వైద్య విద్యలో ఏఐ కోర్సులు
ABN , Publish Date - Nov 20 , 2026 | 04:58 AM
వైద్య విద్యలో కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీ డాక్టర్ చంద్రశేఖర్
విజయవాడ, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): వైద్య విద్యలో కృత్రిమ మేధ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు పరిశోధనలు, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ చర్యలు చేపడుతోందని వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు.
ఇందులో భాగంగా కొత్త కోర్సుల రూపకల్పన, ప్రత్యేక పరిశోధన నెట్‌వర్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వీసీ చంద్రశేఖర్ అధ్యక్షతన అనుబంధ వైద్య కళాశాలల ప్రిన్సిపాళ్లు, అకడమిక్ వైస్ ప్రిన్సిపాళ్లు, పరిశోధన కమిటీ సభ్యులతో గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ... విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలన్నారు. పరిశోధన, అభివృద్ధి విభాగం డైరెక్టర్ డాక్టర్ ఎం.లక్ష్మీ సూర్యప్రభ మాట్లాడుతూ... అనుబంధ వైద్య కళాశాలల పరిశోధన విభాగాలు, డీహెచ్‌ఆర్, ఐసీఎంఆర్ సహకారంతో పనిచేస్తున్న మల్టీడిసిప్లినరీ రిసెర్చ్ యూనిట్లను అనుసంధానిస్తూ ప్రత్యేక పరిశోధన నెట్‌వర్క్ ఏర్పాటుకు ప్రతిపాదించినట్టు వెల్లడించారు.
యూజీ, పీజీ విద్యార్థులకు ఏఐ, మెషిన్ లెర్నింగ్‌తో కూడిన కోర్సులు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. సర్టిఫికెట్, డిప్లొమా కోర్సుల రూపకల్పనపైనా చర్చించామన్నారు. వైద్యులు, ఇంజినీర్లు, పరిశోధకులను అనుసంధానిస్తూ అమరావతి స్కూల్ ఆఫ్ బయో డిజైన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించామని చెప్పారు. మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్‌లో ఉన్న వివెన్స్ క్యాంప్‌సలో ఈ స్కూల్‌ను ఏర్పాటు చేసి, డిసెంబరు 7న ప్రారంభించే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు.
ఏపీ తీరానికి అక్వాన్ తుపాను ముప్పు.. గోపాల్‌పూర్ సమీపంలో తీరం దాటే అవకాశం: ఏపీఎస్‌డీఎంఏ