Share News

బతుకు వల బుగ్గయ్యింది

ABN , Publish Date - Nov 19 , 2026 | 04:17 AM

ఆ వలలు మత్స్యకారుల జీవనాధారం. రూ.కోట్ల విలువ చేసే వలలన్నీ క్షణాల్లో అగ్ని కీలల్లో కాలిపోయి బూడిదే మిగిలింది.

బతుకు వల బుగ్గయ్యింది

  • ప్రకాశం జిల్లా పల్లెపాలెంలో అర్ధరాత్రి అగ్ని ప్రమాదం

  • రూ.4 కోట్ల విలువైన వలలు అగ్నికి ఆహుతి

  • మత్స్యకారుల జీవనాధారం మంటలపాలు

కొత్తపట్నం(ఒంగోలు నగరం) నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ఆ వలలు మత్స్యకారుల జీవనాధారం. రూ.కోట్ల విలువ చేసే వలలన్నీ క్షణాల్లో అగ్ని కీలల్లో కాలిపోయి బూడిదే మిగిలింది. ఎగసి పడుతున్న మంటలలో కళ్లముందే వలలన్నీ తగలబడుతుంటే మత్స్యకారులు నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవాల్సి వచ్చింది. ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం కె.పల్లెపాలెం గ్రామంలో మంగళవారం అర్ధరాత్రి ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సముద్ర తీరంలో వలలను భద్రపరుచుకునే షెడ్లలో మంటలు చెలరేగడంతో 60 మంది మత్స్యకారులకు సంబంధించిన వలలు కాలి బూడిదయ్యాయి. వీటి విలువ రూ.4 కోట్లపైనే ఉంటుందని బాధితులు చెబుతున్నారు.

ఒక్కొక్కరికి రూ.30 లక్షల నష్టం!

అక్వాన్‌ తుఫాన్‌ హెచ్చరికల నేపథ్యంలో కె.పల్లెపాలెంలోని మత్స్యకారులు వేటకు విరామం పలికి తమ వలలను తీరంలో ఉన్న షెడ్లలో భద్రపరుచుకున్నారు. అగ్నిప్రమాదంతో గ్రామంలోని దాదాపు మత్స్యకారులందరికీ చెందిన వలలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఒక్కో మత్స్యకారుడికి రూ.30 లక్షల మేర నష్టం వాల్లిందని చెబుతున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌ కల్పనాకుమారి, ఎస్పీ హర్షవర్థన్‌రాజు అర్ధరాత్రే తీరానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మత్స్యకారులకు ధైర్యం చెప్పారు.

ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్‌ మత్స్యకారులను ఓదార్చారు. బుధవారం ఉదయం కలెక్టర్‌ రాజాబాబు ఘటనా స్థలానికి చేరుకుని వలలను పరిశీలించారు. మత్స్యకారులను అన్నివిధాలా ఆదుకుంటామని చెప్పారు. ఆఫ్కాస్‌ చైర్మన్‌ యాటగిరి రాంప్రసాదు కూడా సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

ఈ వార్తలనూ చదవండి:

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై జగన్‌కు లోకేశ్ కౌంటర్

పంజాబ్‌లో లారీ డ్రైవర్‌కు రూ.12 కోట్ల జాక్‌పాట్

Updated Date - Nov 19 , 2026 | 04:21 AM