మంత్రి గుమ్మిడి సమక్షంలో కలెక్టర్, ఎమ్మెల్యే వాగ్వాదం
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:28 AM
మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలోనే ఎమ్మెల్యే, కలెక్టర్ వాగ్వాదానికి దిగారు. వారిద్దరి మధ్యా మాటల యుద్ధం అంతకంతకూ పెద్దది అవుతుండడంతో మంత్రి జోక్యం చేసుకున్నారు. ‘ఇరువురూ నా ముందే ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ హెచ్చరించారు. ఏదైనా ఉంటే గదిలో కూర్చొని మాట్లాడుకోవాలంటూ సూచించారు.
పర్సంటేజీల గురించి మాట్లాడిన వ్యక్తికే పనులా?: ఎమ్మెల్యే
వ్యక్తిగత ఆరోపణలు చేయకండి: కలెక్టర్
పార్వతీపురం, సెప్టెంబరు 16(ఆంధ్రజ్యోతి): మంత్రి గుమ్మిడి సంధ్యారాణి సమక్షంలోనే ఎమ్మెల్యే, కలెక్టర్ వాగ్వాదానికి దిగారు. వారిద్దరి మధ్యా మాటల యుద్ధం అంతకంతకూ పెద్దది అవుతుండడంతో మంత్రి జోక్యం చేసుకున్నారు. ‘ఇరువురూ నా ముందే ఇలా వ్యవహరించడం సరికాదు’ అంటూ హెచ్చరించారు. ఏదైనా ఉంటే గదిలో కూర్చొని మాట్లాడుకోవాలంటూ సూచించారు. ఈ మొత్తం ఘటనకు పార్వతీపురం కలెక్టర్ కార్యాలయం వేదికయింది. మంత్రి ఆధ్వర్యంలో అభివృద్ధి పనులపై బుధవారం సమీక్ష జరిగింది. పార్వతీపురం నియోజకవర్గం బలిజపేట మండలం పెదపెంకి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఈ సందర్భంగా చర్చించారు. ఎమ్మెల్యే విజయచంద్ర మాట్లాడుతూ, ‘రోడ్డు వెడల్పు పనులతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జిల్లా అధికారికి పర్సెంటేజీల విషయమై ఓ వ్యక్తి మాట్లాడిన అంశాలు సోషల్ మీడియాలో హల్‌చల్ అయ్యాయి. ఆ వ్యక్తికే ఆ గ్రామంలో అభివృద్ధి పనులు దక్కాయి.
ఇలా ఎలా అప్పగిస్తారు?’ అని ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ... ‘వ్యక్తిగత ఆరోపణలు చేయవద్దు. రోడ్డు వెడల్పునకు సంబంధించి నోటీసులు ఇచ్చిన తర్వాతే ఆక్రమణలను తొలగించారు. చట్టబద్ధంగా మాట్లాడాలి’ అని సూచించారు. ‘నేను చట్టబద్ధంగానే మాట్లాడుతున్నా’ అంటూ ఎమ్మెల్యే స్వరం పెంచారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం సాగింది. జిల్లా అధికార యంత్రాంగం, మంత్రి సంధ్యారాణి సమక్షంలో ఈ మాటల యుద్ధంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. మంత్రి జోక్యం చేసుకొని కార్యాలయంలో కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ, ప్రభుత్వ విప్ జగదీశ్వరితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
ఈ వార్తలనూ చదవండి:
గంటల వ్యవధిలోనే రోడ్లు మంజూరు చేసిన డిప్యూటీ సీఎం పవన్
ఎక్కువ ధరకు గణేశ్ లడ్డూ వేలం పాడడంపై వివాదం.. వ్యక్తి ఆత్మహత్య