Share News

పోలవరం పనులు భేష్‌

ABN , Publish Date - Nov 29 , 2026 | 04:02 AM

జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ-ఎన్‌డీఎస్ఏ) అధికారిక ప్రతినిధుల బృందం శనివారం తొలిసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్ని పరిశీలించింది.

పోలవరం పనులు భేష్‌

  • సంతృప్తి వ్యక్తం చేసిన ఎన్‌డీఎస్ఏ బృందం

  • ఆనకట్ట భద్రతకు సంబంధించి తొలిసారి పరిశీలన

  • పనుల పురోగతిని వివరించిన అధికారులు

పోలవరం,నవంబరు28(ఆంధ్రజ్యోతి): జాతీయ ఆనకట్ట భద్రతా ప్రాధికార సంస్థ (నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ-ఎన్‌డీఎస్ఏ) అధికారిక ప్రతినిధుల బృందం శనివారం తొలిసారి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాల్ని పరిశీలించింది. ఎన్‌డీఎస్ఏ సదరన్‌ జోన్‌ డైరెక్టర్‌ గిరిధర్‌, డిప్యూటీ డైరెక్టర్‌ హేమాదిత్య బృందం నిర్మాణ ప్రాంతాలైన ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం గ్యాప్‌1, 2 ప్రాంతాలను పరిశీలించారు. ఆనకట్ట భద్రతకు ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, నిర్మాణంలో అనుసరిస్తున్న భద్రతా ప్రమాణాలు, భవిష్యత్తులో చేపట్టనున్న పర్యవేక్షణ వ్యవస్థలు తదితర అంశాలపై ప్రాజెక్టు కార్యాలయంలో జరిగిన సమీక్షలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఎస్‌ఈ పీ.రామచంద్రరావు వివిధ విభాగాల వారీగా పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా బృందానికి వివరించారు.

స్కాడాతో నిరంతర పర్యవేక్షణ

ప్రాజెక్టు భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు అత్యాధునిక సూపర్‌వైజరీ కంట్రోల్‌ అండ్‌ డేటా అక్విజిషన్‌ (స్కాడా) వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ఎన్‌డీఎస్ఏ బృందానికి అధికారులు వివరించారు. సెన్సార్లు, మీటర్లు, వాల్వులు తదితర పరికరాల నుంచి రియల్‌టైమ్‌ డేటాను ఈ వ్యవస్థ సేకరిస్తుందని, తద్వారా ప్రాజెక్టులో వివిధ నిర్మాణాల పనితీరు భద్రత పరిస్థితుల్ని నిరంతరం పర్యవేక్షించే అవకాశం ఉందని బృందానికి వివరించారు.


అత్యవసర కార్యాచరణ ప్రణాళిక రూపకల్పన

ప్రాజెక్టు నిర్మాణానంతరం అ్యతవసర పరిస్థితులు ఎదురైతే సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అత్యవసర కార్యాచరణ ప్రణాళిక (ఎమర్జెన్సీ యాక్షన్‌ ప్లాన్‌)ను ఐఐటీ రూర్కీ రూపొందిస్తోందని ఈ ప్రణాళిక పూర్తయిన వెంటనే ఎన్‌డీఎస్‌ఏకు వివరాలు అందజేస్తామని అధికారులు బృందానికి వివరించారు. అధికారులు, ఇంజనీర్ల ప్రజెంటేషన్‌ పట్ల ఎన్‌డీఎస్ఏ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కార్యక్రమంలో ఈఈలు బాలకృష్ణ శ్రీనివాస్‌, సుబ్రహ్మణ్యం, ఎల్‌వీరావు, మేఘా జీఎం ఎ.గంగాధర్‌, డీజీఎం మురళి పమ్మి తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమరావతి నిర్మాణాలపై వైసీపీ తప్పుడు ప్రచారం.. నిజాలు తేల్చిన ఏపీ ఫ్యాక్ట్‌ చెక్..

నేడే రెండో విడత పల్లె సమరం

Updated Date - Nov 29 , 2026 | 04:10 AM