మొక్కజొన్న మాటున గంజాయి సాగు!
ABN , Publish Date - Oct 16 , 2026 | 05:32 AM
మొక్కజొన్న మాటున గంజాయి సాగు చేస్తున్న వ్యవహారం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో వెలుగుచూసింది. మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే సుమారు రెండెకరాల్లో గంజాయి చేస్తున్నట్లు స్పెషల్బ్రాంచ్ పోలీసులు గుర్తించారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరులో వెలుగులోకి..
స్పెషల్బ్రాంచ్ పోలీసుల ఆపరేషన్
ముగ్గురు అదుపులోకి.. మరికొందరి కోసం గాలింపు
దుత్తలూరు, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): మొక్కజొన్న మాటున గంజాయి సాగు చేస్తున్న వ్యవహారం నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలో వెలుగుచూసింది. మండల కేంద్రానికి కూతవేటు దూరంలోనే సుమారు రెండెకరాల్లో గంజాయి చేస్తున్నట్లు స్పెషల్బ్రాంచ్ పోలీసులు గుర్తించారు. ప్రత్యేక ఆపరేషన్ చేపట్టిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకోగా.. మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. వారి కోసం డ్రోన్ కెమెరాలతో గాలింపు చర్యలు చేపట్టారు. దుత్తలూరు-నందిపాడు మార్గంలోని 565 జాతీయ రహదారికి సమీపాన వెలిగొండ కాలువ లోపలి ప్రాంతంలోని సర్వే నం.1582-2లో 9.50 ఎకరాల విస్తీర్ణం ఉండగా అందులో రెండెకరాల్లో మొక్కజొన్న మాటున గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. దీనిపై ఉప్పందుకున్న స్పెషల్బ్రాంచ్ పోలీసులు గురువారం రంగంలోకి దిగారు. పరిసర ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు. తప్పించుకున్న కొందరి ఆచూకీ కోసం డ్రోన్ కెమెరాల సాయంతో ముమ్మరంగా గాలిస్తున్నారు.
బయటివారిపై అనుమానాలు?
గంజాయి అక్రమ సాగు వెనుక ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన కొందరు ఇక్కడే మకాం వేసి గంజాయి సాగుకు పాల్పడుతున్నారనే ప్రచారం నడుస్తోంది. దుత్తలూరుకు చెందిన ఓ పాత నేరస్థుడి పాత్రపై పోలీసులు దృష్టి సారించినట్లు సమాచారం. మండల కేంద్రానికి సమీపంలోనే ఇంత పెద్ద విస్తీర్ణంలో గంజాయి సాగు వెలుగులోకి రావడం పలు సందేహాలకు తావిస్తోంది. ఈ సాగు ఎప్పటి నుంచి కొనసాగుతోంది? ఇంతకాలం అధికారుల దృష్టికి రాకపోవడానికి కారణాలేమిటి? ఈ వ్యవహారంలో ఇంకా ఎంతమంది ఉన్నారునే కోణాల్లో పోలీసుల దర్యాప్తు సాగాల్సి ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
మహిళలను పారిశ్రామికవేత్తలుగా చేయడమే లక్ష్యం: సీఎం చంద్రబాబు