ప్రాజెక్టుల పూర్తిపై రాజీలేదు!
ABN , Publish Date - Oct 01 , 2026 | 03:57 AM
వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన జలవనరుల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
నీటిభద్రతే లక్ష్యంగా సమగ్ర ప్రణాళిక: సీఎం చంద్రబాబు
పక్కాగా ఇరిగేషన్ క్యాలెండర్ అమలు
జలధార, జలహారతిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలి: బాబు
అమరావతి, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): వివిధ రంగాలకు నీటి భద్రతే లక్ష్యంగా సమగ్ర నీటి ప్రణాళిక రూపొందించాలని, సాగునీటి ప్రాజెక్టుల పూర్తి విషయంలో ఎక్కడా రాజీ పడేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన జలవనరుల శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాగునీరు, సాగునీరు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర ప్రణాళిక తయారుచేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలుకొని.. పంట కాల్వల వరకూ పూర్తి స్థాయి ప్లాన్ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమయంలో ఎత్తిపోతల పథకాలు, మైక్రో ఇరిగేషన్, హైడల్ విద్యుత్ ప్రాజెక్టులు, పంప్ట్ స్టోరేజీ ప్రాజెక్టులను కూడా పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ఇరిగేషన్ క్యాలెండర్‌ను పక్కాగా అమలు చేయాలని చెప్పారు. ఇందులో పొందుపరిచిన ప్రాధాన్య ప్రాజెక్టులను రూ.35 వేల కోట్లతో పూర్తిచేయడానికి సంకల్పించామని గుర్తుచేశారు. క్యాలెండర్‌లో నిర్దేశించుకున్న విధంగా ప్రాజెక్టు పనులను చేపట్టాలని స్పష్టం చేశారు. విశాఖ నగర వాసుల తాగునీరు, పారిశ్రామిక నీటి అవసరాలను తీర్చేందుకు స్వల్పకాలిక, దీర్ఘకాలిక చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అధికారులను ఆదేశించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ ద్వారా కణితి బాలెన్సింగ్ రిజర్వాయర్ వరకు గోదావరి జలాలను నిరంతరాయంగా తరలించే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. అలాగే జలాశయాల నుంచి విశాఖ పరిధిలోని ప్రాంతాలకు క్రమం తప్పకుండా నీరందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
పోలవరానికి పర్యాటక హంగులు
పోలవరం ఆర్ అండ్ ఆర్, భూసేకరణ పురోగతిపై సీఎం ఆరా తీశారు. వచ్చే మార్చి నాటికి ప్రాజెక్టు పనులన్నీ పూర్తి కావలసిందేనని స్పష్టం చేశారు. ఎక్కడా ఇబ్బందులు రాకూడదన్నారు. ప్రాజెక్టును పర్యాటకంగానూ అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఎడమ ప్రధాన కాలువ ద్వారా తరలించే నీటితో వీలైనంత మేరకు అనకాపల్లి జిల్లాలోని రిజర్వాయర్లను పూర్తి స్థాయిలో నింపాలన్నారు. జల సంరక్షణనూ ప్రజా ఉద్యమంగా మలచాలని సూచించారు. ప్రాజెక్టుల నిర్మాణం.. వాటితో కలిగే ప్రయోజనాలు.. నీటి ప్రాధాన్యంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సామాజిక మాద్యమాలను వినియోగించుకోవాలన్నారు. జలధార, జలహారతి వంటి కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి, భూగర్భ జలాల పెంపుతో కలిగే లాభాలను వివరించి ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. సమీక్షలో జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు, సీఎస్ సాయిప్రసాద్, ఆర్థిక, జలవనరుల శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
చింతలపూడికి కేంద్రం లైన్ క్లియర్
సుప్రీం మార్గదర్శకాలతో.. ఈ ప్రాజెక్టుకు రాష్ట్ర అనుమతులు చాలు!
కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఆదేశాలు
రాష్ట్రానికి కేంద్రం నుంచి తీపికబురు అందింది. పెండింగ్‌లో ఉన్న చింతలపూడి ఎత్తిపోతల పథకానికి ఈ ఏడాది జూలైలో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ ఆమోద ముద్ర వేసింది. ఈ పథకం రాష్ట్రం పరిధిలోనిదే కావడంతో రాష్ట్రస్థాయిలో అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు తీసుకుంటే సరిపోతుందని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. 2022 నాటికే ‘టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్- టీవోఆర్’ ఆమోదం పొందినందున.. చింతలపూడి ఎత్తిపోతలకు రాష్ట్ర స్థాయిలోనే పర్యావరణ అటవీ అనుమతులు ఇవ్వవచ్చని తన ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొంది. ఈ ఆదేశాలను బుధవారం సమీక్ష సందర్భంగా జల వనరుల శాఖ ప్రత్యేక సీఎస్ శశిభూషణ్ కుమార్ సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వచ్చే ఏడాది జూన్ నాటికి కాలువ పనులు పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ పథకానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రూ.4500 కోట్ల దాకా వ్యయం చేసింది. మరో రూ.2500 కోట్లు ఖర్చు చేస్తే దీనిని పూర్తిచేసి 5.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని జల వనరుల శాఖ అధికారులు చెబుతున్నారు. అదనంగా మరో రూ.2500 కోట్లు వ్యయం చేస్తే ఇంకో రెండున్నర లక్షల కొత్త ఆయకట్టుకు నీరివ్వవచ్చని అంటున్నారు. ప్రాజెక్టు పూర్తయితే కృష్ణా పరీవాహకంలోని మరిన్ని ప్రాంతాలకు గోదావరి జలాలను తరలించడానికి మార్గం సుగమమవుతుంది. ఈ ఎత్తిపోతల నుంచి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి తరలింపునకు రూ.1500 కోట్ల నుంచి రూ.2000 కోట్ల దాకా వ్యయమవుతుందని అధికారులు చెబుతున్నారు.
ఈ వార్తలనూ చదవండి...
ఉన్నతంగా బతికి... మానసికంగా ‘చితికి’