కన్నతల్లి కళ్లెదుటే కొడుకు సజీవ దహనం
ABN , Publish Date - Nov 25 , 2026 | 04:40 AM
సోలార్ ప్యానల్‌కు సంబంధించిన బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసెకు నిప్పంటుకుని ఓ బాలుడు సజీవ దహనమయ్యాడు.
సోలార్ బ్యాటరీ షార్ట్ సర్క్యూట్‌తో గుడిసెకు మంటలు
నంద్యాల జిల్లాలో పెను విషాదం
కొత్తపల్లి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సోలార్ ప్యానల్‌కు సంబంధించిన బ్యాటరీ షార్ట్ సర్క్యూట్ కారణంగా గుడిసెకు నిప్పంటుకుని ఓ బాలుడు సజీవ దహనమయ్యాడు. నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం బలపాలతిప్ప గ్రామంలో మంగళవారం కన్నతల్లి కళ్లెదుటే ఈ విషాదం చోటుచేసుకుంది. బలపాలతిప్పకు చెందిన కాట్రాజ్ ఈరన్న, నిమ్మల భారతి తమ ఇద్దరు పిల్లలతో కలసి ఓ గుడిసెలో ఉంటున్నారు.
సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం సోలార్ ప్యానెల్‌కు అనుసంధానం చేసిన విద్యుత్ వైర్లకు షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించి గుడిసె తగలబడిపోయింది. దీంతో గుడిసెలో నిద్రిస్తున్న తరుణ్‌చరణ్ అనే ఐదేళ్ల బాలుడు సజీవ దహనమయ్యాడు. ఘటన జరిగిన సమయంలో తండ్రి ఈరన్న కూలి పనులకు వెళ్లగా.. తల్లి భారతి ఇంటికి కొద్ది దూరంలో బట్టలుతుకుతోంది. మంటల వ్యాప్తిని గమనించిన తల్లి బోరున విలపిస్తూ గుడిసె వద్దకు చేరుకున్నప్పటికీ.. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కళ్లెదుటే కొడుకు మంటల్లో విలవిల్లాడుతూ ఆహుతవుతుంటే చూసి తట్టుకోలేకపోయిన తల్లి రోదనలు అందర్నీ కలచివేశాయి. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోలీసులు ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎస్‌ఐపీబీ సమావేశంలో కీలక నిర్ణయాలు
అభ్యర్థులకు ఎస్ఈసీ డెడ్‌లైన్.. డిసెంబర్ 21లోగా ఎన్నికల ఖర్చుల లెక్కలు ఇవ్వండి