రాకూడదంటే ఎలా?
ABN , Publish Date - Jun 04 , 2026 | 04:56 AM
తెలంగాణపై నాకు అపారమైన ప్రేమ ఉంది. అది వంద శాతం భూమి పుత్రుల జాగీరే. దానిని కాదనలేదు. కానీ, నువ్వు రాకూడదు.. అడుగు పెట్టనివ్వమని అంటే ఎలా....
దేశంలో తెలంగాణ భాగమే కదా?
అది భూమిపుత్రుల జాగీరే.. కాదనలేదు
కానీ, అడుగుపెట్టనివ్వం అంటే ఎలా?
తెలంగాణపై అపారమైన ప్రేమ ఉంది
అక్కడ నేల బిడ్డలనే పోటీకి దించుతాం
సభ పెట్టకుండా ఎంత కాలం ఆపుతారు?
ఇది రాజ్యాంగ విరుద్ధం
కాంగ్రెస్‌లో జాతీయ సమగ్రత లోపించింది
ఆంధ్రుల్లో ఏ భావమూ ఉండదు
కుల, ప్రాంత విద్వేషాలు పెంచింది వైసీపీయే
జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు
అమరావతి, తుళ్లూరు, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణపై నాకు అపారమైన ప్రేమ ఉంది. అది వంద శాతం భూమి పుత్రుల జాగీరే. దానిని కాదనలేదు. కానీ, నువ్వు రాకూడదు.. అడుగు పెట్టనివ్వమని అంటే ఎలా? తెలంగాణ భారతదేశంలో అంతర్భాగమే కదా?’’ అని డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తాను ఎంతో అభిమానించిన ప్రజా గాయకుడు గద్దర్ ఎన్నడూ ఈ విధంగా మాట్లాడలేదని అన్నారు. బుధవారం సాయంత్రం తుళ్లూరులో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినం సందర్భంగా తెలంగాణలో సభ పెట్టేందుకు జనసేన ప్రయత్నించడం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని తన నివాసం వద్ద పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడటం తెలిసిందే. దీనిపై ఆయన స్పందిస్తూ.. తెలంగాణ నేతలు తనను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోందని అన్నారు. ‘‘తెలంగాణలో జనసేన తరపున పోటీ చేసేది అక్కడి భూమిపుత్రులే. హైదరాబాద్ ఈజ్ మై హోమ్,. ఏపీ నుంచి వెళ్లి అక్కడ ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయబోరు. కేటీఆర్‌తో సోదర బంధం ఉంది. మేం అనేక సార్లు కలిశాం. నాకు తెలిసి ఆయన తప్పుగా మాట్లాడి ఉండరు. నాకు తిట్టించుకోవడం, వాటిని భరించడం అలవాటుగా మారింది. ఎవరు ఏ వాదన అయినా పెట్టుకోండి. కానీ భారతదేశ సమగ్రతను బలహీనపరిచే ఏ విధానాన్నైనా మేం బలంగా ఎదుర్కొంటాం. అయినా ఎక్కడైనా ఎంత కాలం ఆపుతారు? ఇది రాజ్యాంగ విరుద్ధం.’’ అని పవన్ తెలిపారు. జనసేనాని ఇంకా ఏమన్నారంటే..
అమరజీవి స్ఫూర్తి..
‘‘2014 నుంచి 2024 వరకూ ఆంధ్రాకు వచ్చి ఎంతోమంది తెలంగాణ కాంట్రాక్టర్లు వర్కులు తీసుకున్నారు. తెలంగాణలో ఎంతోమంది ఆంధ్ర కాంట్రాక్టర్లు వర్కులు చేసుకున్నారు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజల మధ్య ద్వేషం దేనికి? మా పార్టీ నాయకులు అడిగితే తెలంగాణకు వెళ్లాను. పుష్కర కాలం తర్వాత అంత ద్వేషం ఉండదనుకున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పనిగట్టుకుని చేసిందని నేననుకోవడం లేదు. ఈ అంశం టీ సీఎం రేవంత్ రెడ్డి దృష్టిలో లేదని అనుకుంటున్నాను.’’
కుల సంస్కృతిని పెంచింది వైసీపీయే
‘‘రాష్ట్రంలో కుల దూషణలు ఎక్కువయ్యాయి. వైసీపీ ఈ సంస్కృతిని పరాకాష్ఠకు తీసుకెళ్లింది. చివరికి జర్నలిస్టుల్లో కూడా కులాల గొడవలు పెరిగిపోయాయి. ఈ ఒరవడి కొనసాగితే పరిపాలన చాలా కష్టంగా మారుతుంది. దళిత వ్యక్తిని హత్య చేసి వైసీపీ ఎమ్మెల్సీ డోర్ డెలివరీ చేస్తే వీళ్లు వెనకేసుకుని వస్తున్నారు. దళిత సంఘాలు కూడా మాట్లాడటం లేదు. డా.సుధాకర్‌ను చంపేస్తే ఒక్కరు కూడా మాట్లాడలేదు. ప్రజలు 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్పినా వైసీపీ అరాచకం ఆగడం లేదు. వ్యక్తి తప్పు చేస్తే ఆ వ్యక్తిని నిందించాలి. కానీ, అతడి కులాన్ని నిందించే పరిస్థితిని వైసీపీ నేతలు తీసుకొచ్చారు. సంఘాలు పెట్టిన నాయకులు బాగుపడుతున్నారో లేదు తెలియదుగానీ, ఆ కులాల ప్రజలు మాత్రం చాలా బాధలు పడుతున్నారు. అభివృద్ధికి నోచుకోకుండా పోతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకునే ‘సేనా గళం’ ఏర్పాటు చేశాం. దేశ సమగ్రతే ముఖ్యం. భాషా ప్రయుక్త రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు. తెలంగాణ ప్రజలతో జనసేన మమేకం అవుతుంది. మనదేశంలో బతకడం మన హక్కు. దాన్ని విస్మరించకూడదు. విద్యార్థులకు, యువతకు ద్వేషం ఏముంటుంది? 12 సంవత్సరాల నుంచి మా వాళ్లు తెలంగాణలో సభ పెట్టమని అడుగుతున్నారు. అందుకే ఆలోచించా. హైదరాబాద్ మై హోం. పలు రాష్ట్రాల్లో పర్యటించినా, ఎవరి అనుమతులూ తీసుకోలేదు. కాంగ్రెస్ తీరే సమస్యాత్మకం. జాతీయభావం ఉన్నవాళ్లయితే రాష్ట్రాల్లో వారి సీఎంల పనితీరును రాహుల్ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీ పరిశీలించాలి. కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్‌లో బలంగా ఉండేది. ఇప్పుడు పూర్తిగా నాశనం అయింది. అది వారికి అర్థం కావడం లేదు. ఆంధ్రా - తెలంగాణ విభజనకు నేను వ్యతిరేకం కాదు.’’
ఆంధ్రుల్లో ఏ భావమూ ఉండదు
‘‘ఆంధ్రుల్లో ఏ భావం ఉందో ఎవరికీ తెలియదు. ఈ విషయంలో తెలంగాణవారిని చూస్తే ముచ్చట వేస్తుంది. వారిలో తెలంగాణ భావన ఉంది. పోరాట స్ఫూర్తి కూడా ఎక్కువే. తమిళులకు తమిళ భావన ఉంది. కానీ, ఆంధ్రా వాళ్లకు ప్రాంతీయ, కుల భావనలే ఎక్కువ. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రాంతాలు, కులాలవారీగా విడిపోయారు. వైసీపీ వాళ్లు అమరావతి లేకుండా చేస్తామన్నారు. మూడు రాజధానులు కావాలన్నారు. ఇప్పుడు అదేదో (మావిగన్) వినడానికి చిరాకుగా ఉండే మాట అంటున్నారు. 33,500 ఎకరాలను రాజధానిలో ఇచ్చిన రైతుల త్యాగం మరువలేనిది. వైసీపీకి మళ్లీ మళ్లీ చెబుతున్నా.. రౌడీయిజం, గుండాయిజం, చేస్తామంటే మహిళలే ఎదురు తిరుగుతారు’’ అని హెచ్చరించారు.
‘‘అమరజీవి ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నారేగానీ, మిగిలిన రాష్ట్రాల వాళ్లు రాకూడదని అనలేదు. దురదృష్టవశాత్తూ ఆయన లాంటి మహానుభావులను కూడా కులచట్రంలో బిగించాలని చూస్తున్నారు. అంబేడ్కర్ కోరుకున్న కుల నిర్మూలనజరుగుతుందో లేదో తెలియదు. కానీ మనం ఒకరి మీద ఒకరం ఆధారపడి బతుకుతున్నాం. సమష్టి సహకారం మనమధ్య ఉండటం అవసరం.’’
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్