Share News

గడువులోగా జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేయండి

ABN , Publish Date - Nov 26 , 2026 | 04:54 AM

జాతీయ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధాని మోదీ ఆదేశించారు.

గడువులోగా జాతీయ ప్రాజెక్టులు పూర్తి చేయండి

  • సీఎస్‌లకు ప్రధాని ఆదేశం.. పీఎం-సేతుపై ప్రత్యేక దృష్టి పెట్టండి

  • యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు పెంచండి: మోదీ

అమరావతి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): జాతీయ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులను ప్రధాని మోదీ ఆదేశించారు. అదే విధంగా పీఎం-సేతు పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసి యువతకు మెరుగైన నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని చెప్పారు. పలు జాతీయ ప్రాజెక్టులు, పీఎం సేతు తదితర అంశాలపై ప్రధాన మంత్రి వివిధ రాష్ట్రాల సీఎ్‌సలతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

దేశంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐ)ను ఆధునికీకరించి యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రతిష్టాత్మక పథకం పీఎం-సేతు. ఈ పథకం కోసం ఐదేళ్ల కాలానికి రూ. 60 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. దీనిలో కేంద్రం రూ. 30 వేల కోట్లు, రాష్ట్రాలు రూ. 20 వేల కోట్లు, పరిశ్రమ భాగస్వాములు రూ. 10 వేల కోట్లు భరిస్తాయి. హబ్‌- అండ్‌- స్పోక్‌ విధానంలో దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన 1,000 ప్రభుత్వ ఐటీఐలను ఈ పథకం కింద ఆధునికీకరిస్తారు. వీటిలో ప్రధాన కేంద్రాలుగా (హబ్స్‌) 200 ఐటీఐలను, వాటికి అనుబంధం (స్పోక్స్‌)గా మరో 800 ఐటీఐలను అభివృద్ధి చేస్తారు. దేశంలోనే తొలిసారిగా ఈ పథకం కింద రాష్ట్రంలోని విశాఖపట్నం ఐటీఐ క్లస్టర్‌ ఆధునికీకరణకు ఆమోదం లభించింది.

ఇక్కడ ఆర్సెలార్‌ మిట్టల్‌- నిప్పన్‌ స్టీల్‌ భాగస్వామ్యంతో రూ. 200 కోట్లతో నాలుగు ప్రభుత్వ ఐటీఐలను అభివృద్ధి చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 83 ఐటీఐలను ఆధునిక క్లస్టర్లుగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రం నుంచి ఈ వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎస్‌ సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

యలహంక ప్యాలెస్ వివాదం.. విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

సర్పంచ్ ఎన్నికలు.. రెబల్ అభ్యర్థులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్

Updated Date - Nov 26 , 2026 | 04:56 AM