ఓటు కోసం ‘బిర్యానీ’ ప్యాకేజీ
ABN , Publish Date - Nov 24 , 2026 | 06:13 AM
స్థానిక ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తూ, నానాపాట్లు పడుతున్నారు.
పాలకొల్లులో 300 కుటుంబాలకు కేజీ చొప్పున చికెన్ పంచిన ఓ అభ్యర్థి!
నూనె, బియ్యం, మసాలాలతో ఫుల్ కిట్
పాలకొల్లు, నవంబరు 23(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తూ, నానాపాట్లు పడుతున్నారు. ఓట్లను రాబట్టుకునేందుకు ఆసక్తికర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలోని ఆరో వార్డులో ఆదివారం ‘బిర్యానీ ఘుమఘుమలు’ పెద్దఎత్తున వచ్చాయి. ఆ వార్డులో పోటీచేస్తున్న అభ్యర్థి ఒకరు ఏకంగా 300 కుటుంబాలకు కేజీ చికెన్, అరకేజీ నూనె, అరకేజి పలావ్ బియ్యం, బిర్యానీ మసాలాతో ఫుల్ కిట్‌ను పంచారట! దీంతో అందరూ ఇంట్లో ఉండే అవసరమైన మిగతా వస్తువులతో బిర్యానీ వండుకొని.. ఆ పూటకు ఆ అభ్యర్థి పేరు చెప్పుకొని బిర్యానీ లొట్టలు వేసుకుంటూ లాగించేశారట!! ఈ ఆదివారం జేబులో చెయ్యి పెట్టాల్సిన అవసరం లేకుండానే బిర్యానీ వండుకునే అవకాశం రావడంతో సంబరపడిపోయారు.
ఆ అభ్యర్థి చేసిన పనితో మిగతా అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నట్లు తెలిసింది. ‘అతను కేజీ చికెన్ ఇచ్చాడు. మనం రెండు కేజీల చికెన్ ఇవ్వాలా? లేకపోతే కోడితో పాటు మటన్ కూడా కలపాలా?’ అని లెక్కలు వేసుకుంటూ మీటింగ్‌లు పెట్టుకుంటున్నట్లు చెబుతున్నారు. ‘నేను రోడ్డు బాగుచేస్తా అన్నాను. జనం నవ్వారు. అతను బిర్యానీ పెడతా అన్నాడు.. జనం చప్పట్లు కొట్టారు. కాలం మారిపోయింది’ అంటూ ఓ అభ్యర్థి బాధపడిపోవడం విశేషం.
ఈ వార్తలనూ చదవండి: