Share News

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: ప్రణవ్‌గోపాల్‌

ABN , Publish Date - Nov 17 , 2026 | 05:05 PM

ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేస్తున్న విమర్శలపై వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల ఫీజుల బకాయిల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదని విమర్శించారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడే హక్కు జగన్‌కు లేదు: ప్రణవ్‌గోపాల్‌
AP Fee Reimbursement

విశాఖపట్నం, నవంబరు 17: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మాట్లాడే నైతిక హక్కు లేదని వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎం.వి.ప్రణవ్‌గోపాల్‌ విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్ చేస్తున్న విమర్శలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయేలా చేసి, ఇప్పుడు విద్యార్థుల సంక్షేమం గురించి మాట్లాడటం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వంలో సుమారు రూ.4 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పేరుకుపోయాయని ఆరోపించారు. మరోవైపు ప్రచార ఆర్భాటాలు, వ్యక్తిగత ప్రచారానికి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్.. విద్యార్థుల ఫీజుల చెల్లింపుల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని విమర్శించారు. బకాయిలు పెట్టి ఇప్పుడు బుకాయించడం జగన్ నైజమని ప్రణవ్‌గోపాల్‌ మండిపడ్డారు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నరేళ్ల కాలంలోనే సుమారు రూ.5 వేల కోట్ల మేర ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు చేసిందని ప్రణవ్‌గోపాల్‌ తెలిపారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యారంగ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో బకాయిలు పేరుకుపోతే.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం వాటిని చెల్లిస్తూ విద్యార్థులకు భరోసా కల్పిస్తోందని అన్నారు. వైసీపీ పాలనలో ప్రచార ఆర్భాటానికే ప్రాధాన్యం ఇచ్చారని, కూటమి ప్రభుత్వం మాత్రం అభివృద్ధి, విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇస్తోందని ప్రణవ్‌గోపాల్‌ పేర్కొన్నారు. మంత్రి నారా లోకేష్ చొరవతో విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించారు.


ఈ వార్తలనూ చదవండి:

వీఐపీల కోసం సింహాన్ని బైక్‌లతో తరిమిన పార్క్ సిబ్బంది.. వీడియో వైరల్

జంగిల్ సఫారీలో పర్యాటకులకు షాక్.. దూసుకొచ్చిన పెద్దపులి!

Updated Date - Nov 17 , 2026 | 06:01 PM