Share News

జిందాల్ ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు!

ABN , Publish Date - May 30 , 2026 | 06:19 PM

పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు..

జిందాల్ ‘వేస్ట్ టూ ఎనర్జీ’ ప్లాంట్‌ను సందర్శించిన పవన్ కల్యాణ్.. అధికారులకు కీలక ఆదేశాలు!
Pawan Kalyan News

అమరావతి, మే 30: పల్నాడు జిల్లా కొండవీడు పరిధిలోని జిందాల్ 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్‌ను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సందర్శించారు. ఈ సందర్భంగా ప్లాంట్‌లో చెత్తను సేకరించడం దగ్గర నుంచి బాయిలర్‌లో అది బూడిదగా మారే వరకూ.. ప్రక్రియను ఆసక్తిగా పరిశీలించారు. చెత్త నుంచి విద్యుత్ తయారీ విధానంపై ప్లాంట్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ పర్యటనలో భాగంగా అధికారులు, ప్లాంట్ నిర్వాహకులకు ఉప ముఖ్యమంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. జిందాల్ పరిశ్రమ తరహాలోనే గోదావరి నదీ కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ సాంకేతికతను ఎలా అనుసంధానం చేయవచ్చో పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో చెత్తను వేరు చేసి, దాన్ని విద్యుత్ తయారీకి ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు.


రాష్ట్రంలో రోజూ ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా మరిన్ని 'వేస్ట్ టూ ఎనర్జీ' ప్లాంట్ల ఏర్పాటుకు గల అవకాశాలను పరిశీలించాలని సూచించారు. ఇందుకోసం దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా పేరొందిన 'ఇండోర్ మోడల్' తరహాలో చెత్తను పద్ధతిగా, పారదర్శకంగా వేరు చేసేలా కొత్త మార్గదర్శకాలను రూపొందించాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. మరోవైపు.. ప్లాంట్ అధికారులు ఉప ముఖ్యమంత్రికి అంతర్జాతీయ, జాతీయ స్థాయి గణాంకాలను వివరించారు. సింగపూర్‌లో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 2.8 శాతం కేవలం ఇలాంటి చెత్త ప్లాంట్ల నుంచే లభిస్తోందని పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ గ్రిడ్‌తో ఈ వ్యర్థ ఆధారిత విద్యుత్ ప్లాంట్ల అనుసంధానం చాలా అద్భుతంగా ఉందని అధికారులు ప్రశంసించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ సరఫరా వృథా శాతం అత్యంత తక్కువగా ఉండటం విశేషమని డిప్యూటీ సీఎంకు ఈ సందర్భంగా ప్లాంట్ అధికారులు తెలియజేశారు.

Updated Date - May 30 , 2026 | 06:43 PM