'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'.. పార్టీ నేతలకు పవన్ ప్రశ్న
ABN , Publish Date - Feb 02 , 2026 | 08:37 PM
కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీ, అటు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు, ప్రతిపక్షాల విమర్శలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మంగళగిరి, ఫిబ్రవరి 2: జనసేన పార్టీ జనరల్ బాడీ సమావేశం వేదికగా పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తిరుమల లడ్డూ వ్యవహారం గురించి వైసీపీ చేస్తున్న విమర్శల ధాటిని తిప్పికొట్టడంలో నేతలు విఫలమవుతున్నారని ఆయన అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కీలక సమావేశంలో పవన్ కళ్యాణ్.. పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, పీఏసీ సభ్యుల తీరుపై ఘాటుగా స్పందించారు.
'నేనే అంతా మాట్లాడితే మీరెందుకు?'
మౌనం వీడండి: 'తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై ఇంత జరుగుతున్నా ఒక్కరూ ఎందుకు మాట్లాడటం లేదు? అన్నింటికీ నేనే సమాధానం చెప్పాలా? అలాంటప్పుడు మీరు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా ఎందుకు ఉన్నట్టు?' అని పవన్ ప్రశ్నించారు.
వైసీపీ ట్రాప్‌లో పడొద్దు: వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతారని, అప్రమత్తంగా ఉండి వారి కుతంత్రాలను తిప్పికొట్టాలని సూచించారు.
వ్యక్తిగత ప్రవర్తన: నేతల వ్యక్తిగత వ్యవహారాల వల్ల పార్టీకి నష్టం కలగకూడదని, సిద్ధాంత పరంగా, సబ్జెక్ట్ పరంగా మాత్రమే మాట్లాడాలని స్పష్టం చేశారు.
నాదెండ్ల మనోహర్ వెల్లడించిన నిర్ణయాలు:
సమావేశం అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ భవిష్యత్ కార్యాచరణను వివరించారు:
1. తీర్మానాలు: తిరుమల లడ్డూ అపవిత్రత, కేంద్ర బడ్జెట్ అంశాలపై సుదీర్ఘంగా చర్చించి తీర్మానాలు చేశామని వెల్లడించారు. జగన్ హయాంలో శ్రీవారి సొమ్ము రూ. 233 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.
2. సభ్యత్వ నమోదు: మార్చి 14 (పార్టీ ఆవిర్భావ దినోత్సవం) లోపు పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు.
3. కొత్త కమిటీలు: 32 మందితో క్రమశిక్షణ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు, అలాగే పొలిటికల్ అఫైర్స్ కమిటీని (PAC) పునరుద్ధరిస్తున్నట్లు తెలిపారు.
4. ఆరవ శ్రీధర్ వ్యవహారం: పార్టీ నేత, ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ వివాదంపై చర్చించామని, కమిటీ రిపోర్ట్ ఆధారంగా కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.