ఉమ్మడి నెల్లూరులో నేడు ఎన్నికల కౌంటింగ్.. తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
ABN , Publish Date - Nov 03 , 2026 | 07:20 AM
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఉమ్మడి నెల్లూరు, నవంబర్ 3: జిల్లాలో ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని ఒక కార్పొరేషన్‌తో పాటు ఐదు మున్సిపాలిటీల్లో మరికాసేపట్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటలకు అధికారులు కౌంటింగ్‌ను ప్రారంభించనున్నారు. దీంతో నెల్లూరు జిల్లాలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.
తమ రాజకీయ భవితవ్యాన్ని నిర్ణయించనున్న ప్రజాతీర్పు కోసం అభ్యర్థులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌తో పాటు ఆత్మకూరు, నాయుడుపేట, బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, సూళ్లూరుపేట మున్సిపాలిటీల్లో ఓట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఓట్ల లెక్కింపునకు ఒకచోట, మేయర్, మున్సిపల్ చైర్మన్ పదవులకు సంబంధించిన ఓట్ల లెక్కింపునకు మరోచోట ప్రత్యేక టేబుళ్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌లో ఎలాంటి గందరగోళానికి తావులేకుండా అవసరమైన సిబ్బందిని నియమించారు. నెల్లూరు కార్పొరేషన్ మినహా మిగిలిన ఐదు మున్సిపాలిటీల్లో మధ్యాహ్నం సమయానికే తుది ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉండగా, నెల్లూరు కార్పొరేషన్లో మాత్రం సాయంత్రానికి పూర్తి ప్రజాతీర్పు వెలువడే అవకాశం ఉంది. దీంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒక్కో ప్రాంతంలో వెలువడే ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
ఇదిలా ఉంటే.. ఈ నెల 1వ తేదీన నిర్వహించిన ఎన్నికల్లో ఆయా పట్టణ ప్రాంతాల్లో నమోదైన పోలింగ్ శాతం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నెల్లూరు కార్పొరేషన్లో 57.72 శాతం పోలింగ్ నమోదు కాగా, ఆత్మకూరులో 73.09 శాతం, నాయుడుపేటలో 70.7 శాతం, బుచ్చిరెడ్డిపాలెంలో 60.52 శాతం, వెంకటగిరిలో 67.04 శాతం, సూళ్లూరుపేటలో 63.72 శాతం ఓటింగ్ నమోదైంది. ఈ పోలింగ్ సరళి ఎవరికి అనుకూలంగా మారనుందన్నది రాజకీయ పార్టీల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. కేంద్రాల పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేయడంతో పాటు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అనుమతి లేని వ్యక్తులు కౌంటింగ్ కేంద్రాల వద్దకు రాకుండా చర్యలు తీసుకుంటున్నారు. అభ్యర్థులు, వారి అనుచరులు, రాజకీయ పార్టీల నాయకులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. మరికొన్ని గంటల్లో వెలువడనున్న ఫలితాలతో అభ్యర్థుల రాజకీయ భవితవ్యం తేలిపోనుంది.
ఈ వార్తలనూ చదవండి:
త్వరితగతిన రాష్ట్రానికి సాయం అందించండి.. కేంద్రానికి సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
ఏపీ లిక్కర్ స్కామ్.. ఈడీ కస్టడీలో నిందితుడు ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డి