Share News

బ్లోఅవుట్‌ కలకలం!

ABN , Publish Date - Nov 18 , 2026 | 04:15 AM

భారీ గ్యాస్‌ బ్లోఅవుట్‌తో కోనసీమ మరోసారి ఉలిక్కిపడింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఓఎన్జీసీ సంస్థకు చెందిన తాటిపాక-7 వర్క్‌ ఓవర్‌ రిగ్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో...

బ్లోఅవుట్‌ కలకలం!

  • తాటిపాక-7 రిగ్‌లో భారీగా గ్యాస్‌ లీక్‌

  • ప్రాణభయంతో పరుగులు తీసిన రిగ్‌ సిబ్బంది, సమీప ప్రాంతాల ప్రజలు

  • ఓఎన్జీసీ బృందాల నియంత్రణ చర్యలతో 10 గంటల్లోనే పరిస్థితి అదుపులోకి

  • ఊపిరి పీల్చుకున్న ప్రజలు.. తిరిగి ఇళ్లకు చేరిక

  • హైవేపై ట్రాఫిక్‌ మళ్లింపు, విద్యుత్తు సరఫరా నిలిపివేత సహా పలు ముందు జాగ్రత్తలు

  • మంటలు రేగుతాయనే భయంతో అగ్గిపుల్ల కూడా వెలిగించకుండా జాగ్రత్తపడ్డ స్థానికులు

అమలాపురం/మామిడికుదురు, నవంబరు 17(ఆంధ్రజ్యోతి): భారీ గ్యాస్‌ బ్లోఅవుట్‌తో కోనసీమ మరోసారి ఉలిక్కిపడింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో ఓఎన్జీసీ సంస్థకు చెందిన తాటిపాక-7 వర్క్‌ ఓవర్‌ రిగ్‌లో మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో గ్యాస్‌ లీకేజీ సంభవించింది. భారీ శబ్దంతో తీవ్రమైన ఒత్తిడితో గ్యాస్‌ ఆకాశంలోకి ఎగజిమ్మడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. రిగ్‌ సిబ్బందితో పాటు సమీప ప్రాంతాల్లోని ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీశారు. ఇదే గ్రామంలో 2014 జూన్‌ 27న 22 మందిని బలితీసుకున్న గ్యాస్‌ పైప్‌లైన్‌ విస్ఫోటనం ఘటనను గుర్తుచేసుకొని వణికిపోయారు.

ఆ వెంటనే అప్రమత్తమై గ్యాస్‌ ఆకాశంలోకి ఎగజిమ్ముతున్న పరిస్థితులను గ్రహించి, మంటలు వ్యాపిస్తాయనే ఆందోళనతో ఎక్కడా అగ్గిపుల్ల కూడా వెలిగించకుండా జాగ్రత్త పడ్డారు. సమీపంలోని నగరం, మామిడికుదురు హైస్కూళ్లకు చేరుకుని తలదాచుకున్నారు. సమాచారం అందుకున్న నర్సాపురం, రాజమహేంద్రవరానికి చెందిన ఓఎన్జీసీ నిపుణుల బృందాలు వెంటనే గ్యాస్‌ బ్లోఅవుట్‌ వద్దకు చేరుకున్నాయి. పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాల నుంచి వచ్చిన అగ్నిమాపక శకటాల సాయం తీసుకున్నారు.

వాటర్‌ అంబ్రెల్లాలతో గ్యాస్‌పై నీటిని ఎగజిమ్ముతూ, కెమికల్స్‌తో కూడిన మడ్‌ను బావిలోకి పంపి బ్లోఅవుట్‌ నియంత్రణకు చర్యలు చేపట్టారు. పది గంటల్లోనే పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో గ్యాస్‌ ప్రెజర్‌ తగ్గి పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఓఎన్జీసీ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ హేమనాథ్‌ ముల్కా తెలిపారు. వెల్‌క్యాపింగ్‌ను విజయవంతంగా చేయడంతో బ్లోఅవుట్‌ అదుపులోకి వచ్చింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత స్థానికులు తమ ఇళ్లకు చేరుకున్నారు.


అసలేం జరిగింది?

నగరం గ్రామంలోని జీసీఎస్‌కు సమీపంలోనే 216 జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓఎన్జీసీకి చెందిన సైట్‌లో ఓ బావిని రెండు దశాబ్దాల క్రితం డ్రిల్లింగ్‌ చేసి వదిలేశారు. అయితే ఆ బావిలో మళ్లీ చమురు, సహజవాయువుల అన్వేషణ కోసం డీప్‌ సంస్థ కాంట్రాక్టు తీసుకుంది. ఈ ఏడాది ఆగస్టులో వర్క్‌ ఓవర్‌ రిగ్‌తో కార్యకలాపాలు ప్రారంభించింది. అక్టోబరు 21న డ్రిల్లింగ్‌ సమయంలో స్వల్పంగా గ్యాస్‌ లీకై శబ్దాలు రావడంతో అప్పట్లోనే ప్రజలు ఆందోళనకు దిగారు.

అయితే కొందరు పెద్దలు సంస్థ ప్రతినిధులతో ఒప్పందం చేసుకున్న నేపథ్యంలో రెవెన్యూ అధికారుల అనుమతితో మళ్లీ రిగ్‌లో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. 2,300 మీటర్ల లోతులో డ్రిల్లింగ్‌ పూర్తి చేసుకుని వెల్‌ క్యాపింగ్‌ చేసేందుకు రిగ్‌ సిబ్బంది సిద్ధమవుతున్న సమయంలో మంగళవారం వేకువజామున 4.30 గంటల సమయంలో గ్యాస్‌ బ్లోఅవుట్‌ సంభవించింది. పెద్ద శబ్దాలతో 3500 పీఎస్‌ఐతో కూడిన గ్యాస్‌ భారీగా ఎగజిమ్మింది. ఈ ఏడాది జనవరి 5న మలికిపురం మండలం ఇరుసుమండలో సంభవించిన గ్యాస్‌ బ్లోఅవుట్‌కు కూడా ఇదే డీప్‌ సంస్థ కారణం.


గత అనుభవాల దృష్ట్యా..

గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కలెక్టర్‌ ఆర్‌.మహేశ్‌కుమార్‌, ఎస్పీ రాహుల్‌మీనా, జనసేన ఎమ్మెల్యేలు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్‌తో ఘటనాస్థలికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. ముందు జాగ్రత్తగా 216 హైవేపై ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు టవర్‌ లైన్లలో విద్యుత్‌ సరఫరా నిలిపివేయడం, చుట్టుపక్కల ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. లీకైన గ్యాస్‌ గాలిలో కలిసినప్పటికీ, ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు.

కలెక్టర్‌ అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ ఘటనా ప్రాంతంలోనే అగ్నిమాపక శకటాలను మోహరించామని, నిపుణుల బృందాలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలిపారు. కాగా, ఇలా వర్క్‌ ఓవర్‌ రిగ్‌తో మూతబడ్డ బావుల్లో చేస్తున్న ప్రయోగాల వల్ల సంభవిస్తున్న ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనలకు గురి చేస్తున్నాయని ఎమ్మెల్యేలు ఓఎన్జీసీ సంస్థల అధికారులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

పరీక్షల పరేషాన్‌

అక్వాన్ తుపానుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

Updated Date - Nov 18 , 2026 | 04:27 AM