స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలిమెట్టు
ABN , Publish Date - Oct 03 , 2026 | 01:21 AM
స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు అని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు.
తిరుపతి సెంట్రల్, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛతే ఆరోగ్యానికి తొలి మెట్టు అని కలెక్టర్ వెంకటేశ్వర్ స్పష్టం చేశారు. తిరుపతిలోని కచ్ఛపి ఆడిటోరియంలో నగర పాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ అధ్యక్షతన శుక్రవారం జిల్లా స్థాయి స్వచ్ఛ ఆంధ్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను నిరంతర ప్రక్రియగా కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఇది కేవలం పారిశుధ్య సిబ్బంది బాధ్యత మాత్రమే కాదని.. ప్రజల భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుందని చెప్పారు. తిరుపతి నగరంలో రోజూ సుమారు 250 టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ప్రస్తుతం 70 నుంచి 80 టన్నులు మాత్రమే ప్రాసెస్ చేయగలుగుతున్నామని తెలియజేశారు. మిగిలిన వ్యర్థాలను శ్రీరామాపురం డంపింగ్ యార్డుకు తరలిస్తున్నామని చెప్పారు. ఇక్కడ సుమారు రూ.300 కోట్ల వ్యయంతో రోజుకు 600 మెట్రిక్ టన్నుల చెత్తను ఎనర్జీగా తయారు చేసే ప్లాంటు 2027 డిసెంబరులోగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కమిషనర్ మాట్లాడుతూ.. గాంధీ, లాల్‌బహదూర్ శాస్ర్తి జయంతి సందర్భంగా వారి జీవిత సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని పరిశుభ్రతను జీవితంలో భాగంగా చేసుకోవాలని సూచించారు. అనంతరం జిల్లా స్థాయిలో వివిధ శాఖల సిబ్బందికి, సంస్థలకు అవార్డులను కలెక్టర్ ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ సుబ్బరాయుడు, డీఆర్‌డీఏ పీడీ శోభన్‌బాబు, డీపీవో సుశీలాదేవి, నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ శారదాదేవి, డీసీ అమరయ్య, స్మార్ట్ సీటీ జీఎం చంద్రమౌళి, మున్సిపల్ హెల్త్ అధికారి డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ అధికారి రవి, టీటీడీ పాలక మండలి సభ్యురాలు పనపాక లక్ష్మి, రాష్ట్ర బ్యూటిఫికేషన్ చైర్‌పర్సన్ సుగుణమ్మ, యాదవ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్, ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ, నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ రుద్రకోటి సదాశివం, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అన్నా అనిత, తిరుపతి టీడీపీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్, గంగమ్మ ఆలయ చైర్మన్ మహేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.