అయిపోతారు. అంత పెద్ద మొత్తంలో విజయనగరం నుంచి విజయవాడ వరకు సిబ్బందిని చేర్పించేశారు. అదే విధంగా త్రీ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఓ అధికారి కూడా కానిస్టేబుళ్లను, తెలిసిన వారిని చేర్పించారు. ఆర్టీసీ అధికారికి సుమారుగా కోటి రూపాయలు, పోలీస్‌ అధికారికి రూ.80 లక్షల వరకు కమీషన్ల రూపంలో ఆదాయం వచ్చిందని సమాచారం. అంటే వారు ఎంత పెద్ద మొత్తంలో డబ్బులు కట్టించారో అంచనా వేసుకోవాలి. ఈ యాప్‌ను భారతదేశంలో కాకుండా సైబర్‌ క్రైమ్‌ నేరాలు ఎక్కువగా చేసే కెన్యా నుంచి ఆపరేట్‌ చేస్తున్నట్టు ఆలస్యంగా గుర్తించారు. సుమారు రెండు వారాల క్రితం ఈ యాప్‌ను మూసేశారు. డిపాజిట్లు సేకరణ, చెల్లింపులు ఆపేశారు. దీంతో క్యూవీఎస్‌ఈ బండారం దేశవ్యాప్తంగా కుదిపేసింది. దాదాపు అన్ని రాష్ర్టాల్లో బాధితులు కోట్లలో ఉండగా.. ఉత్తరాంధ్రాకు చెందిన చాలామంది డబ్బులు అందులో ఉండిపోయాయి. ఖాతాలో డబ్బులుంటే కాలు కదపకుండా లాభం సంపాదించవచ్చనే దురాశతో.. చాలా మంది బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి మరీ ఇందులో పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు వారంతా లబోదిబోమంటున్నారు.


ఈ క్రమంలో ‘సార్‌ మిమ్మల్ని నమ్మే పెట్టుబడి పెట్టాం.. ఇప్పుడు మా సంగతేంటి’ బాధితులు అడుగుతుండడంతో ఆ ఒత్తిడి తట్టుకోలేక పోలీస్‌ అధికారి సెలవు పెట్టి వెళ్లిపోయారు. ఆర్టీసీ అధికారి మాత్రం గుంభనంగా ఉన్నారు. బాధితులు ఫిర్యాదు చేయడానికి ముందుకు రాకపోవడంతో కేసులు నమోదు చేయలేకపోతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కూడా దీనిపై ఎటువంటి అవగాహన కార్యక్రమాలు చేయడం లేదు. వారూ మౌనంగా ఉన్నారు. ఇంకా చాలా ప్రభుత్వ శాఖల్లో ఇలాంటివారు ఉన్నారని, పరువు పోతుందని బయటకు రావడం లేదని తెలుస్తోంది.

ఈ వార్తలనూ చదవండి..

స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు

శ్రీవారి ఆలయానికి ‘స్వచ్ఛ’ అవార్డు

Updated Date - Oct 03 , 2026 | 04:18 AM