Share News

అరాచకాలను చూస్తూ ఊరుకోం

ABN , Publish Date - Oct 28 , 2026 | 04:46 AM

వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని, వైసీపీ 2.0 చూపిస్తే ఎన్డీఏ దానికి 10 ఎక్స్‌ చూపిస్తుందని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వాళ్లు 1.0 చూపించినప్పుడే తాము ధైర్యంగా నిలబడ్డామని..

అరాచకాలను చూస్తూ ఊరుకోం

వైసీపీ 2.0 చూపిస్తే.. మేం 10ఎక్స్‌ చూపిస్తాం

బలహీనుడే బెదిరిస్తాడు.. బలవంతుడు భయపెట్టడు

వాళ్ల హింసాకాండ నుంచి ప్రజలకు ఎలా అండగా ఉండాలో మాకు తెలుసు

సీట్లపై కూటమిలో ఏకాభిప్రాయం

చంద్రబాబు సుదీర్ఘ అనుభవంతో మంచి కసరత్తు చేశారు

సీట్లు దక్కని వాళ్లకు న్యాయం చేస్తాం

జనసేనాని పవన్‌ స్పష్టీకరణ

అమరావతి, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): వైసీపీ అరాచకాలను చూస్తూ ఊరుకోబోమని, వైసీపీ 2.0 చూపిస్తే ఎన్డీఏ దానికి 10 ఎక్స్‌ చూపిస్తుందని జనసేన అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. వైసీపీ వాళ్లు 1.0 చూపించినప్పుడే తాము ధైర్యంగా నిలబడ్డామని.. వాళ్ల హింసాకాండ నుంచి ప్రజలకు ఎలా అండగా నిలబడాలో తమకు తెలుసని చెప్పారు. బలహీనుడే బెదిరిస్తాడు.. బలవంతుడు భయపెట్టడని వ్యాఖ్యానించారు. సీఎం నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినట్లు వైసీపీ ప్రధాన స్రవంతి రాజకీయాల్లోకి రావాలని కోరారు. ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో ఐక్యంగా కూటమి పార్టీలు ముందుకెళ్తున్నాయి.

అన్ని పార్టీల నుంచీ పెద్దఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఆ దిశగానే క్షేత్ర స్థాయిలోనూ అందరూ పనిచేయాలి. సీఎం చంద్రబాబు తనకున్న సుదీర్ఘ అనుభవంతో సీట్ల సర్దుబాటుపై చాలా మంచి కసరత్తు చేశారు. స్థానిక ఎన్నికల్లో సీట్లు దక్కించుకోలేని వాళ్లకు న్యాయం చేసే బాధ్యత మేం తీసుకుంటాం. చేసుకున్న సర్దుబాటు ప్రకారం కూటమి పార్టీలు ప్రకటించిన అభ్యర్థులనే ఎన్నుకోండి. సార్వత్రిక ఎన్నికల్లో ఏ విధంగా కూటమిని ఆశీర్వదించారో.. స్థానిక ఎన్నికల్లోనూ కూటమి అభ్యర్థులను గెలిపించాలి’ అని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కూటమి ఎన్నికలకు ముందు ఏం చెప్పిందో.. అదే చేస్తోందని తెలిపారు. ‘కూటమి ప్రభుత్వంపై నమ్మకంతోనే రాష్ర్టానికి పెట్టుబడులు వస్తున్నాయి.


దేశంలోకి వచ్చిన విదేశీ పెట్టుబడుల్లో 25 శాతం మనకు వచ్చాయి. చంద్రబాబు సమర్థ నాయకత్వంపై పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం వచ్చింది. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. రూ.1.50 కోట్ల వ్యయంతో గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్థి పనులు చేస్తున్నాం. పల్లె పండుగ 1.0, 2.0 ద్వారా రహదారులు, పశువుల నీటి తొట్ల లాంటి మౌలిక సదుపాయాలు పూర్తిచేశాం. అడవితల్లి బాట ద్వారా గిరిజన ప్రాంతాల్లో ఆవాసాలకు రహదారులు వేశాం. భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణం అందించేలా చర్యలు చేపట్టాం. జల్‌జీవన్‌ మిషన్‌ కింద రూ.30 వేల కోట్లతో 3.20 కోట్ల మంది గ్రామీణ ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించేలా కార్యక్రమాలు చేస్తున్నాం. గత పాలకులు ఉద్యోగులను వేధించారు. మేం సీఎం నాయకత్వంలో రూ.30 వేల కోట్ల చెల్లింపులు చేశాం. గంజాయిపై ఉక్కుపాదం మోపాం. గ్రామస్వరాజ్యం దిశగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది’ అని ఉపముఖ్యమంత్రి వివరించారు.

క్షేత్ర స్థాయి ఒత్తిళ్లు వాస్తవమే..: ‘మా పార్టీది సుదీర్ఘ ప్రయాణమని జనసేన పెట్టినప్పుడే చెప్పాను. ఏ పార్టీ అయినా క్షేత్రస్థాయి నుంచి బలోపేతం కావడానికి చాలా సమయం పడుతుంది. సీట్ల సర్దుబాటు విషయంలో కూటమిలోని మూడు పార్టీలకు క్షేత్ర స్థాయిలో ఒత్తిళ్లు ఉన్న మాట వాస్తవం. దశాబ్దం క్రితం పుట్టిన జనసేన బలపడాలంటే ఇంకా చాలా దూరం ప్రయాణించాలి’ అని పవన్‌ అన్నారు.

రాష్ట్రం కోసం కూటమిగా ఉండాలనే నిర్ణయానికి కట్టుబడి సీట్ల సర్దుబాటు చేసుకున్నామని.. మూడు పార్టీలు నిబద్ధతతో ఐక్యతా స్ఫూర్తిని చాటుతున్నాయన్నారు. 2024 ఎన్నికల్లో సవాళ్లు ఒక విధంగా ఉన్నాయని, స్థానిక ఎన్నికల్లో సవాళ్లు వేరే విధంగా ఉన్నాయని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొన్ని స్థానాలకే ఉంటుందని, ఇప్పుడు సర్దుబాటు ఎక్కువ స్థానాలకు చేసుకోవలసి వచ్చిందని, క్లిష్టమైనా సరే.. రాష్ర్టాభివృద్థి కోసం కూటమిగానే ఉంటామని చెప్పారు.


బాబు పనితీరు స్ఫూర్తిదాయకం

స్థానిక ఎన్నికల సమయంలోనే ఆర్నబ్‌ తుఫాన్‌ రూపంలో ప్రకృతి విపత్తు కూడా వచ్చిందని పవన్‌ కల్యాణ్‌ అన్నారు. ‘సంక్షోభాన్ని సవాల్‌గా స్వీకరిస్తూ.. సీఎం చంద్రబాబు ఎన్నికల పనుల్లో బిజీగా ఉండి కూడా తుఫాన్‌ సన్నద్ధతపై సమీక్షలు నిర్వహిస్తున్నారు. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఆస్తి, ప్రాణ నష్టం కలుగకుండా పటిష్ఠంగా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఆయన పనితీరు స్ఫూర్తిదాయకం’ అని డిప్యూటీ సీఎం ప్రశంసించారు.

సర్దుబాటుపై సీఎం సాగరమథనం: మాధవ్‌

‘స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు విషయంలో సీఎం చంద్రబాబు సాగర మథనమంత కసరత్తు చేశారు. చాలామంది కూటమి బీటలు వారుతుందని.. కూలిపోతుందని ఎదురుచూశారు. అలాంటివారి ఆశలపై నీళ్లు జల్లుతూ కూటమి విజయవంతంగా ముందుకు సాగుతోంది’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌ చెప్పారు. ‘ఎన్నికల్లో ఏం చెప్పా మో.. అది చేశాం.. ఇంకా చేస్తున్నాం. కూటమితోనే సంక్షేమం, అభివృద్థి, సుపరిపాలన. ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలి’ అని కోరారు.

సార్వత్రిక ఎన్నికలతో పోల్చుకుంటే స్థానిక ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు కొంచెం క్లిష్టతరంగా ఉంటుంది. చాలా మంది పోటీలో ఉన్నా.. రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని.. కూటమి స్ఫూర్తిని చాటేలా సర్దుబాటు చేసుకున్నాం.

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

ఈ వార్తలనూ చదవండి:

తీరం దాటుతున్న ఆర్నబ్ తుఫాన్..!

ఆర్నబ్ తుఫాన్ వేళ.. రాష్ట్ర ప్రజలకు సీఎం చంద్రబాబు కీలక సూచనలు

Updated Date - Oct 28 , 2026 | 04:46 AM