పరువు కోసం విధ్వంసం!
ABN , Publish Date - Nov 01 , 2026 | 04:24 AM
మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రమంతా దృష్టి సారించింది. ఎందుకంటే పోలింగ్‌కు ముందే ఇక్కడ వైసీపీపై టీడీపీ పైచేయి సాధించింది.
పులివెందులలో దాడులకు వైసీపీ వ్యూహం!!
పొరుగు నియోజకవర్గాలు, అనంత జిల్లా నుంచి గూండాల తరలింపు
నేడు పోలింగ్ జరిగేటప్పుడు టీడీపీ ముసుగులో దాడులు
చంద్రబాబే చేయించారని ప్రచారం చేసేందుకు పక్కా ప్లాన్?
కడప, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మాజీ సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపల్ ఎన్నికలపై రాష్ట్రమంతా దృష్టి సారించింది. ఎందుకంటే పోలింగ్‌కు ముందే ఇక్కడ వైసీపీపై టీడీపీ పైచేయి సాధించింది. ఈ మున్సిపాలిటీలో మొత్తం 40 వార్డులు ఉండగా.. 20 వార్డుల్లో టీడీపీ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 20 వార్డులు, చైర్‌పర్సన్ అభ్యర్థి ఎన్నికల్లో పోటాపోటీ తప్పదని తేలడంతో మాజీ సీఎం జగన్ కలవరపడుతున్నారని వైసీపీ వర్గాలు అంటున్నాయి. సొంతూరులో ఓడితే పరువు పోతుందని.. ప్రతిష్ఠ నిలబెట్టుకోవడానికి పెద్దఎత్తున విధ్వంసం సృష్టించైనా గెలవాలని వైసీపీ నేతలు పక్కా ప్రణాళిక రచించినట్లు తెలిసింది.
స్థానిక ఎన్నికల్లో ఎక్కడా ఏకగ్రీవాలు జరగకూడదని.. ప్రతి వార్డులో పార్టీ పోటీచేయాలని.. ఏకగ్రీవాలు ఎక్కువగా జరిగిన చోట్ల ఇన్‌చార్జులకు 2029 అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు ఇవ్వనని ఆయన ఇప్పటికే హెచ్చరించారు. కానీ ఇప్పుడు తన సొంతూరులోనే 20 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. రేపు చైర్‌పర్సన్ ఎన్నికలోనూ పార్టీ ఓడితే వారికి తన ముఖం ఎలా చూపించాలని ఆయన మథనపడుతున్నట్లు తెలిసింది. పైగా పులివెందుల చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆయన బాబాయి వైఎస్ మనోహర్‌రెడ్డి భార్య వైఎస్ ప్రమీల బరిలో ఉన్నారు. కూటమి తరపున తూగుట్ల గీతాకుమారి గట్టి పోటీ ఇస్తున్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక జగన్‌కు సవాల్‌గా మారింది. ఇక్కడ ఓడిపోతే తనకు, పార్టీకి వ్యక్తిగతంగా పూడ్చుకోలేని నష్టం జరుగుతుందని ఆయన ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
జనంలో మార్పు..?
పులివెందుల ఒకప్పుడు వైఎస్ కుటుంబానికి ఏకపక్షంగా ఉండేది. అయితే వివేకా హత్య వెనుక ఎవరున్నారో తేలడం.. చెల్లెలు షర్మిలకు ఆస్తులివ్వకుండా జగన్ వేధిస్తుండడం తదితర పరిణామాలతో ప్రజల్లో మార్పు కనిపిస్తోందని వైసీపీ వర్గాలే అంటున్నాయి. గత ఏడాది ఆగస్టులో జరిగిన పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో వైసీపీ దారుణంగా ఓడిపోయింది. ఇప్పుడు మున్సిపాలిటీలోనూ ఆ పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవాలని.. ఎలాగైనా గెలిచేందుకు విధ్వంసానికి ఆ పార్టీ నేతలు వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ఇందుకోసం ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాలతో పాటు అనంతపురం జిల్లా నుంచి గూండాలను రప్పించినట్లు సమాచారం. వారిని పులివెందులలోని వైఎస్ఆర్ ఆడిటోరియం, ఉలిమెల్లలో ఎంపీ అవినాశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో మోహరించారని అంటున్నారు. వీరంతా పోలింగ్ ప్రారంభమైన వెంటనే టీడీపీ శ్రేణుల ముసుగులో దాడులకు దిగుతారని తెలిసింది. జాతీయ స్థాయిలో దీనినో సమస్యగా చిత్రించేందుకు సొంత మీడియాకు తోడు జాతీయ మీడియాను కూడా తీసుకొచ్చారు. కొందరు యూట్యూబర్స్‌ను సైతం రంగంలోకి దించారు. పోలింగ్ సందర్భంగా వీరిపై దాడులకు తెగబడి.. మీడియా వాహనాలను ధ్వంసం చేసి.. ఇదంతా సీఎం చంద్రబాబే చేయించారని దుష్ప్రచారం చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేసినట్లు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఏపీకి మరో పెను తుఫాన్ ముప్పు.. ఆ జిల్లాలకు అలర్ట్..
జగన్ అక్రమాస్తుల కేసుల్లో కీలక మలుపు..!