ప్రధాని మోదీ రాక.. మరిచిపోలేని జ్ఞాపకం: నారా భువనేశ్వరి
ABN , Publish Date - May 11 , 2026 | 07:16 AM
ప్రధాని నరేంద్ర మోదీ తమ ఇంటికి అతిథిగా రావడం మరచిపోలేని జ్ఞాపకమని నారా భువనేశ్వరి అన్నారు. ఈ సందర్భంగా, దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మేలు జరగాలని ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు భువనేశ్వరి తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
అమరావతి, మే 11: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ, నారా కుటుంబ చరిత్రలోనూ ఒక అరుదైన ఘట్టం చోటుచేసుకుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, నారా చంద్రబాబు నాయుడు నివాసానికి విచ్చేసి, కుటుంబ సభ్యులతో గడిపిన క్షణాలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలను నారా భువనేశ్వరి సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ.. ప్రధాని తమ ఇంటికి రావడం ఒక మధుర జ్ఞాపకమని హర్షం వ్యక్తం చేశారు.
తమ నివాసానికి విచ్చేసిన ప్రధాని మోదీ.. ఎంతో ఆత్మీయంగా అందరినీ పలకరించారని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఒక దేశ ప్రధానిగా కాకుండా.. కుటుంబ సభ్యునిలా ఆయన పంచిన ప్రేమ, ఆప్యాయత తమను ఎంతో ఆకట్టుకుందని ఆమె తెలిపారు. దివంగత నందమూరి తారకరామారావు స్వయంగా పూజించిన సీతారాముల విగ్రహాలకు ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్యలో రామమందిరాన్ని ప్రతిష్టించిన ప్రధాని చేతుల మీదుగా పూజలు చేయడం ఎంతో సంతోషం అనిపించిందన్నారు. ఈ సందర్భంగా దేశం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ మేలు జరగాలని ప్రధాని ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు భువనేశ్వరి తన పోస్ట్‌లో వెల్లడించారు. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటన ఆప్యాయత, ఆతిథ్యం, ఆధ్యాత్మికతల అరుదైన కలబోతగా సాగిందన్నారు. ప్రధానమంత్రి అందించిన ఈ ఆత్మీయ గౌరవం తమ కుటుంబానికి ఎప్పటికీ గుర్తుండిపోయే గొప్ప జ్ఞాపకమని నారా భువనేశ్వరి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
మద్యం మత్తులో కొడుకును హత్య చేసిన తండ్రి
సర్కిల్‌కు టిప్పు సుల్తాన్ పేరు.. కడపలో ఉద్రిక్తం