Share News

కుర్చీ కోసం ఆరాటం వైసీపీది.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్‌ది: మంత్రి దుర్గేశ్

ABN , Publish Date - Jun 27 , 2026 | 08:32 PM

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలపై సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఘాటుగా స్పందించారు. కుర్చీ కోసం ఆరాటపడేది వైసీపీ అయితే, ప్రజా సేవ కోసం పోరాడేది పవన్ కల్యాణ్‌ అని అన్నారు.

కుర్చీ కోసం ఆరాటం వైసీపీది.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కల్యాణ్‌ది: మంత్రి దుర్గేశ్
Kandula Durgesh

అమరావతి, జూన్ 27: కుర్చీ కోసం ఆరాటం వైసీపీది అయితే.. ప్రజాసేవ కోసం పోరాటం పవన్ కళ్యాణ్‌ది అని అన్నారు ఏపీ పర్యాటక, సినీ ఆటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్. పవన్ కల్యాణ్‌ రాజకీయ ఎదుగుదలను చూసి వైసీపీలోని కాపు నేతలు జీర్ణించుకోలేక వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి నిలిచిన నాయకుడు పవన్ కల్యాణ్‌ అని దుర్గేశ్ పేర్కొన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాల వల్లే నేడు కూటమి ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తోందన్నారు. పవన్ వ్యక్తిత్వాన్ని, ఆయన రాజకీయ విజన్‌ను అర్థం చేసుకునే స్థాయి వైసీపీ నాయకులకు లేదని, అందుకు ఈ జన్మ సరిపోదని వ్యాఖ్యానించారు.


రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ మొదటి నుంచే కక్షపూరిత వైఖరి అవలంబించిందని మంత్రి దుర్గేశ్ ఆరోపించారు. ఇప్పుడు అమరావతిలో జరుగుతున్న వేగవంతమైన అభివృద్ధిని చూసి ఓర్వలేకే రెచ్చగొట్టే యాత్రలు, రాజకీయ ఆరోపణలకు పాల్పడుతోందన్నారు. రాజధాని అంశంలో దేశంలోనే అత్యంత అస్పష్టత, చేతకానితనం ప్రదర్శించిన పార్టీ వైసీపీనే అని విమర్శించారు. కూటమి ప్రభుత్వం రోజురోజుకూ బలపడుతుండటంతో వైసీపీ నాయకుల్లో భయం, వణుకు మొదలైందని, అందుకే ప్రజల్లో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నాయకత్వంలో రాష్ట్రాభివృద్ధి వేగంగా సాగుతోందని, ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన వైసీపీకి వారిని విమర్శించే నైతిక హక్కు లేదని మంత్రి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

వారి నిర్లక్ష్యం వల్లే వెలిగొండ ఆలస్యం.. 2027 నాటికి పనులన్నీ పూర్తి: సీఎం చంద్రబాబు

ఇది ముమ్మాటికీ అమరావతి రైతులపై రౌడీ మూకల దాడే: హోం మంత్రి అనిత

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 27 , 2026 | 09:44 PM