ఆ కాల్పులపై సీబీఐ విచారణకు ఆదేశించండి
ABN , Publish Date - Nov 03 , 2026 | 04:44 AM
అనంతపురం జిల్లా, రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడిచేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఉదంతంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ...
హైకోర్టులో పిల్... అత్యవసర విచారణకు అభ్యర్థన
పిల్‌లో అడ్వొకేట్ ఆన్ రికార్డ్‌గా న్యాయవాది సాల్మన్‌రాజు
వైసీపీ ప్రభుత్వ హయాంలో స్టాండింగ్ కౌన్సిల్‌గా విధులు
అమరావతి, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): అనంతపురం జిల్లా, రాప్తాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై ఎలక్ట్రిక్ రంపంతో దాడిచేసిన నిందితుడు హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపిన ఉదంతంపై సీబీఐతో సమగ్ర, నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. మంగళగిరికి చెందిన న్యాయవాది గుండా గోపీకృష్ణ సోమవారం ఈ పిల్ వేశారు. ఈ పిల్‌లో అడ్వొకేట్ ఆన్ రికార్డుగా న్యాయవాది సాల్మన్ రాజు ఉన్నారు. సాల్మన్‌రాజు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. సాల్మన్‌రాజు తరఫు న్యాయవాది బి.బాలయ్య స్పందిస్తూ... రాష్ట్ర పోలీసులు నిందితులను కాల్చి చంపుతున్నారని అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, ఈ నేపథ్యంలో రాప్తాడు ఘటనపై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు.
విద్యార్థినిపై దాడి అనంతరం నిందితుడిని పట్టుకొనేందుకు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేశారని చెప్పారు. నిందితుడు ఆత్మకూరు అడవుల్లో తలదాచుకున్నాడని.. అతన్ని పట్టుకొనేందుకు ప్రయత్నించగా తమపై దాడి చేయడంతో ఆత్మరక్షణ కోసం కాళ్లపై ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారని పేర్కొన్నారు. గాయపడిన నిందితుడిని అనంతపురం జిల్లా ఆస్పత్రికి తరలించే సమయంలో పోలీసులు స్ట్రెచ్చర్ వాడకుండా... నేలపై ఈడ్చుకుంటూ వెళ్లారన్నారు. పోలీసుల చర్య నిందితుడి ప్రాథమిక, మానవ హక్కులను కాలరాసేలా ఉందన్నారు. పోలీసులు ఆయుధాలు వినియోగించడానికి దారితీసిన పరిస్థితులపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని అభ్యర్థించారు. సాక్ష్యాధారాలను భద్రపరిచేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. మేజిస్ట్రేట్‌తో హేమంత్ వాంగ్మూలాన్ని నమోదు చేసేలా ఆదేశించాలని కోరారు.
అలాగే సీసీటీవీ ఫుటేజ్, మెడికల్ రికార్డులు, సాక్ష్యాలను భద్రపరిచేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, అనంతపురం జిల్లా కలెక్టర్, అనంతపురం రేంజ్ డీఐజీ, అనంతపురం ఎస్పీ, రాప్తాడు పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌వో, సీబీఐ, అనంతపురం జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ని ప్రతివాదులుగా చేర్చారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న చీఫ్‌జస్టిస్ లిసాగిల్ నేతృత్వంలోని ధర్మాసనం పిల్‌పై మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి