హాస్టల్ బాలికలు.. రిటైర్డ్ ఉద్యోగి ఇంటికి..!
ABN , Publish Date - Oct 01 , 2026 | 05:28 AM
(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో చదువుతున్న బాలికపై రిటైర్డ్ డీఆర్‌డీఏ ఉద్యోగి తన ఇంట్లో దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అర్ధరాత్రి హాస్టల్ వంటమనిషి తీసుకొచ్చి అప్పగింత
అతని చేష్టలకు భయపడి ఇంటికి ఓ బాలిక ఫోన్
ఒంగోలులో దారుణం.. కేసు నమోదు
ఒంగోలుక్రైం, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): ఒంగోలులో దారుణ ఘటన చోటుచేసుకుంది. హాస్టల్‌లో చదువుతున్న బాలికపై రిటైర్డ్ డీఆర్‌డీఏ ఉద్యోగి తన ఇంట్లో దారుణానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. మంగళవారం అర్ధరాత్రి ఒంగోలు గోపాల్‌నగర్‌లో రిటైర్డ్ ఉద్యోగి బట్టు వెంకటరావు ఇంట్లో ఇరువురు బాలికలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారిలో పదో తరగతి చదువుతున్న బాలిక పట్ల నిందితుడు అసభ్యంగా ప్రవర్తిస్తుండగా మరో బాలిక భయపడి అతడి ఫోన్ ద్వారానే తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ దారుణం బట్టబయలైంది. మంగళవారం రాత్రి బాలికల బంధువులు, పోలీసులు వెంకట్రావు ఇంటికి చేరుకుని బాధిత బాలికలను బయటకు తీసుకొచ్చారు. జరుగుమల్లి బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తున్న యువతి మంగళవారం ఇద్దరు బాలికలను టంగుటూరు వరకు తీసుకొచ్చి వెంకట్రావు ఫోన్ నంబరు ఇచ్చి పంపించినట్లు బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు.
ఒక బాలిక తండ్రి ఇటీవల మృతిచెందాడు. అతడికి సంబంధించి డెత్ సర్టిఫికెట్ ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి వారిని వెంకట్రావు వద్దకు వంటమనిషి పంపించినట్లు చెబుతున్నారు. వెంకట్రావుతోపాటు ఆ వంటమనిషిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నామని ఎస్పీ వి.హర్షవర్ధన్‌రాజు తెలిపారు. కాగా, జరుగుమల్లి హాస్టల్ వార్డెన్, వంటమనిషితోపాటు కామాంధుడు వెంకట్రావును అరెస్టు చేయాలని దళిత సంఘాల నేతలు బుధవారం ఒంగోలు టూటౌన్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అదే విధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’