కేజీ బేసిన్‌లో భారీగా గ్యాస్ నిక్షేపాలు
ABN , Publish Date - Oct 24 , 2026 | 05:04 AM
చమురు, సహజవాయువు ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో దేశానికి తూర్పు తీరం నుంచి శుభవార్త అందింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో తాజాగా భారీఎత్తున సహజవాయువు నిల్వలు బయటపడ్డాయి.
మత్స్యపురి ఫార్మేషన్‌లో బయటపడ్డ సహజవాయువు
తీర ప్రాంతంలోని గోదావరి-1 బావిలో నిల్వలు
2,024-2,027 మీటర్ల లోతులో కనుగొన్న ఓఐఎల్
రోజుకు లక్ష క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి
170 బ్యారెళ్ల నాణ్యమైన చమురు లభించే అవకాశం
కాకినాడ, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): చమురు, సహజవాయువు ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించాలని ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో దేశానికి తూర్పు తీరం నుంచి శుభవార్త అందింది. కృష్ణా-గోదావరి (కేజీ) బేసిన్‌లో తాజాగా భారీఎత్తున సహజవాయువు నిల్వలు బయటపడ్డాయి. భారత ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ ఇండియా లిమిటెడ్ (ఓఐఎల్) సముద్ర తీరప్రాంత జలాల్లో ఈ నిల్వలను గుర్తించింది. ఇంతకుముందు అంచనా వేయని మత్స్యపురి ఫార్మేషన్‌లో గ్యాస్ నిల్వలు బయటపడ్డాయి. ఇటీవల డిస్కవర్డ్ స్మాల్ ఫీల్డ్ (డీఎస్ఎఫ్) బిడ్స్‌లో తాము దక్కించుకున్న బ్లాక్‌లో సహజవాయువును కనుగొన్నట్లు శుక్రవారం వెల్లడించింది.
కేజీ బేసిన్‌లోని కేజీ-డీఎస్ఎఫ్/జీఎస్‌కేడబ్లూ/ఆఫ్‌షోర్ బ్లాక్‌లోని గోదావరి-1 అప్రైజల్ బావిలో నిల్వలు కనుగొన్నట్లు పేర్కొంది. 2,024 నుంచి 2,027 మీటర్ల లోతులో హైడ్రోకార్బన్ పొరను గుర్తించినట్లు చెప్పింది. ఈనెల 16న ఈ పొర పరీక్షలు ప్రారంభించినట్టు తెలిపింది. పరీక్షల సమయంలో బావి నుంచి రోజుకు లక్ష ప్రామాణిక ఘనపు మీటర్ల (ఎస్‌సీఎండీ) సహజవాయువు రాగా గరిష్ఠంగా 2 లక్షల ఎస్‌సీఎండీ ప్రవాహాన్ని నమోదు చేసినట్టు ఓఐఎల్ పేర్కొంది. దీంతో పాటు రోజుకు సుమారు 170 బ్యారెళ్ల కండెన్సేట్ (నాణ్యమైన చమురు) ఉత్పత్తి నమోదైనట్టు తెలిపింది. తదుపరి ఎగువ పొరలోనూ వాయువు ఉనికిని నిర్ధారించేందుకు పరీక్షలకు సన్నాహాలు చేస్తున్నట్టు వెల్లడించింది.
కాగా, దేశంలో ఆఫ్‌షోర్ బావుల ద్వారా హైడ్రోకార్బన్ల ఉత్పత్తిలో కేజీ బేసిన్ కీలకంగా ఉంది. మొత్తం వినియోగంలో ప్రస్తుతం 6 శాతంగా ఉన్న దేశీయ సహజవాయువు వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కొత్త అన్వేషణ దేశీయ ఉత్పత్తిలో సరికొత్త ఆశలు రేకెత్తిస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల