అమెరికా వర్సిటీకి ఎన్‌ఆర్‌ఐ దంపతుల విరాళం
ABN , Publish Date - Oct 06 , 2026 | 06:19 AM
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎ్‌సఎ్‌ఫ)కు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, ఆయన సతీమణి రమ అంబటి దంపతులు రూ.10 కోట్ల విలువైన 1 మిలియన్ డాలర్ల శాశ్వత నిధిని (ఎండోమెంట్) విరాళంగా ప్రకటించారు.
యూసీఎస్‌ఎఫ్‌కు రూ.10 కోట్ల శాశ్వత నిధి ఏర్పాటు
వైద్య విద్య, పరిశోధనలకు వినియోగం
భావితరాల విద్యార్థులకు ప్రయోజనం
గుంటూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో (యూసీఎ్‌సఎ్‌ఫ)కు డాక్టర్ శ్రీమన్నారాయణ అంబటి, ఆయన సతీమణి రమ అంబటి దంపతులు రూ.10 కోట్ల విలువైన 1 మిలియన్ డాలర్ల శాశ్వత నిధిని (ఎండోమెంట్) విరాళంగా ప్రకటించారు. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నోలో జరిగిన కార్యక్రమంలో ఈ విరాళాన్ని యూనివర్సిటీకి అందజేశారు. సాన్ జోవాక్విన్ లోయలో వైద్య విద్య, పరిశోధనలను బలోపేతం చేయడంతోపాటు ప్రతిభ కలిగి, ఆర్థికంగా వెనుకబడిన వైద్య విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించేందుకు ఈ నిధిని వినియోగించనున్నారు. అలాగే గ్రామీణ వైద్యం, అల్ర్టాసౌండ్ టెక్నాలజీ, కుటుంబ వైద్యం తదితర రంగాల్లో వినూత్న పరిశోధనలకు సహకారం అందించనున్నారు.
శాశ్వతంగా కొనసాగనున్న నిధి
ఈ సందర్భంగా యూసీఎస్ఎఫ్ డీన్ డాక్టర్ జోస్ ఎం.భారల్ సాంచేజ్ మాట్లాడుతూ అంబటి దంపతుల విరాళం యూనివర్సిటీ చరిత్రలో ఒక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఎండోమెంట్‌లోని అసలు మొత్తాన్ని పెట్టుబడిగా ఉంచి, దాని ద్వారా వచ్చే వార్షిక ఆదాయాన్ని మాత్రమే విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, పరిశోధనలకు వినియోగిస్తామన్నారు. ఈ నిధి భవిష్యత్ తరాలకు కూడా నిరంతరం ప్రయోజనం చేకూరుస్తుందన్నారు.
సమాజానికి తిరిగి ఇవ్వాలనే ఉద్దేశంతో
డాక్టర్ శ్రీమన్నారాయణ మాట్లాడుతూ మాతృభూమి భారత్‌తోపాటు తాను స్థిరపడిన అమెరికా సమాజం రుణం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ విరాళం అందించినట్లు తెలిపారు. 1986 నుంచి యూసీఎస్ఎఫ్‌లో యూరాలజీ క్లినికల్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, తమ కుటుంబం నాలుగు దశాబ్దాలుగా అమెరికాలో నివసిస్తోందని చెప్పారు. యూసీఎస్ఎఫ్ తనకు వైద్యుడిగా ఎదగడానికి అవకాశం కల్పించిందని, తన సతీమణి రమ ప్రోత్సాహంతో తమ సంపదను తిరిగి సమాజానికి అందించాలనుకున్నామని చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ఏపీలో నాలుగు కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటు.. జీవో జారీ చేసిన ప్రభుత్వం