రెండో విడత ‘పంచాయతీ’కి నామినేషన్ల జోరు
ABN , Publish Date - Nov 22 , 2026 | 02:19 AM
రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు.
4,975 సర్పంచ్ స్థానాలకు 30,598 దాఖలు
47,048 వార్డులకు 1,13,719 నామినేషన్లు
చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు
అమరావతి, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. చివరి రోజు శుక్రవారం అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు. మూడు రోజుల పాటు సాగిన నామినేషన్ల ప్రక్రియలో సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు కలిపి మొత్తం 1,44,317 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన నోటిఫికేషన్ మేరకు రెండో విడతలో 28 జిల్లాల్లోని 246 మండలాల పరిధిలో 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవులకు మొత్తం 30,598 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి రెండు రోజులతో పోలిస్తే చివరి రోజు నామినేషన్ల జోరు మరింత పెరిగింది.
తొలిరోజు 3505 నామినేషన్లు, రెండో రోజు 11,411 వచ్చాయి. చివరి రోజున ఏకంగా 15,682 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకూ భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. రెండో విడతలో ఎన్నికలు జరిగే 47,048 వార్డులకు మొత్తం 1,13,719 నామినేషన్లు వచ్చాయి. తొలిరోజు 7328, రెండో రోజు 41,903, చివరి రోజు 64,488 నామినేషన్లు దాఖలయ్యాయి. జిల్లాల వారీగా సర్పంచ్ నామినేషన్లలో తిరుపతి జిల్లా(2996) మొదటి స్థానంలో నిలిచింది. శ్రీకాకుళం(2059), నెల్లూరు(2026) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
పోలవరం జిల్లాలో అత్యల్పంగా 498 నామినేషన్లు నమోదయ్యాయి. వార్డు సభ్యుల నామినేషన్లలో శ్రీకాకుళం జిల్లా(8953) అగ్రస్థానంలో నిలిచింది. తిరుపతి(8863), విజయనగరం(6923), నెల్లూరు (6648) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పోలవరం జిల్లాలో 2002 నామినేషన్లు దాఖలయ్యాయి. కాగా రెండో విడతలో విశాఖపట్నం జిల్లాలో ఎన్నికలు జరిగే గ్రామ పంచాయతీలు లేవు.
ఈ వార్తలనూ చదవండి:
బెంగళూరుకు షర్మిల.. అడ్డుకునేందుకు జగన్ భారీ స్కెచ్..?
కేబీసీ సీజన్ 18 మొదటి కోటీశ్వరుడిగా యూపీఎస్సీ అభ్యర్థి