Share News

పోలవరం తొలిదశకు మరో 4,300 కోట్లు అవసరం!

ABN , Publish Date - Sep 30 , 2026 | 04:43 AM

పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనుల పూర్తికి ఇంకో 4,300.90 కోట్లు అవసరమని రాష్ట్ర జల వనరుల శాఖ తెలిపింది. 41.15 మీటర్ల కాంటూరులో సివిల్‌ వర్క్స్‌ 90 శాతం, భూసేకరణ, సహాయ పునరావాసం పనులు 95 శాతం, నిర్వాసితుల తరలింపు 52 శాతం పూర్తయినట్లు పేర్కొంది.

పోలవరం తొలిదశకు మరో 4,300 కోట్లు అవసరం!

  • సివిల్‌ వర్క్స్‌ 90 శాతం పూర్తి

  • మార్చి 31నాటికి ఇవన్నీ పూర్తిచేస్తాం

  • సీఎంవోకు జలవనరుల శాఖ నివేదిక

  • ప్రాజెక్టులపై నేడు ముఖ్యమంత్రి సమీక్ష

అమరావతి, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనుల పూర్తికి ఇంకో 4,300.90 కోట్లు అవసరమని రాష్ట్ర జల వనరుల శాఖ తెలిపింది. 41.15 మీటర్ల కాంటూరులో సివిల్‌ వర్క్స్‌ 90 శాతం, భూసేకరణ, సహాయ పునరావాసం పనులు 95 శాతం, నిర్వాసితుల తరలింపు 52 శాతం పూర్తయినట్లు పేర్కొంది. సీఎం చంద్రబాబు బుధవారం అన్ని ప్రాధాన్య సాగునీటి ప్రాజెక్టులతో పాటు మధ్య, చిన్న తరహా పథకాలపైనా సమీక్ష నిర్వహించనున్న నేపథ్యంలో జలవనరుల శాఖ ముఖ్యమంత్రి కార్యాలయాని(సీఎంవో)కి పనుల పురోగతిపై నివేదిక సమర్పించింది. అందులో పోలవరం పనుల గురించి విశదీకరించింది. ఎర్త్‌ కం రాక్‌ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యాం వద్ద గ్యాప్‌-1 పనులు 50 శాతం (6.43 లక్షల క్యూబిక్‌ మీటర్లు) గ్యాప్‌-2 పనులు 44 శాతం (34.26 లక్షల క్యూబిక్‌ మీటర్లు) పూర్తయ్యాయి. ఈ పనులు వచ్చే మార్చి 31 నాటికి పూర్తవుతాయని జల వనరుల శాఖ తెలిపింది.

ప్రాజెక్టు పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులోనూ ప్రగతి ఓవరాల్‌గా 78 శాతం ఉందని.. సివిల్‌వర్క్స్‌కు 88 శాతం, భూసేకరణ, సహాయ పునరావాసానికి 64.3 శాతం చెల్లింపులు జరిపినట్లు స్పష్టం చేసింది. ఎడమ ప్రధాన కాలువ పనులు వచ్చే ఏడాది జూన్‌కల్లా పూర్తి చేస్తామని తెలిపింది. ఈ నెల రెండో తేదీన ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి దాకా గోదావరి జలాలను తరలింపునకు సీఎం ప్రారంభోత్సవం చేసిన సంగతి తెలిసిందే. కుడి ప్రధాన కాలువ పనులు వచ్చే మార్చినాటికి పూర్తవుతాయన్న ధీమా వ్యక్తమవుతోంది. గోదావరి జలాల తరలింపునకు నిర్మిస్తున్న కనెక్టివిటీ వంతెనలను వచ్చే నెల రెండో వారానికల్లా సిద్ధం చేస్తామని జల వనరుల శాఖ నివేదికలో పేర్కొంది.

ఈ వార్తలనూ చదవండి..

హై బీమ్‌ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు

వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం

Updated Date - Sep 30 , 2026 | 04:43 AM