బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయి: కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని
ABN , Publish Date - Jul 25 , 2026 | 07:02 PM
బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాకు శాశ్వత మంచినీటి అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులకు పైలాన్‌ను పెమ్మసాని ఆవిష్కరించారు.
గుంటూరు జిల్లా, జులై 25: బటన్ నొక్కితే ఓట్లు రావు.. పనులు చేస్తేనే వస్తాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లాకు శాశ్వత మంచినీటి అభివృద్ధి లక్ష్యంగా చేపట్టిన అమృత్ 2.0 పథకం పనులకు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు కలిసి పైలాన్‌ను ఆవిష్కరించారు. అమృత్ 2.0 పనులతో 50 ఏళ్లకు నీటి సమస్య ఉండదని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ.. ఎంపీ నిధుల ద్వారా ఏడాదికి రూ.5 కోట్లు వస్తాయని, మరో రాజ్యసభ సభ్యుడు ఉండటంతో అదనంగా మరో రూ.5 కోట్లు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన తర్వాత గుంటూరు జనాభా 8 లక్షలు ఉండగా ప్రస్తుతం 11 లక్షలకు చేరిందని, పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటి అవసరాలు పెరిగాయని చెప్పారు. కృష్ణా నది నుంచి తక్కెళ్లపాడు వరకు రూ.400 కోట్లతో పైప్‌లైన్ల ఆధునికీకరణ చేపట్టి 90 నుంచి 130 ఎంఎల్‌డీ నీటి సరఫరా అందిస్తున్నామని, ఇంకా 35 ఎంఎల్‌డీ నీటి అవసరం ఉందన్నారు.
2019కి ముందు గుంటూరు నీటి సమస్య పరిష్కారానికి రూ.160 కోట్లు మంజూరు చేసిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదని పెమ్మసాని అన్నారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత ఆ నిధుల్లో ఒక్క రూపాయి కూడా వినియోగించలేదని ఆరోపించారు. ఈ అంశంపై వైసీపీ నాయకులతో చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. తక్కెళ్లపాడులో మరో 50 ఎంఎల్‌డీ నీటి కోసం రిజర్వాయర్ నిర్మిస్తున్నామని, రూ.577 కోట్లతో రింగ్ రోడ్డు పైప్‌లైన్ పనులు చేపడుతున్నామని తెలిపారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే విలీన గ్రామాలకు వచ్చే 50 ఏళ్ల వరకు నీటి సమస్య ఉండదని పేర్కొన్నారు. నాయకులు మారినా ప్రజల ఇళ్లలో నీటి సరఫరా ఆగకుండా శాశ్వత పరిష్కారాలు కల్పిస్తున్నామని, బటన్ నొక్కడం ద్వారా కాకుండా ప్రజలకు అవసరమైన రోడ్లు, నీరు వంటి మౌలిక వసతులు కల్పించడం ద్వారానే ప్రజల మద్దతు లభిస్తుందని పెమ్మసాని వ్యాఖ్యానించారు.
Also Read:
వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రియురాలితో మాట్లాడుతున్నాడని సహోద్యోగి హత్య..