2.5 కోట్ల సీడ్‌బాల్స్
ABN , Publish Date - Jun 06 , 2026 | 05:28 AM
వచ్చే వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా సీడ్‌బాల్స్ చల్లడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు. జూన్ 15 నుంచి పది రోజులపాటు ప్రజా ఉద్యమంలా సీడ్‌బాల్స్ తయారు చేస్తామని....
ప్రజా ఉద్యమంలా తయారీ
జూన్ 15 నుంచి 10 రోజులపాటు నిర్వహిస్తాం
వర్షాకాలంలో రాష్ట్రమంతా చల్లుతాం
ధరిత్రి రక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
ప్రతి ఒక్కరూ తల్లి పేరిట మొక్క నాటాలి
నాటిన ప్రతి మొక్క మహావృక్షం కావాలి
డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్
తల్లి అంజనాదేవి పేరిట తెల్లపొణికి మొక్క నాటిన పవన్
విజయవాడ, జూన్ 5(ఆంధ్రజ్యోతి): వచ్చే వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా సీడ్‌బాల్స్ చల్లడానికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్టు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ వెల్లడించారు. జూన్ 15 నుంచి పది రోజులపాటు ప్రజా ఉద్యమంలా సీడ్‌బాల్స్ తయారు చేస్తామని, మొత్తం 2.5 కోట్ల సీడ్‌బాల్స్‌ను తయారు చేస్తున్నామని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని సీతాకోక చిలుకల పార్కులో శుక్రవారం పవన్ కల్యాణ్ మొక్కలు నాటారు. స్వయం సహాయక బృందాలు, విద్యార్థులు, మూలపాడు గ్రామస్తులతో కలిసి ఆయన సీడ్‌బాల్స్ తయారు చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భూమిని, పచ్చదనాన్ని కాపాడుకోవడం అందరి కనీస బాధ్యతని అన్నారు. రాబోయే తరాలకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలంటే ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటి, దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి సీడ్‌బాల్ ఒక మహావృక్షం కావాలన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పులపై రక్షణ కవచంలా పని చేయాలని ఆకాంక్షించారు. పర్యావరణాన్ని కాపాడుకునే హరిత సంకల్పానికి మద్దతుగా ప్రభుత్వం రెండు సరికొత్త, అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.

ఉద్యమంలా సీడ్‌బాల్స్ తయారీ
జూన్ 15 వరకు పది రోజులపాటు అన్ని జిల్లాల్లో సీడ్‌బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఎర్ర బంకమట్టికి, కంపోస్ట్ జోడించి పూర్తి ఆర్గానిక్ విధానంలో తయారు చేసే ఈ సీడ్‌బాల్స్‌ను వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. పర్యావరణ పరిరక్షణలో సీడ్‌బాల్స్ కీలక పాత్ర పోషిస్తాయన్నారు. ప్రతి సీడ్‌బాల్‌కు ఒక చెట్టుని సృష్టించే శక్తి ఉంటుందన్నారు. ప్రతి చెట్టు వాతావరణ మార్పుల ప్రభావం నుంచి భూమిని రక్షిస్తుందన్నారు. గాలి నాణ్యత పెరిగి కాలుష్యం తగ్గుతుందన్నారు. భూగర్భ జలాలు పెరగడానికి, నీటిని నిల్వ చేయడానికి దోహదపడతాయన్నారు. సీడ్‌బాల్స్‌ను అడవులు, కొండ ప్రాంతాల్లో మొక్కలు తక్కువగా ఉన్న ప్రదేశాలు, నదీ తీరాలు, చెరువు గట్లు, ఖాళీ ప్రదేశాల్లో వెదజల్లే ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొండలు, మనుషులు వెళ్లలేని ప్రాంతాల్లో సీడ్‌బాల్స్ చల్లేందుకు డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామన్నారు. సీడ్‌బాల్స్ తయారీని ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రజాప్రతినిధులు, పొదుపు సంఘాల మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, పర్యావరణ వలంటీర్లతోపాటు రాష్ట్ర ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అంజనాదేవి పేరుతో తెల్లపొణికి మొక్క
ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ నినాదంతో పవన్ కల్యాణ్ తల్లి అంజనాదేవి పేరున సీతాకోక చిలుకల పార్కులో తెల్లపొణికి మొక్కను నాటారు. ప్రతి ఒక్కరూ తల్లి పేరున ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు. మనిషికి తల్లి జీవం పోస్తే ఆ జీవాన్ని చెట్టు కాపాడుతుందన్నారు. కొండపల్లి బొమ్మల తయారీ కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపొణికి మొక్కలను ఒకేచోట నాటడం ఆనందం కలిగించిందన్నారు. ప్రస్తుతం ఎక్కడికక్కడ చెట్లను నరికేస్తూ, పచ్చదనాన్ని నాశనం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా చెట్లను పెంచడంపై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిలో మార్పు రావాలని అన్నారు. కొండపల్లి బొమ్మల తయారీలో వినియోగించే తెల్లపొణికి, ఏటికొప్పాక బొమ్మల తయారీలో వాడే అంకుడు, బొబ్బిలి వీణల తయారు చేసే పనస, శెట్టిగుంట, మాధవమాల, ఉదయగిరి కళాకారులకు అవసరమైన కలప నిధులను(ఉడ్ బ్యాంక్స్) ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాం. వచ్చే రెండు నెలల్లో ప్రాంతాల వారీగా వాటిని ఏర్పాటు చేసి, సంప్రదాయ కళను ముందుకు తీసుకువెళ్తున్న కళాకారుల జీవనోపాధిని కాపాడతామని చెప్పారు. వనజీవి రామయ్యను ఆదర్శంగా తీసుకుని అడవులను, పచ్చదనాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. కోట్ల మొక్కలు నాటిన ఆయన మాదిరిగా మనం పర్యావరణ పరిరక్షణను ఒక బాధ్యతగా చేపట్టాలన్నారు. మొక్కలు నాటడమే కాకుండా, వాటిని చెట్లుగా మారే వరకు సంరక్షించాలని పవన్ కల్యాణ్ సూచించారు.