Share News

పంచదార్ల కొండపైతవ్వకాలు బంద్‌!

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:42 AM

అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై ఉన్న ఆలయాల సంరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొండప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఇచ్చిన గ్రావెల్‌ మైనింగ్‌ లీజులు పనిచేయవని సర్కారు స్పష్టం చేసింది.

పంచదార్ల కొండపైతవ్వకాలు బంద్‌!

  • నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం

  • ఆలయాల పరిరక్షణకు నిర్ణయం

  • ఇప్పటికే ఇచ్చిన గ్రావెల్‌ లీజులు పనిచేయవు

  • భవిష్యత్‌లోనూ అనుమతులివ్వరు

  • ఉత్తర్వులు జారీచేసిన గనుల శాఖ

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాలకు స్పందన

  • అటు అక్రమ మైనింగ్‌పైనా చర్యలు

  • అనకాపల్లి ఏడీపై సస్పెన్షన్‌ వేటు

  • నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించిన ప్రభుత్వం

అమరావతి, ఆగస్టు 27 (ఆంధ్రజ్యోతి): అనకాపల్లి జిల్లా పంచదార్ల కొండపై ఉన్న ఆలయాల సంరక్షణకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ కొండప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఇచ్చిన గ్రావెల్‌ మైనింగ్‌ లీజులు పనిచేయవని సర్కారు స్పష్టం చేసింది. ఇకపై భవిష్యత్తులోనూ అక్కడ ఎలాంటి మైనింగ్‌ అనుమతులు ఇవ్వరు. ఇంకోవైపు.. అక్కడ జరిగిన అక్రమ మైనింగ్‌పైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే గనుల శాఖ అధికారిని సస్పెండ్‌ చేసింది. తాజాగా అక్రమ తవ్వకాలు జరిపిన లీజుదారు నుంచి పెనాల్టీ వసూలుకు డిమాండ్‌ నోటీసులు జారీ చేసింది. అక్రమ తవ్వకాల ఉదంతంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన వార్తలపై స్పందించిన ప్రభుత్వం.. ఆలయాల పరిరక్షణకు పంచదార్ల కొండ మొత్తాన్నీ నో మైనింగ్‌జోన్‌గా ప్రకటించడం గమనార్హం.


అక్రమ తవ్వకాలను పట్టించుకోని అధికారులు..

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం పంచ దార్ల గ్రామంలోని కొండపై శ్రీ ఉమా ధర్మలింగేశ్వర ఆలయం, రాధా మాధవస్వామి, విశ్వేశ్వరస్వామి, సహస్ర లింగేశ్వరస్వామి ఆలయాలు చాలా ఉన్నాయి. రాధామాధవస్వామి ఆలయ గర్భంలో ఐదు ధారలు ప్రవహిస్తుంటాయి. అందుకే ఈ ప్రాంతానికి పంచధారలని.. పంచదార్ల కొండ అని పేరు వచ్చిందని చెబుతుంటారు. ఈ ఏడాది మే నెలలో ఈ కొండ ప్రాంతంలోని సర్వే నంబర్‌ 1లో 2.153 హెక్టార్ల పరిధిలో గ్రావెల్‌ మైనింగ్‌ లీజును విజయ్‌కుమార్‌నాయుడు అనే వ్యక్తికి గనుల శాఖ ఇచ్చింది. అయితే లీజుదారు హద్దులు దాటి.. నిబంధనలకు విరుద్ధంగా ఆలయాలకు సమీపంగా మైనింగ్‌ చేసుకుంటూ వెళ్తుండడంతో గర్భగుడులకు ప్రమాదం పొంచి ఉందని భక్తులు, గ్రామస్థులు ఆందోళనలకు దిగారు.ఇటు దేవదాయ శాఖకు, అటు రెవెన్యూ, అటవీ, పర్యావరణ శాఖలకు కూడా ఫిర్యాదు చేశారు. అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేలా చర్యలు తీసుకోవాలని అనకాపల్లి గనుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌(ఏడీ)కి సైతం ఫిర్యాదులు అందాయి. అయితే గనుల శాఖ అధికారులు పెద్దగా స్పందించలేదు. ఇందుకు కారణం రాజకీయ ఒత్తిళ్లే. మైనింగ్‌ చేసేది ఓ ప్రముఖ ప్రజాప్రతినిధికి కావలసిన వ్యక్తి అని.. అక్కడ ఏం జరిగినా కన్నెత్తి చూడవద్దని, ఫిర్యాదులను లెక్కచేయొద్దని మౌఖిక ఆదేశాలు ఉండడం వల్లే వారు మౌనం వహించారని విమర్శలు వెల్లువెత్తాయి.


ఈ పరిణామాలపై ‘ఆంధ్రజ్యోతి’ అనేక వార్తలు ప్రచురించింది. అక్రమ మైనింగ్‌ గురించి తెలిసి కూడా గనులు, రెవెన్యూ, రవాణా అధికారులు మౌనంగా ఉంటున్నారని, వారిపై చర్యలు తీసుకోకుండా కలెక్టర్‌, జేసీ కూడా కాలయాపన చేస్తున్నారని తెలిపింది. దీంతో అమరావతి స్థాయిలో ప్రభుత్వం స్పందించి పంచదార్లకొండలో ఏం జరుగుతోందంటూ ఆరాతీసింది. ఆ తర్వాతే చర్యలు ఒక్కటొక్కటిగా మొదలయ్యాయి. అక్ర మ మైనింగ్‌ ఫిర్యాదులపై తొలుత విచారణ జరిగింది. నేరుగా జిల్లా ఏడీ శ్రీనివాస్‌ నేతృత్వంలో జాయింట్‌ సర్వే చేయించారు. లీజు ఏరియాను దాటి వాయవ్య దిశగా ప్రభుత్వ భూముల పరిధిలో 1.39 లక్షల టన్నుల మేర గ్రావెల్‌ తవ్వినట్లు నిర్ధారించారు. ఇది పూర్తిగా నిబంధనలకు విరుద్ధమని గనుల శాఖ తేల్చింది. డిస్పాచ్‌ పర్మిట్లు 1.04 లక్షల మెట్రిక్‌ టన్నుల వరకే లీజుదారుకు ఇచ్చారు. ఆయన పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలకు పాల్పడ్డారని గనుల శాఖ గుర్తించింది. ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చినా, ప్రజాప్రతినిధులు సమాచారం ఇచ్చినా స్పందించని గనుల శాఖ ఏడీ శ్రీనివా్‌సను సస్పెండ్‌ చేసింది. తర్వాత మైనింగ్‌ లీజుదారుకు కూడా నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా తవ్వి తీసుకెళ్లిన గ్రావెల్‌కు పెనాల్టీ చెల్లించాలని స్పష్టంచేశారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పంచదార్లకొండను నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటించాలని గనుల శాఖ డైరెక్టర్‌ డబ్ల్యూబీసీ చంద్రశేఖర్‌ ఈనెల 17న ప్రభుత్వానికి ప్రతిపాదన పంపారు. నిజానికి పంచదార్లకొండ ప్రాంతంలో 2.153 హెక్టార్ల పరిధిలో గ్రావైల్‌ మైనింగ్‌ లీజు అనుమతులు పదేళ్లకు సరిపడా ఇచ్చారు. అయితే అక్రమ మైనింగ్‌ నిర్ధారణ అయిన నేపథ్యంలో అనుమతులు నిలిపివేసి.. కొండ ప్రాంతంలో మైనింగ్‌పై మొత్తంగా నిషేధం విధించాలని డైరెక్టర్‌ ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనకు సర్కారు తాజాగా ఆమోదం తెలిపింది. పంచదార్లకొండపై మైనింగ్‌ను నిషేధిస్తూ, ఆ ప్రాంతాన్ని నో మైనింగ్‌ జోన్‌గా ప్రకటిస్తూ గనుల శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేశ్‌కుమార్‌ మీనా గురువారం జీవో 226 జారీ చేశారు. త్వరలో ఈ వ్యవహారంలో రెవెన్యూ అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోనున్నారు.

Updated Date - Aug 28 , 2026 | 04:42 AM