Share News

5న అమరావతి క్వాంటమ్‌ కంప్యూటర్‌ సెంటర్‌ ప్రారంభం!

ABN , Publish Date - Nov 27 , 2026 | 05:30 AM

దేశంలోనే మొట్టమొదటైన అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (ఏసీసీ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

5న అమరావతి క్వాంటమ్‌ కంప్యూటర్‌ సెంటర్‌ ప్రారంభం!

  • ప్రధాని మోదీ చేతుల మీదుగా కార్యక్రమం

  • నేడు క్యాబినెట్‌లో సీఎం చంద్రబాబు ప్రకటించే అవకాశం

అమరావతి, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే మొట్టమొదటైన అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌ (ఏసీసీ) ప్రారంభానికి ముహూర్తం ఖరారైందని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. వచ్చే నెల 5న ప్రధాని నరేంద్రమోదీ దీనిని ప్రారంభిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని రాకకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ ఇంకా రాకపోయినా.. ఆయన కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి వర్తమానం వచ్చిందని తెలిపాయి. ప్రధాని పర్యటన అంశాన్ని శుక్రవారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రివర్గ సహచరులకు వివరించే అవకాశం ఉందని ప్రభుత్వవర్గాలు చెప్పాయి.

రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) పెట్టుబడుల ప్రతిపాదనలకు క్యాబినెట్‌ ఆమోదం తెలుపుతుందని, అదే సమయంలో ప్రధాని పర్యటన విషయాన్ని సీఎం ప్రస్తావిస్తారని వెల్లడించాయి. ఏసీసీ భవనం పనులు ఒకవైపు జరుగుతుండగానే.. ఈ భవనం ప్రాంగణంలో ఆ కంప్యూటర్‌ను స్థాపించే పనులను ఐబీఎం చేపట్టింది. ఇది ఐబీఎంకు ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిదో క్వాంటమ్‌ కంప్యూటర్‌ అని, దేశంలోని మొదటిదని ప్రభుత్వవర్గాలు వివరించాయి. అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ సెంటర్‌తో పాటు ఈ కంప్యూటర్‌నూ ప్రధాని మోదీ ప్రారంభిస్తారని చెప్పారు. ఇప్పటికే.. విజయవాడ మేధా టవర్స్‌లో, ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ ల్యాబ్‌లు పనిచేస్తున్నాయి.

ఈ వార్తలనూ చదవండి:

2019, 2020 నంది అవార్డుల ఎంపికకు జ్యూరీ కమిటీ ఏర్పాటు

బ్యాలెట్ బాక్స్‌లో ఇంకు పోసిన వైసీపీ నేతలు.. పోలింగ్ వాయిదా

Updated Date - Nov 27 , 2026 | 05:33 AM