Share News

విపత్తు వేళ.. సేవా దళం

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:44 AM

భీకర గాలులు... జోరు వర్షం... బయటకు వెళ్లడానికే భయపడేలా మురసు తుఫాన్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు మేమున్నామంటూ భరోసానిచ్చాయి.

విపత్తు వేళ.. సేవా దళం

  • తుఫాన్ల సమయంలో మేమున్నామంటూ భరోసా

  • క్లిష్ట పరిస్థితుల్లోనూ ప్రత్యేకదళాల సహాయక చర్యలు

(బాపట్ల - ఆంధ్రజ్యోతి): భీకర గాలులు... జోరు వర్షం... బయటకు వెళ్లడానికే భయపడేలా మురసు తుఫాన్‌ విలయతాండవం చేస్తున్న వేళ.. ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు మేమున్నామంటూ భరోసానిచ్చాయి. విపత్తు వేళ ఆపదను కూడా లెక్కచేయకుండా ఈ బలగాలు అందించిన సహాయక చర్యలు మరువలేనిది. మురసు ముంచెత్తిన వేళ బాపట్ల జిల్లాలో నాలుగు బృందాలుగా ఏర్పడి విరామం లేకుండా సేవలందించాయి. జిల్లావ్యాప్తంగా 332 చెట్లు నేలకొరిగితే వీటిలో దాదాపు 120 వరకు భారీ వృక్షాలే ఉన్నాయి. దీంతో ప్రత్యేక దళాలు చిమ్మచీకటిలో సైతం రంగంలోకి దిగి ఎక్కడికక్కడ గరిష్ఠంగా గంట వ్యవధిలోనే చెట్లను తొలగించి రాకపోకలకు అంతరాయం లేకుండా చేశాయి. మొత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 136 మంది బాపట్ల జిల్లాకు వచ్చారు. ఇందులో ఎస్‌డీఆర్‌ఎఫ్‌కు సంబంధించి కాకినాడ బెటాలియన్‌ నుంచి 30, నంద్యాల నుంచి 35 మంది వచ్చారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ సిబ్బంది విజయవాడ నుంచి 38, చెన్నై నుంచి 33 మందిని బాపట్లకు కేటాయించారు. మంగళవారం తెల్లవారుజామున సూర్యలంక రోడ్డులో భారీ వృక్షం ఒకటి నేలకొరిగిందనే సమాచారంతో నాలుగు గంటలకే ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళం అక్కడికి చేరుకుంది. హోరుగాలి వీస్తున్నా వెరవక ఆ భారీ వృక్షాన్ని క్లియర్‌ చేసి రాకపోకలకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చూసింది.


కఠిన పరిస్థితుల్లోనూ నేర్పుగా..

అత్యంత కఠినమైన పరిస్థితుల్లోనూ సహాయక చర్యలు చేపట్టగల నైపుణ్యం ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సొంతం. పర్చూరు నియోజకవర్గ పరిధిలో వాగులు పొంగిపొర్లాయి. విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. కరెంటు వైర్లు అస్తవ్యస్తంగా పడిపోయాయి. వాటిని కట్‌ చేయడానికి విద్యుత్‌ సిబ్బంది ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాల సహకారం తీసుకున్నారు. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులూ చేపట్టాల్సి వచ్చింది. ఈ క్రమంలో సహాయక బృందాలు దాదాపు 7 అడుగుల లోతు నీటిలో సైతం పనులు చేపట్టారు. రాత్రివేళ బోటులో వెళ్లి పనులు పూర్తి చేయడంతో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు వారి సేవలను ప్రశంసించారు. ప్రజలను వాగులు, వంకలు దాటించడం, వరదలో చిక్కుకున్న పశువులను కాపాడడం.. ఇలా ఒకటేమిటి దాదాపు ప్రతి సమస్యనూ పరిష్కరించడంలో ప్రత్యేక దళాలు వేగంగా స్పందించారు.

విద్యుత్‌ పునరుద్ధరించడం కోసం..

విద్యుత్‌శాఖ సిబ్బంది 400 మందితో పాటు తమిళనాడు సర్కిల్‌ నుంచి 100 మంది, కర్ణాటక నుంచి మరో 50 మంది సిబ్బంది జిల్లాలోని పర్చూరు నియోజకవర్గంలో విద్యుత్‌ను పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. వీరితో ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బలగాలు సమన్వయం చేసుకుంటూ యుద్ధప్రాతిపదికన పనిచేశాయి. అలాగే.. బాపట్ల జిల్లాలో విద్యుత్‌ పునరుద్ధరణ పనులను విద్యుత్‌శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ నిత్యం పర్యవేక్షిస్తూ సిబ్బందికి సూచనలిస్తున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

ఎన్నికల కమిషనర్లకు జీవితకాల చట్టపరమైన రక్షణ.. సుప్రీంకోర్టులో పిటిషన్

ఫోర్జరీ, చీటింగ్‌ కేసులో సులోచన సహా ముగ్గురికి రిమాండ్‌

Updated Date - Nov 05 , 2026 | 05:44 AM